'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' - ఇలా చేస్తే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'!
లైఫ్‌లో ఇవి వదిలేస్తే - మనసు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు నిపుణులు

Published : November 4, 2025 at 4:04 PM IST
Do Not Take these Things to Heart for Better Life : ఉన్నది ఒకటే జిందగీ. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపాలి. ఎవరో ఏదో అనుకుంటారని, నచ్చిన వాళ్లు వదిలేసి వెళ్లారని బాధపడుతూ కూర్చోవద్దు. మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఈ క్రమంలో ప్రతి విషయాన్నీ పట్టించుకుంటే మనసుకి గాయాలు, ప్రశాంతత కరవుతుందంటున్నారు నిపుణులు. అందుకే, మనకు నచ్చినట్టు మనం జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
నేర్చుకోవాల్సిన పాఠం : 'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' ఇది ఓ సినిమా డైలాగ్. నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం అంటున్నారు నిపుణులు. వదిలేసి వెళ్లిన వారిని ప్రాధేయపడి జీవితంలో భాగం చేసుకోవద్దని, మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్లు వదిలేసి వెళ్లిపోరని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లిపోయారంటే, మిమ్మల్ని అర్థం చేసుకోలేదని పేర్కొంటున్నారు. అలాంటి వారికోసం తాపత్రయపడొద్దని, వెళ్లిపోయే వారిని వెళ్లిపోనివ్వడమే మేలని సూచిస్తున్నారు.
అనునిత్యం టాస్క్‌లతో పరిగెడుతున్నారా? - ఒక్క క్షణం రిలాక్స్ అవ్వాలట!
మన చేతుల్లోనే : జీవితంలో కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. మన ప్రమేయం లేకుండా ఎదురయ్యే పరిస్థితులు, ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రశాంతత కోల్పోతామని, వాటిని అలాగే వదిలేయని సూచిస్తున్నారు. ఎలాంటి ఫలితాలు వచ్చినా స్వీకరించమని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలే మన చేతుల్లో ఉంటాయని, వాటిపైనే దృష్టిపెట్టాలని వివరిస్తున్నారు.
మీపై అరిచారా? : ఇతరులు మాట్లాడే మాటలు, చేతలు మనసుకు తీసుకుంటే బాధగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో బాస్.. ఇలా ఎవరైనా మనపై అరిస్తే, క్షణికావేశంలో అన్నరని అనుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. వారిని మాటలు పట్టించుకోకుండా, వదిలేయాలని చెబుతున్నారు. వాళ్లు కుదుటపడ్డాక శాంతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని వివరిస్తున్నారు.
ముందుకుసాగాలని : మనం బస్సు, రైలులోనో ప్రయాణించేటప్పుడు, తోటి ప్రయాణికులతో మాట్లాడతాం. వారు దిగాల్సిన చోటు రాగానే వెళ్లిపోతారు కదా! అందుకు మనం బాధపడతామా? లేదు కదా. జీవితం కూడా అంతే అంటున్నారు నిపుణులు. లైఫ్‌లో కొన్ని పరిస్థితులు, బంధాలు కూడా అనుకోకుండా వచ్చి, అనుకోకుండానే పోతాయని చెబుతున్నారు. వాటి గురించి బాధపడుతూ ఉంటే జీవితాన్ని కొనసాగించలేమని, ఆ ఆలోచనలను వదిలేసి, ముందుకుసాగాలని వివరిస్తున్నారు.
అర్థం చేసుకుని : స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైన సరే, వారు తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను మార్చే ప్రయత్నం చేయొద్దంటున్నారు నిపుణులు. ఎదుటి వాళ్లని మార్చాలని చూస్తే మన ప్రశాంతతను, సంతోషాన్ని కోల్పోతామని చెబుతున్నారు. వారి ఇష్టాయిష్టాలను వారికే వదిలేసి, మనం మారేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మనల్ని అర్థం చేసుకునేవారితో మన భావోద్వేగాలను పంచుకోవాలని పేర్కొంటున్నారు.
ఎవరిపైనా : జీవితంలో ఎవరు, ఎప్పుడు, ఎలా మారిపోతారో చెప్పలేం. అందుకే ఎవరిపైనా అతిగా ఇష్టాన్ని, ప్రేమను పెంచుకోవద్దు, ఆధారపడొద్దని నిపుణులు చెబుతున్నారు. ప్రతి బంధానికి హద్దులు ఉండాలని, వాటిని దాటి అవమాన పడొద్దని అంటున్నారు. ఇతరుల గురించి కాకుండా మనపై మనం దృష్టిపెట్టాలని, అందుకు తగిన సమయం కేటాయించుకోవాలని సలహా ఇస్తున్నారు. మన మనసుకు నచ్చిన పనులు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

