అబ్బాయిలూ పాత్రలు కడుగుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
ధ్యానం, యోగాల మాదిరిగానే - మనసుకు సాంత్వన కలిగిస్తుందంటున్నారు పరిశోధకులు!

Published : October 28, 2025 at 1:57 PM IST
Man Washing Dishes Benefits : ఇంట్లో పనిచేసే అమ్మాయి రాలేదు. భార్య వేరే పనుల్లో తలమునకలై ఉంది. మరోవైపు షింక్ నిండా గిన్నెలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడేం చేద్దాం అని ఆలోచిస్తున్నారా? అంట్లు తోమే పని మాది కాదంటూ దూరంగా ఉండొద్దు. అస్సలు నామోషీ పడకుండా, ఇంకో ఆలోచన లేకుండా ఆ పని చేయమంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇంట్లో ఇల్లాలి శ్రమ మాత్రమే కాదు, మన బుర్రలో పేరుకుపోయిన ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. పాత్రలపై ఉన్న మురికి ఎలా జారిపోతుందో అలాగే మనసులో ఉన్న ఆందోళన కూడా పటాపంచలైపోతుందని వివరిస్తున్నారు. మరి, ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
ఒత్తిడి చిత్తు : పాత్రలు కడగటం, ఆడామగా తేడా లేకుండా ఇద్దరికీ మంచిదంటున్నారు నిపుణులు. ఆఫీస్ టాస్క్‌లతో హీటెక్కిపోయిన మెదడుకైతే ఇంకా మేలని చెబుతున్నారు. ఈ పనితో ఒత్తిడి, ఆందోళనలు దూరం అవుతాయని తెలియజేస్తున్నారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేసి సశాస్త్రీయంగా చెప్పిన విషయమిది.
మీ ఇంట్లో డబ్బు, నగలు మాయం అవుతున్నాయా? - వారిని అనుమానించాల్సిందేనట!
వ్యాయామం లాంటిది : డిటర్జెంట్ లోషన్ లేదా సోప్, బూడిద, రంపపు పొట్టుతో పాత్రను రుద్ది, ఆపై ట్యాప్‌లోని నీళ్లతో కడుగుతుంటే, అవి చేతుల మీదుగా జారి పాత్ర శుభ్రమవుతున్నప్పుడు కలిగే ఆనందమే వేరని నిపుణులు అంటున్నారు. గడువుకన్నా రెండు రోజుల ముందే ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడు కలిగే సంతోషంతో పోలిస్తే, శుభ్రం చేశాక తళతళ మెరిసే పాత్రల్ని చూసినప్పుడు కలిగే ఆనందమే ఎక్కువని చెబుతున్నారు. పాత్రలకున్న జిడ్డు, అవశేషాలన్నీ తొలగిపోయి పరిశుభ్రంగా ఉన్నట్లే, మనలోని ప్రతికూల భావనలన్నీ పోయి మనసూ తేలికపడుతుందని వివరిస్తున్నారు. వాటిని శుభ్రం చేసినప్పుడు సంతృప్తిని కలిగించే డోపమైన్ విడుదలవుతుందని, దాంతో విజయం సాధించామన్న భావన కలుగుతుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, కడిగేటప్పుడు అరచేతుల్లోని నాడులన్నీ ఉత్తేజితమవుతాయని, కండరాలకీ శ్రమ ఉంటుందని వెల్లడిస్తున్నారు. కాబట్టి, ఇలా చేయడం వల్ల మానసికంగానూ, శారీరకంగానూ కూడా మంచిదేనని అంటున్నారు.
ఆందోళన, ఆలోచనలు పరార్ : పాత్రలు కడిగేటప్పుడు దృష్టి మొత్తం పాత్రలకున్న జిడ్డుని వదిలించడం, ట్యాప్‌లోంచి వచ్చే నీళ్ల మీదే ఉంటుంది కాబట్టి ఏకాగ్రత, ఫోకస్ పెరుగుతాయంటున్నారు నిపుణులు. సబ్బు వాసన, బుడగల్లో కనిపించే రంగులు, చేతుల్లోకి తీసుకునే పాత్ర స్పర్శ, నీటి శబ్దం, ఏకకాలంలో అనేక ఇంద్రియాలు పనిచేయడంతో ఆందోళన, ఆలోచనలు తగ్గి ప్రశాంతత నెలకొంటుందని చెబుతున్నారు. నీళ్లకీ, గాలికీ మధ్య ఉన్న ఉష్ణోగ్రతల వ్యత్యాసం.. ప్రత్యేక సెన్సరీ ఫీల్‌ని ఇస్తుందని తెలియజేస్తున్నారు. మెదడుని డీపాల్డ్ మోడ్ నుంచి వర్తమాన స్థితికి తీసుకొస్తుందని, దీన్నే న్యూరో సైంటిస్టులు ప్రవాహ స్థితి అంటున్నారు. దీంతో మైండ్‌ఫుల్‌నెస్ అలవడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా, ఈ పని పారా సింపథటిక్ నాడీ వ్యవస్థను మేల్కొలిపి శరీరం సహజంగానే రిలాక్సయ్యేలా చేస్తుందని వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియా, స్క్రోలింగ్, టీవీ చూడటం కన్నా హాయిని కలగిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద 27 శాతం భయం తగ్గి, 25 శాతం మానసిక ప్రేరణని పెంచుతుందని పరిశోధకులు తేల్చారు.
ఇలా చేయండి : పాత్రలు కడగటాన్ని ఓ రకం ధ్యానమో, యోగానో అనుకుని, అభ్యాసంలా చేయాలని నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా పాత్రలను కడగడం అలవాటు చేసుకోవాలంటున్నారు. సింక్‌లోని పాత్రలు మనకు సాంత్వన కలిగించే అద్భుత పరికరాలుగా భావించాలని తెలియజేస్తున్నారు. వీటిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలని, రోజూ కుదరకపోతే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు చేయమని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
అనునిత్యం టాస్క్‌లతో పరిగెడుతున్నారా? - ఒక్క క్షణం రిలాక్స్ అవ్వాలట!
"మనుషులు జుత్తుతో ఆకర్షణీయంగా కనిపిస్తారా? - షేవ్డ్ హెడ్తోనా?" - మీకు తెలుసా?

