"మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా?" - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
మోచేతులు మెరిసేలా - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు

Published : October 22, 2025 at 1:59 PM IST
Ways to Lighten Dark Knees and Elbows Naturally : అందంగా, యవ్వనంగా, కోమలంగా మెరిసే చర్మం కావాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? అందుకే, అమ్మాయిలు ముఖంతో పాటు పాదాలు, చేతుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ క్రమంలో తరచూ పార్లర్‌లో పెడిక్యూర్, మానిక్యూర్ చేయించుకుంటారు. అయితే, ఇంత చేసినా కొందరిలో మోచేతులు, మోకాళ్లు, కాలిమడమలపై చర్మం నల్లగా, గరుకుగా మారుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు మన ఇంట్లోనే బోలెడున్నాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

కలబందతో : ఆరోగ్యం, అందానికి మేలు చేసే పదార్థాల్లో కలబంద ముందు వరుసలో ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉపయోగించి మోచేతులు, మోకాళ్లు నలుపును సులభంగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. దీనికోసం కలబంద గుజ్జును మోచేతులు, మోకాళ్లపై నల్లగా ఉన్న చోట రాసుకోవాలని, ఆ తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఇలా రోజుకి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. కలబందలో ఉన్న పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంతో పాటు మృదువుగా మార్చుతాయని వివరిస్తున్నారు.
జుట్టు తెల్లబడిందని రంగు వేస్తున్నారా? - అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

చక్కెరతో : కొందరిలో మోచేతుల దగ్గర చర్మం మరీ నల్లగా ఉంటుంది. అలాంటి వారు చక్కెర ఉపయోగిస్తే చక్కని ఫలితం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. దీనికోసం ఒక టీస్పూన్ ఆలివ్ నూనెలో కొద్దిగా చక్కెర వేసి బరకగా ఉన్న మిశ్రమంలా కలుపుకోవాలని చెబుతున్నారు. దీన్ని నల్లగా మారిన మోచేతులపై రాసుకొని 10-15 నిమిషాల పాటు మర్దన చేసుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. చక్కర మంచి స్క్రబ్‌లా పని చేసి మృతకణాలను తొలగిస్తుందని, ఆలివ్ నూనె చర్మం మృదువుగా మారేందుకు తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ఇలా రోజుకోసారి చేస్తే క్రమంగా మోచేతులపై నలుపు కనుమరుగవుతుందని తెలియజేస్తున్నారు.
కొబ్బరినూనెతో : ఇందులో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు చర్మానికి పోషణనందించి మృదువుగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ స్నానం చేసిన వెంటనే మోచేతులు, మోకాళ్లపై కాస్త కొబ్బరినూనె రాసుకొని రెండు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇలా రోజూ చేయడం వల్ల అక్కడి చర్మం మృదువుగా తయారవుతుందని పేర్కొంటున్నారు. కొబ్బరినూనెలో అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని మోచేతులకు రాసుకొని 15-20 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలని తెలియజేస్తున్నారు. తర్వాత టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇలా తరచూ చేస్తూ ఉంటే మోచేతులపై ఉన్న నలుపు క్రమంగా మాయమవుతుందని అంటున్నారు.

నిమ్మతో : నిమ్మ మంచి క్లెన్సర్‌గా పనిచేసి మృతకణాలను సమర్థంగా తొలగిస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం నిమ్మచెక్కను తీసుకొని మోచేతులపై నలుపుగా ఉన్న చోట కాసేపు రుద్ది, ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలని పేర్కొంటున్నారు. ఇలా రెండు రోజులకోసారి చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. నిమ్మచెక్కను ఉప్పులో ముంచి రుద్దినా మోచేతులపై ఉన్న నలుపును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

పెరుగుతో : ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల పెరుగు, కొద్దిగా వైట్ వెనిగర్ తీసుకొని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని నల్లగా మారిన మోచేతులకు, మోకాళ్లకు రాసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుని, టవల్‌తో పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపుదనం తగ్గుతుందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సోషల్ మీడియాలో చూసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
సిజేరియన్ తర్వాత ఆందోళన అవసరం లేదు! - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

