సోషల్ మీడియాలో నయా ట్రెండ్ - "జీరో పోస్టింగ్"తో హీరోలుగా యువత!
తమ గురించి ఏమీ పోస్టు చేయకుండడమే ఈ ట్రెండ్ ప్రత్యేకత - మరి మీరు ఫాలో అవుతున్నారా?

Published : January 8, 2026 at 4:15 PM IST
Digital Maturity: ఈతరం యువతకు ఫొటోలు, వీడియోలు, స్టేటస్ అప్‌డేట్‌లు, లైక్స్, కామెంట్లు ఇవే లోకం. గుడి, కొత్త ప్రదేశాలు, ఫంక్షన్లు ఇలా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లితే చాలు, ప్రతిదాన్నీ స్టేటస్‌గా పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే, ఇటీవల యువతలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. అదే, 'జీరో పోస్టింగ్'. ఈ నయా ట్రెండ్‌ను డిజిటల్ మెచ్యూరిటీగా భావిస్తున్నారు. ఈ క్రమంలో జీరో పోస్టింగ్ ఎందుకు ట్రెండ్‌గా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం!
జీరో పోస్టింగ్ అంటే : సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్నప్పటికీ ఫొటోలు పోస్టు చేయకపోవడం, వ్యక్తిగత జీవితం బయటపెట్టకపోవడం, లైక్స్, కామెంట్ల కోసం ప్రయత్నించకపోవడమే ‘జీరో పోస్టింగ్’. యువత సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పటికీ తమ గురించి ఏమీ పోస్టు చేయకుండడమే ఈ కొత్త ధోరణి ప్రత్యేకత.

ప్రైవసీపై అవగాహన : ఇప్పుడు ఫొటోలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఈజీగా దుర్వినియోగానికి గురవుతోందో యువతకు స్పష్టంగా తెలుసు. ఏఐ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఇంకాస్తా ఎక్కువైంది. ఫేక్ అకౌంట్లు, ట్రోలింగ్, ఫొటోలను మార్ఫింగ్ చేయడం, డేటా దుర్వినియోగం వంటి విషయాల కారణంగా యువత తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి వెనకాడటం మొదలైంది.
డబ్బు విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - మహిళలూ ఇలా జాగ్రత్త పడండి!
మానసిక ఒత్తిడి : మానసిక ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కూడా జీరో పోస్టింగ్‌కు దారి తీస్తోంది. లైక్స్ తగ్గితే కలిగే నిరాశ, కామెంట్ల వల్ల వచ్చే ఆందోళన నుంచి బయటపడేందుకు కొంతమంది పూర్తిగా పోస్టింగ్ మానేశారు. వారు సోషల్ మీడియాను కేవలం సమాచారం తెలుసుకునే సాధనంగా, లేదా ఇతరుల కంటెంట్ చూడడానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు.

ఫేక్ జీవితం చూపించడంపై విసుగు : సోషల్ మీడియాలో చాలా మంది ఫేక్ జీవితాన్ని చూపిస్తారు. దీంతో వారి ప్రదర్శనలపై యువత విసిగిపోతోంది. సోషల్ మీడియాలో కనిపించే ‘పర్‌ఫెక్ట్ లైఫ్’ వాస్తవం కాదని అర్థం చేసుకున్న యువత, జీరో పోస్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారట.
డిజిటల్ డిటాక్స్ : నిరంతరం స్క్రీన్‌లో ఉండడం వల్ల వచ్చే అలసటను తగ్గించుకోవడానికి యువత జీరో పోస్టింగ్‌ను ఎంచుకుంటున్నారు. అయితే, వారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, తమ సమాచారాన్ని మాత్రం పంచుకోవడం లేదు. ఒకవేళ పోస్టు చేస్తే, మన ఫొటోకు ఎన్ని లైక్‌లు వచ్చాయి? ఎంత మంది కామెంట్ చేశారు? వంటి ఆలోచనలతో పదేపదే వాటిని చెక్ చేస్తోంటే, స్క్రీన్ సమయం పెరిగిపోతోంది.

ఎందుకు మొగ్గు చూపుతున్నారు?:
- డిజిటల్ ప్రపంచం తొలి దశలో సోషల్ మీడియా అనేది భావాలను పంచుకునే వేదికగా ఉండేది. కానీ, కాలక్రమేణా అది పోలికలు, పోటీలు, విమర్శలకు వేదికగా మారిపోయింది.
- ఎవరి లైఫ్ మారింది? ఎవరి ఫొటోకు ఎక్కువ లైక్స్ వచ్చాయి? ఎవరు ట్రెండింగ్‌లో ఉన్నారు? అనే ఆలోచనలు యువతపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
- సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే యువతలో సుమారు 60 శాతం మంది తమ జీవితాలను ఇతరులతో పోల్చుకుని అసంతృప్తికి లోనవుతున్నారని ఒక అధ్యయంలో వెల్లడైంది. తద్వారా పోస్టు చేయకపోవడమే మంచిది అనే దశకు తీసుకువచ్చింది.
లాభాలేంటి? :
- నిరాశ, అనవసర ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
- డిజిటల్ గోప్యతా పెరుగుతుంది.
- వాస్తవ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.
- మానసిక ప్రశాంతత
అయితే, జీరో పోస్టింగ్ అంటే సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరమవడం కాదు, దాన్ని అదుపులో పెట్టుకోవడం. ఇది యువతలో డిజిటల్ మెచ్యూరిటీని కూడా సూచిస్తుంది. మన జీవితాన్ని నిరంతరం ప్రదర్శించాల్సిన అవసరం లేదని యువత గ్రహిస్తున్నారు. అందువల్ల ఇది ఒక ట్రెండ్‌గా మాత్రమే కాకుండా, డిజిటల్ సమతుల్యత వైపు యువత వేస్తోన్న ఒక చైతన్యమైన అడుగుగా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
"డెస్టినేషన్ వెడ్డింగ్" ప్లాన్ చేస్తున్నారా? - మనకు దగ్గర్లోనే అద్భుతమైన ప్రదేశాలు!
ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? - బెస్ట్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు

