మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? - ఎలా గుర్తించాలో తెలుసా?
కల్తీ పాలతో అనేక ఆరోగ్య సమస్యలు - గుర్తించడానికి సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Published : March 4, 2026 at 9:53 AM IST
Tips for Recognise Adulterated Milk : పాలు అనేక రకాల పోషకాలతో నిండి ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. పాలలోని పోషకాలు మనకు శక్తితో పాటు రక్షణనూ ఇస్తాయి. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. కాసులకు కక్కుర్తిపడి సంపూర్ణ ఆహారమైన పాలను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. ఈ క్రమంలో మనం తాగుతున్న పాలు సురక్షితమైనా అన్న ఒకింత సందేహం కలగక మానదు. పాలలో కల్తీ తెలుసుకోవడానికి సులువైనా మార్గం ఉందంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
కల్తీపాల వల్ల :
- పాలు చిక్కగా ఉండడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి.. నీళ్లు, యూరియా, గంజి, డిటర్జెంట్, ఫర్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికారక పదార్థాలు కలుపుతున్నారు. ఇవి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. పాలు చిక్కగా కనిపించడానికి పిండిపదార్థం, నురుగు బాగా రావడానికి ఉపయోగిస్తుంటారు. సింథటిక్ రసాయన పదార్థాలతో ప్రోటీన్ శాతం పెరిగినట్లు చూపిస్తుంటారు.
- వివిధ రసాయనాలతో కల్తీ చేసిన పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రభావాలు తీవ్రంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఫార్మాలిన్ కు గురికావడం వల్ల వికారం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి, అధిక మోతాదులో శరీర ఉష్ణోగ్రత తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పల్స్ బలహీనపడటం, అపస్మారక స్థితికి దారితీస్తుందని sciencedirect అధ్యయనం పేర్కొంది. ఫార్మాలిన్ కు గురికావడం వల్ల దృశ్య నాడికి కూడా హాని కలుగుతుంది, ఇది అంధత్వానికి దారితీస్తుందట.
మీ పిల్లలు సరిగా నిద్ర పోవట్లేదా? - కారణాలు ఇవే కావొచ్చట!
పరీక్షలు ఇలా :
నీరు : నున్నగా ఉన్న నాపరాయి మీద పాల చుక్కను వేసి గమనించాలి. నీళ్లు కలపని పాలు అయితే రాయి మీద మరకని వదులుతూ నెమ్మదిగా కదులుతూ తెల్ల గీతలా ఏర్పడుతుంది. ఎక్కువ నీళ్లతో కల్తీవైతే మరకలు లేకుండా వేగంగా జారతాయి. తెల్లటి గీత లాంటిది ఏర్పడదు.
డిటర్జెంట్ : ఒక బాటిల్లో సమానంగా పాలు, నీళ్లను తీసుకొని బాగా ఊపాలి. స్వచ్ఛమైన పాల పైన వెన్నతో పాటు పల్చటి లేయర్ ఏర్పడుతుంది. డిటర్జెంట్ కలిపిన పాలు అయితే మందంగా నురుగ పేరుకుంటుంది.
స్టార్చ్ : చేతివేలిని పాలలో ముంచితే చిక్కగా అనిపిస్తుంది. దీంతో నాణ్యమైన పాలు అనుకుంటారు చాలామంది. కానీ, పిండి పదార్థం (స్టార్చ్) కలుపుతున్నారు. అయితే, కొద్దిగా పాలను వేడి చేసి, చల్లారాక రెండు చుక్కల అయోడిన్ సొల్యూషన్ని వేయాలి. ప్యూర్ మిల్క్ అయితే రంగు మారవు లేదా లేత పసుపు రంగులోకి మారతాయి. గంజి, పిండి పదార్థాలు కలిపితే నీలి రంగులోకి మారతాయి.
యూరియా : కొద్దిగా పాలు తీసుకొని చెంచా సోయాబీన్ పొడి లేదా కందిపప్పు పొడిని కలపాలి. దీంట్లో ఎరుపు లిట్మస్ పేపర్ని ఉంచాలి. స్వచ్ఛమైనవైతే కొద్దిసేపటి తర్వాత పాలు ఎరుపు రంగులో ఉంటాయి. యూరియా కలిపినవైతే నీలి రంగులోకి మారతాయి.
సింథటిక్ : పాల చుక్కను వేళ్ల మధ్య రుద్దాలి. సబ్బు లాంటి లేదా జారే భావం ఉంటే సింథటిక్వి అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ, సాధారణ మృదుత్వం ఉంటే సహజమైనవి అంటున్నారు నిపుణులు.
టెస్టింగ్ : పాల కల్తీని గుర్తించేందుకు 'మిల్క్ అడల్ట్రేషన్ టెస్టింగ్' కిట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటి ద్వారానూ ఇంట్లోనే కల్తీని కనిపెట్టొచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"బ్రేక్ ఫాస్ట్" మానేస్తున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
"వాహ్! క్యా చీజ్ హై" - ఈ విషయాలు తెలిస్తే చీజ్ అస్సలు వదలరు!

