ట్రెండ్ సెట్ చేసిన "పెద్ది" ముద్దుగుమ్మ - 'చీర-దుపట్టా' కాంబినేషన్లో జాన్వి ట్విస్ట్!
"అందానికే అందాలు అద్దినట్లు!" - కాన్సెప్ట్ పాతదే అయినా సరికొత్తగా!

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2026 at 12:17 PM IST
Saree Dupatta Combination : ఇవాళ కొత్త అనుకున్నది రేపు పాతదై పోతుంది. 'మొన్నటిదే!' అనుకున్నది మరో రోజు స్వల్ప మార్పులతో కొత్తగా ఆవిష్కృతం అవుతుంది. పాత, కొత్తల కలయికలో మరొకటి పుట్టుకొస్తుంది. ఈ విషయంలో సినిమా ప్రమోషన్లు, పార్టీల్లో ముస్తాబయ్యే ముద్దుగుమ్మలు చక్కని ఉదాహరణ. ట్రెండ్స్‌ని సృష్టించే వారు కొందరైతే ఉన్న ఫ్యాషన్లనే తమదైన రీతిలో కొత్తగా ప్రదర్శించే వారు మరికొందరు.
కథానాయిక జాన్వీ కపూర్ "పెద్ది" సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ధరించిన "శారీ-లెహెంగా ట్విస్ట్" ఇప్పుడు వైరలవుతోంది. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాకున్నా పాత ట్రెండ్‌నే కొత్తగా ధరించి ఫ్యాషన్ సెన్స్‌ని చాటుకుందీ ముద్దుగుమ్మ. చీరపై దుపట్టాతో చూపరులను కట్టిపడేసింది. చీర - దుపట్టా కాంబినేషన్, కలర్స్, క్లాత్ ఎలా మ్యాచ్ చేయచ్చో చూద్దామా!!
'అమ్మమ్మ'లా కనిపిస్తున్నారా? - "మీ వయస్సును దాచేసే ఫుడ్"పై నిపుణుల సూచనలు

చోకర్ నెక్ దుపట్టా
సహజంగా చుడీదార్ ధరించినపుడు చున్నీ, దుపట్టాల్ని భుజాలపై కాకుండా మెడను చుట్టేలా ధరించడం కొందరికి అలవాటు. 'చోకర్ నెక్ దుపట్టా స్టైల్'గా పిలిచే ఈ తరహా డ్రేప్‌ని జాన్వి శారీతో పాటు ధరించింది. పెద్ది ట్రైలర్ విడుదల సందర్భంగా చాలా సింపుల్‌గా ఐస్ బ్లూ కలర్ ప్లెయిన్ షిఫాన్ చీరను ఎంచుకున్న ఈ అమ్మడు స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన నెక్ దుపట్టాను చోకర్ స్టైల్‌లో అలంకరించేసింది. శారీ లుక్‌ని దుపట్టాతో హైలైట్ చేయడం విశేషం. చీరపై దుపట్టా కాంబినేషన్ పాతదే అయినా తనదైన స్టైల్‌లో ప్రదర్శించి ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంది.
నెక్ దుపట్టాను ఇలా సాదాగానే కాకుండా మెడ దగ్గర ఎంబ్రాయిడరీ చేయించుకొని, చీర డిజైన్‌కు తగ్గట్టుగా కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ అతికించుకొని నచ్చినట్లుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు.

