ETV Bharat / lifestyle

పిల్లల బ్రేకప్ బాధను పోగొట్టాడానికి! - పేరెంట్స్​కు నిపుణుల సూచనలివే!!

- పిల్లలు ప్రేమలో విఫలమైన తర్వాత తల్లిదండ్రులు ఇలా చేస్తే బెటర్ అంటున్న ఎక్స్​పర్ట్స్​!ొ

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : June 27, 2026 at 10:02 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ways to Help your Teen Deal with a Breakup : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. అయితే, దీన్ని ఎంత వరకు తీసుకెళ్తారనేది ప్రేమికుల మానసిక పరిణతి, ఒకరినొకరు అర్ధం చేసుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇక వివిధ కారణాల వల్ల ఇద్దరూ విడిపోతుంటారు. అయితే, పిల్లలు ఆ బాధ నుంచి బయటపడే క్రమంలో వారికి పేరెంట్స్ అండగా నిలవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

ఓదార్చే మాటలు : చాలామంది పేరెంట్స్​ ప్రేమన్నా, బ్రేకప్ అన్నా జీర్ణించుకోలేరు. అందుకు అంగీకరించలేరు కూడా! ఈ క్రమంలో వాళ్లేదో తప్పు చేసినట్లుగా చూస్తుంటారు. అందుకే, బ్రేకప్ విషయం తెలిసినా, పిల్లలే నోరు తెరిచి చెప్పినా చీవాట్లు పెడతారు. వాస్తవానికి, ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో పిల్లలతో ఎంత స్నేహంగా ఉంటే.. వాళ్లు తమ బాధను అంత సునాయాసంగా పంచుకోగలుగుతారని చెబుతున్నారు. తద్వారా ఆ మానసిక వేదన నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటప్పుడు పేరెంట్స్ పిల్లలతో ఓదార్పు నిచ్చే మాటలు మాట్లాడాలని తెలియజేస్తున్నారు. దీంతో వారు బ్రేకప్ బాధ నుంచి త్వరగా బయటపడి తమ భవిష్యత్తుపై తిరిగి దృష్టి పెట్టగలుగుతారని వివరిస్తున్నారు.

ఓ సారి "వెనుకడుగు" వేసి చూడండి! - నడుము, కీళ్ల నొప్పలకు ఉపశమనం!

ముందు వినండి : మనసులోని బాధను పంచుకున్నప్పుడే గుండె భారం దిగుతుందని పెద్దవాళ్లు అంటుంటారు. అయితే, పిల్లలు తమ మనసులోని మాటలు వినేదేంటన్న ఉద్దేశంతో మధ్యలోనే ఆ టాపిక్ కట్ చేయడం, లేనిపోని నిబంధనలన్నీ వారిపై రుద్దడం చేస్తుంటారట. అసలే బ్రేకప్ బాధలో ఉన్న పిల్లలతో ఇలా ప్రవర్తించడం మంచిది కాదంటున్నారు నిపుణులు. తమ ప్రేమ, బ్రేకప్​కు దారి తీసిన కారణాలు గురించి అసలు వాళ్లేం చెప్పాలనుకుంటున్నారో ముందు ఓపికతో వినడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. తద్వారా వాళ్లు ఏదీ దాచుకోకుండా అన్ని విషయాలు మీతో పంచుకునే అవకాశం వారికి దొరుకుతుందంటున్నారు.

సోషల్ మీడియాకు దూరంగా : కొందరు తమ ప్రేమ, బ్రేకప్ వంటి అంశాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ పొరపాటు చేయకుండా పేరెంట్స్ తమ పిల్లల్ని అదుపు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

మనసు మళ్లించండి : కెరీర్, ఇతర బాధ్యతల రీత్యా చాలామంది పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. కానీ, బ్రేకప్ బాధలో కూరుకుపోయిన టీనేజ్ పిల్లల విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం వద్దంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాళ్లకు మరింత సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఆ బాధ నుంచి వాళ్ల మనసు మళ్లించే ప్రయత్నం చేయడం మంచిదని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా, వీలైతే కుటుంబమంతా కలిసి వెకేషన్​కు వెళ్లడం, పిల్లల్ని తమకు నచ్చిన అంశాల్లో ప్రోత్సహించడం, యోగా - మెడిటేషన్​కు సంబంధించిన తరగతుల్లో వారిని చేర్పించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఇవన్నీ వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయట.

అయితే, బ్రేకప్ బాధ నుంచి పిల్లలు త్వరగా బయటపడేందుకు వారికి అన్ని విషయాల్లో అండగా ఉన్నప్పటికీ, వాళ్లు ఒంటరిగా, ముభావంగా కనిపించడం, ఎవరితోనూ కలవడానికి ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం మానసిక నిపుణుల సంప్రదించాలట. తద్వారా వారిలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

వయస్సు పెరగడం సహజమే - యవ్వనం మీ చేతుల్లోనే ఉందని తెలుసా!

"పని భారం, ఒత్తిడి"తో అలసిపోతున్నారా? - మీ ప్రాధాన్యతలను మార్చుకోమంటున్నారు నిపుణులు!