పేపర్ vs స్క్రీన్ - ఎలా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయి!
పుస్తక పఠనంలో సానుకూలత - స్క్రీన్ ఇన్ఫిరియారిటీ అంటే?

Published : October 25, 2025 at 4:09 PM IST
Screen vs Paper Reading: ఓ కథనాన్ని కాగితం మీద చదువుతున్నారా, లేక స్క్రీన్ మీద చదువుతున్నారా అనే దాన్ని బట్టి విషయ సారాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడంలో తేడా ఉంటుందంటే నమ్మగలరా?. కానీ ఇది నిజమని చెబుతున్నాయి పరిశోధనలు!. దీన్నే 'స్రీన్ ఇన్ఫిరియారిటీ ఎఫెక్ట్'గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కాగితంలో చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయా? స్క్రీన్ మీద చదివితే గుర్తుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం!
ఒకే అంశాన్ని కాగితం మీద, డిజిటల్ రూపంలో చదివినప్పుడు, వాటిని గుర్తు పెట్టుకోవడంలో తేడా ఉంటుందంటున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ ఫార్మాట్లో ఉన్న అంశాన్ని చదివితే దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడంలో ఇబ్బంది పడతారట. ఫలితంగా చదువులో వెనకబడే ప్రమాదం ఉందంటున్నారు న్యూరోసైంటిస్టులు. కాగితపు పేజీల్ని కాకుండా స్క్రీన్ చూసి చదివినప్పుడు మెదడు సమాచారాన్ని సంగ్రహించే విధానం మారడమే దీనికి కారణం అంటున్నారు.
పుస్తక పఠనంలో సానుకూలత : ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో, స్క్రీన్ మీద చదివిన వారికి పరీక్ష పెట్టినప్పుడు, స్క్రీన్ రూపంలో చదివినవాళ్లకు తక్కువ మార్కులు వచ్చాయని Oxford Learning అధ్యయనం పేర్కొంది. ఈ తేడాకు కారణం 'స్క్రీన్ ఇన్ఫిరియారిటీ'నే అంటున్నారు. ఒక విషయాన్ని స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ తెరమీద చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో, గుర్తు పెట్టుకోవడంలో బలహీనంగా ఉండటాన్నే న్యూరో సైన్స్ 'స్క్రీన్ ఇన్ఫిరియారిటీ'గా చెబుతోంది.
వాయిదా అలవాటు నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? – ఆచరణలో పెట్టాల్సిన మార్గదర్శకాలు ఇవే!
ఎందుకలా అవుతుంది : స్క్రీన్ మీద చదివేటప్పుడు మెసేజ్‌లు, నోటిఫికేషన్లు వస్తుండటంతో అదే పనిగా స్క్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఈ మల్టీ టాస్కింగ్ విషయ సంగ్రహణ మీద దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మెంటల్ మ్యాపింగ్ ఏర్పడదని అంటున్నారు. పుస్తకంలో, పేపర్లో చదివేటప్పుడు.. అందులో సమాచారం ఉంచిన తీరు, పేజీల్ని తిప్పడం వల్ల సమాచారాన్ని నిక్లిప్తం చేసుకోవడానికి, పునఃశ్చరణకు అవసరమైన సమయం మెదడుకు లభిస్తుందని వివరిస్తున్నారు. అర్థం కాకపోతే నెమ్మదిగా, మళ్లీ వెనక్కి వస్తూ చదువుతారని చెబుతున్నారు. స్క్రీన్ మీద అలా చదువుకుంటూ వెళ్తారు తప్ప, చదివినదాని గురించి పరిశీలనాత్మక, విశ్లేషణాత్మక ధోరణిలో ఆలోచించరని తెలియజేస్తున్నారు.
ఎవరికి నష్టం : చదివే కొద్దీ మెదడులో కొత్త సర్క్యూట్లు ఏర్పడతాయి. దృశ్య, శ్రవణ, భావోద్వేగాల్ని నియంత్రించే ప్రాంతాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. అందువల్ల కాలక్రమంలో క్లిష్టమైన అంశాల్ని అర్థం చేసుకుంటారు. స్క్రీన్‌తో పోల్చితే పుస్తకాలు చదివేవాళ్లలో ఈ కనెక్షన్లు మెరుగ్గా ఏర్పడతాయి. స్క్రీన్ ఇన్ఫిరియారిటీ ఎఫెక్ట్ ప్రభావం అన్ని వయసుల వారిమీదా ఉన్నప్పటికీ, చదువుకునే పిల్లలు, యువత మీద ఎక్కువ, దీర్ఘకాలంలో దీని ప్రభావం వారి నైపుణ్యాలపైనా పడుతుంది.
ఇలా చేయండి :
- చదివే అలవాటు పిల్లల్లో సృజనాత్మకత, ప్రజ్ఞ, సహానుభూతి అలవడేలా చేస్తుంది. వాళ్లు జీవితంలో ఆర్థికంగా విజయవంతమయ్యేలా సాయపడుతుంది. విచక్షణతో వ్యవహరించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంచుతుంది. సామాజిక బాధ్యతా తెలుస్తుంది, లోతుగా, విశ్లేషణాత్మకంగా చదివినప్పుడే ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
- ఇంట్లో భౌతికరూపంలో పుస్తకాలుంటే పిల్లలు వాటిని చదవడం అలవాటు చేసుకుంటారు. తద్వారా గ్రాహకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి.
- పిల్లల స్క్రీన్ టైమ్‌ని పరిమితం చేయండి. ఇంట్లో పెద్దవాళ్లు పత్రికలూ, పుస్తకాలూ చదువుతుంటే పిల్లలకూ అలవాటు అవుతుంది. ఇది వారి కెరియర్ విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది.
అనునిత్యం టాస్క్‌లతో పరిగెడుతున్నారా? - ఒక్క క్షణం రిలాక్స్ అవ్వాలట!
మీ పిల్లలు స్కూల్‌కు, ట్యూషన్‌కు ఒంటరిగా వెళ్తున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పనిసరట!