చీరనే దుపట్టాగా!
చీర కంటే దుపట్టా పొడవు చాలా తక్కువ. దీంతో అది సింపుల్‌గా కనిపిస్తూ లుక్‌ని హైలైట్ చేస్తుంది. అయితే బాలీవుడ్ ఫ్యాషనిస్ట్ సోనమ్ కపూర్ మరో చీరను కూడా దుపట్టాగా ట్రై చేయచ్చని నిరూపించింది.
తాజాగా ఓ సందర్భంలో లేత గులాబీ రంగు కలంకారీ చీరను ధరించి బెంగాల్‌కు చెందిన నేత చీరను దుపట్టాగా అలంకరించుకుంది. చీర గులాబీ రంగు, దుపట్టా పిస్తా కలర్‌లో ఉండడంతో శారీ-దుపట్టా కాంబినేషన్ కాంట్రాస్ట్‌గా కనిపించి లుక్‌ని మరింత పెంచాయి.
ఎడమ భుజంపై చీర కొంగును సింగిల్ లేయర్‌గా ధరించి, దుపట్టాను కుడి భుజంపై పల్లూ మాదిరిగా అలంకరించుకొని మెరిసిపోయింది. అందుకు తగ్గట్టుగానే నగలు, మల్లెపూల బన్‌తో తన లుక్‌ని మార్చేసిన ఈ అమ్మడు శారీ-దుపట్టా రెండూ ఆపోజిట్ కలర్స్‌లో ఉంటే మరింత అందంగా కనిపించేయచ్చని చెప్పకనే చెప్పింది.

చేతికి ఆభరణంలా మలిచి
ప్రముఖ వ్యాపార వేత్త నీతా అంబానీ ట్రెండ్‌ని సృష్టించడంలో ముందుంటారు. ప్రతీ సందర్భంలో తనదైన ఫ్యాషన్ మార్క్‌ని ప్రదర్శిస్తుంటారు. ఆమె సైతం ఓసారి శారీ-దుపట్టా స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి ఫ్యాషన్ ప్రియుల మనసు గెలుచుకున్నారు. తన డ్రెస్సింగ్‌లో సహజంగానే కాంట్రాస్ట్ కలర్స్‌ని ఇష్టపడే ఆమె శారీ-దుపట్టా మ్యాచ్ చేశారు. పింక్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీ చీర ధరించి పర్పుల్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్‌ను జత చేశారు. ఇక పర్పుల్ కలర్ బనారసీ దుపట్టాను అందంగా చేతికి ఆభరణంలా ధరించారు. ఎడమ భుజంపై పల్లూను సింగిల్ లేయర్‌గా అలంకరించుకుని .. కుడి చేతిని దుపట్టాతో హైలైట్ చేశారు. ఈ తరహా దుపట్టాను బ్లౌజ్ మాత్రమే కాకుండా చీరకు మ్యాచింగ్ కస్టమైజ్ చేయించుకోవచ్చంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.

రంగు ఏదైనా బాంధనీ ఉందిగా
రంగుతో సంబంధం లేకుండా చీరలు, చుడీదార్లు, లెహెంగాలకు బాంధనీ అద్దిరిపోతుంది. దేనికైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొనే అవకాశం ఉంటుందని నిరూపిస్తున్నారు మిహీకా బజాజ్. మెజెంటా పింక్ కలర్ పట్టు చీర, అదే కలర్ ప్లెయిన్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ ధరించి ఎరుపు రంగు బాంధనీ ప్రింటెడ్ దుపట్టాను కుడి భుజంపై అలంకరించుకున్నారు. బ్లౌజ్, చీర చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా ఉన్నా చమ్కీ వర్క్‌తో ముస్తాబైన దుపట్టా మరింత అందాన్నిచ్చింది. సంప్రదాయమైన నగల్ని జత చేయడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. బాంధనీ దుపట్టాలు ప్రస్తుతం మార్కెట్లో వివిధ రంగుల్లో లభిస్తున్నాయి. శారీ, బ్లౌజ్ రంగును బట్టి వాటిని ఎంచుకొని, కుడి భుజంపై నుంచి ధరించవచ్చు. కొంగు మాదిరిగా మడిచి వెనక నుంచి ముందుకు రెండు చేతులపై వేసుకొని స్టైలిష్‌గా మెరిసిపోవచ్చని ఫ్యాషన్ నిపుణులు సూచిస్తున్నారు.
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా? - ఈ నూనెలు ట్రై చేస్తే మంచిదట!
'సెల్ఫ్ లవ్, కేర్' మాత్రమే కాదు - ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమంటున్న నిపుణులు!

