టీనేజ్ పిల్లల్లో ఎన్నో ఆలోచనలు - అర్థం చేసుకుంటే అన్నీ హ్యాపీడేసే!
వయసు పెరుగుదలతో శారీరక, మానసిక మార్పులు - తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలంటున్న నిపుణులు!

Published : January 14, 2026 at 5:01 PM IST
Parents Care for Teenage Childs : అటు ఇటు కాని వయసు, ఉరకలు వేసే మనసు. ఈ సమయంలో కొన్ని ఉద్రిక్తతలు, ఇంకొన్ని ఉద్వేగాలు మనసును అతలాకుతలం చేస్తుంటే, వాటిని ఎదుర్కెవడం ఎలా? ఈ సమయంలో తల్లిదండ్రుల అనుభవసారాన్ని పిల్లలు, పిల్లల మనసు చేసే గొడవను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే, అన్నీ హ్యాపీడేసే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
చదువు, సామాజిక అంచనాలు, డిజిటల్ ఉద్వేగాలతో యువతలో బర్న్అవుట్, ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో 70 శాతం మంది టీనేజర్లలో మధ్యస్థం నుంచి తీవ్రస్థాయి ఆందోళనలు ఉంటున్నాయని ఏషియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ప్రచురించింది. వీరిలో కొందరు ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
చలికాలంలో మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఏపుగా పెరగాలా? - ఈ టిప్స్ మేలు చేస్తాయట!
ఎందుకిలా :
- కౌమారదశలో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోలేకపోవడం, సామాజిక గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు, డిజిటల్ ప్రభావం వారికి తెలియకుండానే మానసిక ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.
- తక్కువ నిద్ర, సోషల్ మీడియాలో ఎక్కువగా చూడడం, శారీరక శ్రమ లేకపోవడం, విద్యా సంబంధ డిమాండ్ టీనేజర్లలో బర్న్అవుట్కు (ఆందోళన) కారణంగా నిలుస్తున్నాయి.
- తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా స్క్రీన్లు లేదా సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల టీనేజర్లు సైబర్ బెదిరింపులకూ గురవుతున్నారు.
- ఇతరులతో మంచి సంబంధాలు లేకపోవడం, బుల్లీయింగ్ కూడా ఆందోళనకు కారణమవుతున్నాయి.
- యుక్త వయసులో హార్మోన్ల మార్పు జరుగుతుంది. ఇవి కూడా భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి.
ఇలా ఉంటే జాగ్రత్త :
- నిరంతర అలసట
- తక్కువ ఏకాగ్రత
- మూడ్ స్వింగ్స్
- ఆకలి లేకపోవడం
- తరచుగా ఒళ్లు నొప్పులు
- స్వీయ వ్యక్తీకరణ లేకపోవడం లాంటి వాటి లక్షణాలను గుర్తిస్తే తల్లిదండ్రులు, పాఠశాలలు జాగ్రత్త తీసుకోవాలి.
ఏం చేయాలి? :
- టీనేజీ పిల్లల్లో ఆందోళన నివారించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఉమ్మడి కృషి అవసరం.
- భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో పిల్లలకు చెప్పాలి.
- టీనేజర్ల ఒత్తిడి, ఆందోళన, బాధను గుర్తించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి
- సృజనాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
- వ్యాయామం చేయించాలి లేదా ఆటలు ఆడించాలి.
- రోజుకు కనీసం 8 గంటల నుంచి 9 గంటల నిద్ర ఉండాలి.
అలాగే, కౌమారంలోకి అడుగుపెట్టే వయసులో, భావోద్వేగాలను అర్థం చేసుకుని, సరైన దారిలో నడిపించే వారు లేక పిల్లలు దారితప్పుతున్నారు. ఏది మంచి? ఏది చెడు? అన్న విచక్షణ తెలీని పరిస్థితుల్లో వాళ్లు మంచి అనుకున్న దారిలో పయనిస్తున్నారు. అపరిపక్వ ప్రేమబంధాల్లో చిక్కుకుంటున్నారు.
పేరెంట్స్ నిర్లక్ష్యం :
- భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లలపై శ్రద్ధ, పర్యవేక్షణ కొరవడుతున్నాయి. ఎలా పెరుగుతున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? అన్న విషయాలు తెలుసుకోవడం లేదు. మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడుతుంటారు. ఈ ప్రభావం కూడా చిన్నారుల మనసులపై తీవ్రంగా ఉంటోంది.
- పిల్లలు ఫోన్లు, ట్యాబ్‌లకు బానిసలవుతున్నారు. సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతున్నారు. ఇన్‌స్టా, రీల్స్, షార్ట్స్‌తో కాలం గడిపేస్తున్నారు. ఇదే సమయంలో డిజిటల్ స్నేహాలతో దారి తప్పుతున్నారు.
- ఇంట్లో పెద్దల నుంచి పొందలేని ప్రేమ, ఆప్యాయత వేరేవాళ్ల నుంచి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు భావోద్వేగాలను తట్టుకునేందుకు మద్యం, గంజాయి, డ్రగ్స్‌లకు అలవాటుపడుతున్నారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి? :
- పిల్లలకు భావోద్వేగ భద్రతనివ్వాలి. వారు ఏదైనా చెప్పగలిగే వాతావరణం ఇంట్లో ఉండేలా చూడాలి. ముందే తీర్పు ఇవ్వకుండా వారు చెప్పింది వినాలి.
- ఇళ్లలో అనుబంధాలు కొరవడితే, పిల్లలు ఆ లోటును బయట భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకే, పిల్లలకు సమయాన్ని కేటాయించాలి.
- అమ్మాయిలతో లేదా అబ్బాయిలతో మాట్లాడవద్దు అని చెప్పడం కాకుండా, భావోద్వేగ హద్దులు, పరస్పర గౌరవం, సంస్కారం, చదువు, కెరీర్ ప్రాధాన్యతను వివరించాలి.
- స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు పర్యవేక్షణ కూడా ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గం చూపాలి.
- పిల్లలకు ఫోన్, ట్యాబ్ ఇవ్వాల్సి వస్తే, వాటిపై తప్పనిసరిగా పర్యవేక్షణ, అదుపు ఉండాలి. పేరెంటల్ కంట్రోల్ టూల్స్ వాడడం మేలు.
ఆటపాటలతో "ఆ రెండు లాభాలు" - చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యమే!
"సంక్రాంతి"కి ఊరెళ్తున్నారా? - ఇంట్లో ఈ పనులు చేసి వెళ్లడం తప్పనిసరి!

