మీ పిల్లలు ఫోన్ వదలడం లేదా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!
- ఇంట్లో పిల్లలు అతిగా మొబైల్ చూస్తుంటే ఇలా చేయాలంటున్న ఎక్స్పర్ట్స్!

Published : May 2, 2026 at 4:06 PM IST
How To Keep Children Away From Phones : ప్రస్తుతం పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది పేరెంట్స్ పిల్లల చేతుల్లో ఫోన్లు పెట్టేసి, వారి పనుల్లో మునిగిపోతున్నారు. సెల్ఫోన్లకు అలవాటు పడటం వల్ల పిల్లలకు పలు రకాల సమస్యల తాకిడి పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలు ఫోన్లతో ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చేయాలి? పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
ఈ రోజుల్లో పిల్లలకు ఫోన్లూ, డిజిటల్ పరికరాలే ప్రపంచమవుతున్నాయి. ఇంట్లో ఉన్నంత సేపు సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ గంటల తరబడి ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. మరి, పిల్లల్లో ఈ వ్యసనానికి అడ్డుకట్ట వేయాడానికి.. తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
పిల్లలతో కలిసి : ముందుగా తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుసరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. వారి ముందు తల్లిదండ్రులు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవటం, కబుర్లూ చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారట. ఈ క్రమంలో పిల్లలు టీవీ, ఫోన్లను వాడుతున్నప్పుడు వారిని గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. మీ పర్యవేక్షణలోనే వాళ్లు ఉండే విధంగా చూసుకోమంటున్నారు. ఏదైనా సినిమా లేదా షోలైనా పిల్లలతో కలిసి పేరెంట్స్ చూడమని సలహా ఇస్తున్నారు. కేవలం వినోదం కోసం కార్టూన్ బొమ్మలు కాకుండా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని విజ్ఞానం అందించే విషయాలను పిల్లలకు తెలియజేయాలంటున్నారు.
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే - ముఖం అందంగా మెరిసిపోతుందట!
కాసేపు సరదాగా : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు కాస్త అల్లరి చేయగానే ఏడుపు ఆపటానికి ఫోన్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని.. పిల్లలు ఏడ్చి మరి ఫోన్ తీసుకోవాలనే ఆలోచన ధోరణి వారిలో పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు. పిల్లలు ఏడ్చినా, అలిగిన వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలని సలహా ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుకునేందుకు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించామని పేర్కొంటున్నారు. ఇలా తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకునే విధానం అలవడుతుందని వివరిస్తున్నారు. ఫోన్లకు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా ఉంటారని తెలియజేస్తున్నారు.
ఏం చేయాలంటే : రెండేళ్లలోపు పిల్లలకు అసలు స్క్రీన్ సమయం ఉండకూడదని లేదా పరిమితంగా ఉండాలని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ పేర్కొంది. ఈ వయస్సు ఉన్న పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం ద్వారా, ఇతర పిల్లలు, పెద్దలతో ఆడుకోవడం ద్వారా బాగా నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే అలవాటు ఉన్న వారి నుంచి ఫోన్లు, టీవీలను ఒక్కసారిగా దూరం చేయకుండా, నెమ్మదిగా మాన్పించాలని సూచిస్తున్నారు. అలాకాకుండా, ఉన్నట్టుండి వారి నుంచి దాన్ని తీసుకుంటే.. కోపం, బాధ, మొండితనం వంటివి ఎక్కువై మన ఊహకు అందని పనులు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు.

