ETV Bharat / lifestyle

మీ పిల్లలు స్వతంత్రంగా ఎదగాలంటే - "ఫాఫో" పేరెంటింగ్ పాటించాలట!

- తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలంటున్న నిపుణులు - పిల్లలను డీల్ చేయడానికి సూచనలు

FAFO Parenting
FAFO Parenting (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 2:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

FAFO Parenting : "అనుభవైకవేద్యం" అంటారు పెద్దలు! స్వయంగా అనుభవిస్తేనే సంపూర్ణంగా అర్థమవుతుందని భావం. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు కూడా ఇది వర్తిస్తుంది. అప్పుడే.. ఎలాంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుంది. అయితే.. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ తామే చేసి పెట్టాలని, ఏ కష్టమూ రాకుండా చూసుకోవాలని ఆరాటపడుతుంటారు. మరికొందరు పేరెంట్స్ మాత్రం తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకునేలా పిల్లల్ని తయారు చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి వారు ఇప్పుడు పఠిస్తున్న మంత్రం పేరు 'ఫాఫో'. ఇంతకీ ఏంటిది? ఎలా పాటించాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం!

ఫాఫో అంటే : పేరెంటింగ్​లో ఎన్నో రకాలు ఉన్నాయి. నేటి జనరేషన్​లో కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి. వాటిలో ఒకటే 'ఫాఫో పేరెంటింగ్'. అసలు FAFO (Fool Around Find Out) అంటే అర్థం ఏంటి? అంటే.. "చేసి చూడు. ఫలితం తెలుసుకో". చాలా మంది పిల్లలు బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. ఇంకా నిర్లక్ష్యంగా పనులు చేస్తుంటారు. అలాంటి వారికి బాధ్యతలు అప్పగించి, రిజల్ట్​ను వాళ్లే స్వయంగా ఎదుర్కొనేలా చేయడం. ఇదే "ఫాఫో పేరెంటింగ్" పద్ధతి.

మీ ఇంట్లో డబ్బు, నగలు మాయం అవుతున్నాయా? - వారిని అనుమానించాల్సిందేనట!

ఎలా అప్లై చేయాలి? : ఫాఫో పేరెంటింగ్ విధానంలో, ఒక పిల్లవాడు ఉదయం అల్పాహారం తినడానికి ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయంగా వేరే పదార్థాలు ఏమీ పెట్టరు. ఆ తర్వాత స్నాక్స్ లేదా మధ్యాహ్న భోజనం తినే సమయం వరకు ఆకలిగానే ఉన్న ఆ పిల్లాడు ఆహారం విలువను స్వయంగా తెలుసుకుంటాడు. దీనివల్ల పిల్లల్లో వాగ్వాదం, మొండితనం తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. అలాగే, ఓ చిన్నారిని పుస్తకాలు స్వయంగా కొనుక్కోమని దుకాణానికి ఒంటరిగా పంపారు. అక్కడ షాప్ యజమానితో మాట్లాడి, అవసరమైతే అక్కడున్న పెద్దవాళ్ల సహకారం తీసుకుని ఆమె పుస్తకం కొనుగోలు చేస్తారు. ఫాఫో విధానంలో చిన్నారిని పెంచాలనుకుే తల్లిదండ్రులు ఇలాగే చేస్తారు. దీంతో క్రమంగా వారికి భయం పోవడంతోపాటు సృష్టమైన నిర్ణయాలను కూడా తీసుకునే స్థాయికి ఎదుగుతారు.

స్వయం సమృద్ధిగా : పిల్లల్ని స్వతంత్ర వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించే తల్లిదండ్రులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో పిల్లలకు ఎలాంటి శిక్షలూ ఉండవు. వారు చేసిన తప్పులను స్వయంగా వారే సరి చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లల్లో ఒత్తిడి, భయం ఉండదు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఫాఫో విధానంలో పెరిగిన పిల్లల్లో బాధ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుంటారని సూచిస్తున్నారు. పిల్లలు చేసే పనులను నిరంతరం సరిదిద్దడం, ఉపన్యాసాలు ఇవ్వడం కంటే, వారు చేసే పనులు, చర్యల ద్వారా వారే స్వయంగా నేర్చుకోవడానికి వీలు కల్పించడం మంచిదని అంటున్నారు. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య నిరంతర వాగ్వాదాలు ఉండవు. కోపతాపాలు, చర్చలు తగ్గుతాయి. సహనం, సామర్థ్యం పెరుగుతాయి. ఈ విధానంలో పిల్లలు వాస్తవ పరిణామాలను ఎదుర్కోవడం ద్వారా ప్రపంచం తనకు ఏదీ తేలిగ్గా ఇవ్వదని అర్థం చేసుకుంటారు.

ఏదైనా నోటి మాటగా చెప్పడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లవాడు పాల గ్లాస్​ను పడేసినప్పుడు దాని ఫలితం తెలిసేలా చేస్తే మరోసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాడు. ప్రేమ, క్రమశిక్షణ రెండూ ఎక్కువగానే ఉండే విధానం వల్ల పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు -కర్రి రామారెడ్డి, మానసిక వైద్య నిపుణులు

ఎంపిక బాధ్యత తల్లిదండ్రులదే :

  • పిల్లలు వారి చర్యల ఫలితాలను తట్టుకొని జీవించాలని అనుకుంటున్నామా? లేక మన సహాయంతో ఎదగాలని కోరుకుంటున్నామా? అనేదాన్ని తల్లిదండ్రులే నిర్ణయించుకోవాలి.
  • వయసుకు తగిన అంచనాలే వారిపై ఉండాలి. పిల్లల వయసు, సామర్థ్యాలను అనుసరించి వారికిచ్చే బాధ్యతలుండాలి. ఇతర పిల్లలతో పోల్చకూడదు.
  • ఆప్యాయత లేకపోవడం వల్ల కొన్నిసార్లు పిల్లల్లో నిర్లిప్తత, ఒంటరితనం, శూన్యత భావన ఏర్పడవచ్చు.
  • పరిమితులు అవసరమే కానీ, వాటిని ప్రేమతో పెట్టాలి. పిల్లలపై గౌరవం, ప్రేమతో నిర్ణయాలు తీసుకోవాలి.
  • పిల్లలకు బాధ్యతలు అప్పగించినప్పుడు వారు దాన్ని నిర్వహించేందుకు కావాల్సిన సహాయం చేయాలి.
  • వారు మాట్లాడే పద్ధతులు, భయాలను వ్యక్తపరచడానికి మీ వద్ద సురక్షిత వాతావరణం కల్పించాలి.

పిల్లలు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే​ బెటర్​ అంటున్న నిపుణులు!

పిల్లలను అతి గారాబం చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!