ETV Bharat / lifestyle

గంజి నీళ్లను పారబోస్తున్నారా? - ఇలా ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలట!

- గంజి నీళ్లను ఇలా కూడా వాడచ్చు! - ఎలాగో మీకు తెలుసా?

Rice Water
Rice Water (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : April 10, 2026 at 3:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hair Growth With Rice Water : అందమైన ముఖం, పొడవైన, ఒత్తైన జుట్టు కోసం మహిళలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు మార్కెట్లో వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో చూసి బ్యూటీ, హెయిర్ టిప్స్ ​ఫాలో అవుతుంటారు. ఇంకొందరు అమ్మమ్మ, నానమ్మ కాలం నాటి పద్ధతులను పాటిస్తుంటారు. అయితే, రైస్​ వాటర్ వల్ల చర్మ, జట్టు సంరక్షణకు అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

చర్మానికి మేలు చేస్తుంది : బియ్యం నానబెట్టిన నీటిలో అధిక శాతంలో విటమిన్లు, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయంటున్నారు నిపుణులు. చర్మాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో రైస్​ వాటర్​ను వాడడం ద్వారా మన చర్మం మృదువుగా మారుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా, ఇలా చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు. సౌందర్య సాధనాలలో, బియ్యం నీరు చర్మం, జుట్టు సంరక్షణకు సహజమైన, చౌకైన, సమర్థవంతమైన పదార్థంగా ఉపయోగపడుతుందని ijraset ప్రచురించింది.

అందానికి 'పసుపు' నూనె - చర్మం తాజాగా ఉండటంతో పాటు మొటిమలు పోతాయట!

ఫేషియల్ టోనర్​గా : రైస్​ వాటర్​ని ఫేషియల్ టోనర్​గా కూడా వాడొచ్చట. ఒక కాటన్ ప్యాడ్​పై ఈ నీటిని పోసి, దానితో ఫేస్​పై మృదువుగా రాయాలంటున్నారు నిపుణులు. అలా కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలని చెబుతున్నారు. ఇలా వారంలో కనీసం రెండు సార్లు చేయడం ద్వారా చర్మం పొడిబారడం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అలాగే, చర్మంపై ఉండే ముడతలు కూడా క్రమంగా తగ్గుతాయట.

సన్​బర్న్స్​ నుంచి ఉపశమనం : అధిక ఉష్ణోగ్రతల వల్ల సున్నితమైన ప్రదేశాల్లో చర్మం కందిపోతుంది. ఇలాంటి సమయాల్లో రైస్​ వాటర్​ని వినియోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక కాటన్ ప్యాడ్​పై ఈ నీటిని కొద్దిగా వేసి కందిపోయిన ప్రదేశాల్లో మృదువుగా రుద్దమంటున్నారు. దీనివల్ల మంట తగ్గుతుందని సూచిస్తున్నారు.

నిర్జీవంగా మారిన జుట్టుకు : పోషకలేమి, ఎండ, కాలుష్యం కారణం ఏదైతేనేం జుట్టు ఒక్కోసారి నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు జుట్టుకి రైస్​ వాటర్ లేదా గంజిని పట్టించుకోమంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే ఇనోసిటోల్‌ అనే కార్బోహైడ్రేట్‌ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు కుదుళ్లను బలంగా మారచడంతో పాటు జుట్టుకి మెరుపుని ఇస్తాయని పేర్కొంటున్నారు. బియ్యం నీటిలో ఉండే ప్రోటీన్లు జుట్టుకు బలాన్ని ఇచ్చి, తక్కువ సమయంలోనే అది పొడవుగా పెరిగేలా చేస్తాయని World Journal of Pharmacy And Pharmaceutical Sciences ప్రచురించింది.

పట్టుకుచ్చులాంటి జుట్టు : తరచూ బయట తిరిగే వారిలో జుట్టు రాలడంతో పాటు పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు రైస్​ వాటర్​కు కాస్త మజ్జిగ కలిపి తలకు అప్లై చేసుకోవాలంటున్నారు నిపుణులు. 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువ ఉండే షాంపూతో తల స్నానం చేయమని చెబుతున్నారు. ఇలా కొన్ని రోజులు చేస్తే బిరుసెక్కిన జుట్టు కాస్త పట్టుకుచ్చులా మారుతుందని సలహా ఇస్తున్నారు.

చిక్కు సమస్య రానివ్వదు : రైస్ వాటర్​ను తరచుగా జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు మృదువుగా మారడమే కాకుండా చిక్కులు రాకుండా చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా, ఎవరికి నచ్చినట్టుగా.. ఎలాంటి హెయిర్​ స్టైల్​ వేసుకున్నా చిక్కు సమస్య అనేదే ఉండదని తెలియజేస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎండల్లో చర్మం నల్లగా మారిపోతుందా? - ఇలా చేస్తే మెరిసే కాంతి మీ సొంతం!

మీ జుట్టు ఒత్తుగా పెరగాలా? - ఈ పూలు పనికొస్తాయట!