జెన్జీల నయా ట్రెండ్! - ఫన్‌తో పాటు ఫిట్నెస్ కూడా!
-కాఫీ, దోశ రేవ్ అంటే ఏమిటి? - ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది?

Published : October 16, 2025 at 3:44 PM IST
Coffee and Dosa Rave Party: సాయంత్రం దాకా స్టడీస్‌లో, ఆఫీసుల్లో అలసిపోయాక చిల్ కావడానికో పార్టీ. ఇది పాత మాట. మోగుతున్న అలారం నోరు మూసేసి, ముసుగుతన్నిన బద్దకాన్ని పక్కకు నెట్టేసి, రీల్స్‌తో రమ్మని పిలిచే ఫోన్‌కు బైబై చెప్పేసి, మనకోసం ఎదురుచూసే కొత్త ప్రపంచానికి ఆహ్వానం పలుకుదాం అంటున్నారు జెన్జీలు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
ఎన్ని విజయాలు సాధిస్తున్నా, ఎంత ఆదాయం ఉన్నా మన యువతలో ఏదో తెలియని వెలితి. రాత్రి, పగలూ తీరిక లేకుండా గడపడం, అయిష్టంగా అయినా పనులు చేసి నిస్సత్తువగా ఉండడం పరిపాటిగా మారింది. తలకు మించిన ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు చాలా మంది నైట్ పార్టీలకు, మాదకద్రవ్యాలకు లొంగిపోతున్నారు. దీనికి భిన్నంగా రోజును సంతోషంగా ప్రారంభించేద్దామంటున్నారు కొందరు.
నగరాల్లో నయా ట్రెండ్ : ఉషోదయంతో ఉత్సాహాన్ని నింపుకోవడమే అన్ని సమస్యలకు పరిష్కారం అంటున్నారు జెన్జీలు. దీంతో ఇంతకు ముందెన్నడూ చూడని తెల్లవారుజాము గేదరింగ్స్ నగరాల్లో ట్రెండ్‌గా మారుతున్నాయి. ఇక్కడ పార్టీ అంటే మద్యం తాగడం, మత్తులో తూలడం కాదు. మ్యూజిక్ బీట్స్‌తో పాటు ఫిట్నెస్ మంత్ర ఉంటుందని, ఫ్రెండ్స్ హంగామాతో పాటు మంచి ఆహారం ఆహ్వానిస్తుందని చెబుతున్నారు జెన్జీలు. కాఫీ రేవ్, దోశ రేవ్ పేరుతో కొత్త సరదాలు ఆకర్షిస్తున్నాయి. ఫన్‌తో పాటు ఫిట్నెస్ సొంతమవుతుండడంతో యూత్‌కి ఇవి కిక్కునిస్తున్నాయి.
"ఉల్లాసోదయానికి సాయం సంధ్యారాగం" - ఇలా అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు!
- ప్రస్తుత జనరేషన్‌కు పొద్దున్నే లేవడం గగనం. తొందరగా పడుకోవడం మరింత కష్టం. అలాంటి యువత సూర్యోదయంలో ఉన్న శక్తిని అందిపుచ్చుకునేలా చేయడం ఈ కాఫీ, దోశ పార్టీల ప్రధాన లక్ష్యం.
- వాస్తవానికి రెండేళ్ల కిందట కాఫీ రేవ్ కాన్సెప్ట్ సోబర్ పార్టీయింగ్ పేరుతో యూరప్‌లో మొదలైంది. అది ఇప్పుడు మన వరకు వచ్చింది. కెఫెన్ ఎనర్జీతో పార్టీ చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం అంటున్నారు జెన్జీలు.
- మన నగరాల్లో కూడా ఈ కాన్సెప్ట్ వేగంగా విస్తరిస్తోంది. బెంగుళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లలో వీటిని తరచూ నిర్వహిస్తున్నారు.
- కాఫీ రేవ్లను ఎక్కువగా క్లబ్బుల్లో, కాఫీ షాపుల్లో కొన్ని చోట్ల అరు బయట ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణహిత రిసార్టులు, తీర ప్రాంతాలు కూడా ఇందుకు వేదికవుతున్నాయి.
ఫిట్నెస్ కూడా :
- ఈ పార్టీలో ఫిట్‌నెస్‌కూ ప్రాధాన్యం ఉంటుంది. ఉదయం లేచి అనుకున్న ప్రదేశానికి చేరుకుంటారు. మూడు నుంచి ఐదు కిలోమీటర్ల రన్లో పాల్గొంటారు. అది అయ్యాక కాఫీ పాయింట్‌కు చేరుకుంటారు.
- అక్కడ మ్యూజిక్ సెటప్ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్ బీట్స్‌ను ఎంజాయ్ చేస్తారు. కాసేపు బృంద నృత్యాలతో ఉల్లాసంగా గడుపుతారు.
- నచ్చిన అల్పాహారం తింటూ చిల్ అవుతారు. ఉదయం 5.30 గంటలకు రన్‌తో ప్రారంభించి 10.30కు అల్పాహారంతో ముగిస్తారు.
- విశాఖలో ఇటువంటి పార్టీలు నెలకు రెండు, మూడు జరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రాంతాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో అసభ్యంగా ప్రవర్తించడం. ఇతరుల స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం నిషేధం. సెక్యూరిటీ, సేఫ్టీ పరంగా కఠినంగా ఉంటాం. విశాఖలో ఇటీవల బీచ్ ఒడ్డున న్యూకాన్సెప్ట్ను తీసుకొస్తే మంచి స్పందన వచ్చింది- సంజన సాయి, వాక్ విత్ కాఫీ, దోశ నిర్వాహకురాలు
ఆన్లైన్ వేదికగా :
- ఈ రకమైన పార్టీలకు ఆన్లైన్ వేదికలు, వాట్సప్, ఇన్‌స్టా గ్రూపులు ఉన్నాయి. కొన్ని ఈవెంట్ సంస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి.
- ముందుగా వాటిలో పేర్లు నమోదు చేసుకోవాలి. నామమాత్రపు ఫీజు ఉంటుంది.
- పేర్లు రిజిస్టర్ చేసుకొని రుసుం చెల్లిస్తే ఒక ట్యాగ్ ఇస్తారు. అది ధరిస్తేనే లోపలికి అనుమతిస్తారు.
- కాఫీ, నచ్చిన అల్పాహారాన్ని మన డబ్బులతోనే సొంతంగా కొనుక్కోవాలి.
- ఈ కార్యక్రమానికి, రన్లో పాల్గొనే వారు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. దాన్ని ముందుగానే తెలియజేస్తారు.
- ఎవరూ మద్యం తాగకూడదు. ఆల్కహాల్ ఉన్న పానీయాలు స్వీకరించకూడదనేది కఠిన నిబంధన.
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడొచ్చా? - వాస్తవాలు ఎలా ఉన్నాయంటే!
ఎర్రని పెదాల కోసం "లిప్‌స్టిక్" వాడుతున్నారా? - రోజూ పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

