ఇలా చేస్తే ముద్ద 'మందారం'లా మెరిసిపోతారు - ఒత్తైన కురులే కాదు అందానికీ మేలు చేసే మందార!
మందారం పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చంటున్న నిపుణులు!

Published : November 4, 2025 at 4:00 PM IST
Hibiscus Benefits : మన ముంగిట్లో మొక్కలెన్ని ఉన్నా, మందారం ప్రత్యేకం. రకరకాల వర్ణాలు, ఆకృతుల్లో పెద్ద పెద్ద పూలతో నిండుగా విరబూస్తుంది. ఈ క్రమంలో మందారం అనగానే ఒత్తైన కురులే గుర్తుకొస్తాయి. అంతేకాకుండా, ఈ పువ్వులు అందానికి కూడా సాయపడతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మందార పువ్వులు కేశ, చర్మసంరక్షణలో ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం!
కురుల పోషణకు : మందార పువ్వులు, ఆకుల్లో అమైనో ఆమ్లాలు, వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి కుదుళ్లను బలంగా మార్చి జుట్టు ఎదుగుదలకు ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా, జుట్టు నిర్జీవంగా కనిపించినప్పుడు, మందార పూలను మెత్తగా రుబ్బి దానికి కాస్త పెరుగు కలిపి తలకు రాసుకోవాలని సూచిస్తున్నారు. అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్టకుండా ఉండటంతో పాటు జుట్టు రాలడమూ తగ్గుతుందంటున్నారు. మందార పువ్వు, ఆకులు చాలా శ్లేష్మం కలిగి ఉంటాయని, ఇది సహజ కండిషనర్‌గా పనిచేస్తుందని International Journal of Trend in Scientific Research and Development ప్రచురించింది.
మందార పువ్వుల్ని పేస్ట్ చేసి అందులో కాస్త నిమ్మరసం పిండి, తలకు ప్యాక్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ ప్యాక్ సహజంగా కురులకు తేమను అందించడంతో పాటు చుండ్రునీ తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా, త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలియజేస్తున్నారు.
అనునిత్యం టాస్క్‌లతో పరిగెడుతున్నారా? - ఒక్క క్షణం రిలాక్స్ అవ్వాలట!
అందానికి మందారం : మందార పువ్వులు అందానికి కూడా సాయపడతాయంటున్నారు నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు ఈ మిశ్రమాల్ని పూతలా వేసుకుంటే పరిష్కారముంటుందని చెబుతున్నారు. వీటిల్లో ఉండే ఆల్ఫాహైడ్రాక్సీ ఆమ్లాలు మృతకణాల్ని తొలగిస్తాయని పేర్కొంటున్నారు. దీంతో ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుందని తెలియజేస్తున్నారు. మందారంలో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయని, ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సాయపడతాయని World Journal of Pharmaceutical Research ప్రచురించింది. అంతేకాకుండా, పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలతో బాధపడేవారు వీటి మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చక్కని ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల్ని అదుపుచేస్తాయని చెబుతున్నారు.
ఎలా అప్లై చేయాలంటే : మందార రేకుల మిశ్రమాన్ని పెరుగు లేదా తేనెను కలపండి. ఆపై ఫేస్‌కి అప్లై చేసుకొని, 15-20 నిమిషాలు తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. లేకపోతే మందార పువ్వుల్ని ఎండలో పెట్టి పొడిలా చేసి వేడినీటిలో కలుపుకొని, అది కాస్త చల్లారక స్ప్రే బాటిల్లోకి వేసుకుని టోనర్లానూ ఉపయోగించవచ్చని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా, మందార పువ్వుల్ని ఎండబెట్టి పొడిగా చేసిన తర్వాత.. బాదం, కొబ్బరి నూనెల్లో ఈ పౌడర్ని కలిపి ముఖానికి మర్దనా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీనివల్ల మృదువైన చర్మం మీ సొంతమవుతుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

