ETV Bharat / lifestyle

కాకరకాయ చేదు తగ్గాలా? - ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​ అంటున్న నిపుణులు!

ఆరోగ్యానికి మేలు చేసే కాకర - అస్సలు పక్కన పెట్టడం సరికాదు

Bitter Gourd
Bitter Gourd (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 29, 2025 at 3:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Easy Tips to Reduce Bitterness in Bitter Gourd : కాకరకాయ అనగానే ఇంటిల్లిపాదీ 'అబ్బో చేదు' అనేస్తారు. కొంతమంది చేదు పోగొట్టడానికి ముక్కల్ని ఉడికించడం, ఉప్పు కలపడం లాంటి ప్రయోగాలు చేస్తుంటారు. కానీ, ఇవి వర్కవుట్‌ కాకపోవడంతో ఈ కాయగూరను పక్కన పెట్టేస్తుంటారు. అయితే, కొన్ని సింపుల్‌ చిట్కాలతో కాకరలోని చేదును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు నిండి ఉన్న కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, జీర్ణశక్తిని పెంచడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం దాకా అనేక ప్రయోజనాలు ఉన్నయని తెలియజేస్తున్నారు. కాబట్టి, కాకరకాయను పూర్తిగా పక్కన పెట్టేయడం కాకుండా, చేదు తగ్గించుకొని తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.

పండ్లను ఎలా తీసుకోవాలి? - ఏ పండులో ఎంత చక్కెర ఉంటుందో తెలుసా?

ఇవి ప్రయత్నించండి : కాకరపై తొక్కను పైపైన చెక్కేయాలి. ఇప్పుడు వీటిని సన్నటి స్లైసుల్లా తరిగి, రెండు మూడు గంటలు ఎండలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో కాకరకాయలోని తేమ శాతం తగ్గి ఆటోమేటిక్‌గా చేదు కూడా తగ్గుతుందని అంటున్నారు. ఈ స్లైసులతో కూర వండుకుంటే అంత చేదుగా కూడా ఉండదని సూచిస్తున్నారు. అంతేకాదు, ఇలా ఎండబెట్టడం వల్ల ఈ ముక్కల షెల్ఫ్‌ లైఫ్‌ కూడా పెరుగుందని పేర్కొంటున్నారు. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకొని ఆ తర్వాత కూర చేసుకోవడం, స్నాక్స్‌లో వాడడం వంటివి చేయచ్చని సలహా ఇస్తున్నారు.

ఉప్పు, పసుపుతో : చాలామంది కాకరలోని చేదు తగ్గాలని ఉప్పు కలుపుతుంటారు. అయితే ఉప్పుతో పాటు చిటికెడు పసుపు కూడా కలిపి, ఈ ముక్కల్ని జాలీలో ఉంచి ఓ గిన్నెపై పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉప్పు, పసుపుల మిశ్రమం కాకరలోని చేదును గ్రహించి ద్రవరూపంలో గిన్నెలోకి చేరుతుందని వివరిస్తున్నారు. ఫలితంగా చేదు తగ్గి, ఆపై ఈ ముక్కల్ని కూర చేసుకుంటే రుచిగా ఉంటుందని చెబుతున్నారు.

నిమ్మరసం : కాకరకాయ చేదుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి, ఆమ్ల గుణాలు చేదును గ్రహిస్తాయంటున్నారు నిపుణులు. కాకర ముక్కలపై నిమ్మరసం పిండిన అరగంట తర్వాత వాటిని కడిగి వండుకుంటే కూర రుచి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, నిమ్మరసం వల్ల ముక్కలు మరింత మృదువుగా మారతాయని తెలియజేస్తున్నారు. అలాగే, కాకరకాయలోని పోషక విలువలూ కోల్పోకుండా జాగ్రత్త పడచ్చని వివరిస్తున్నారు. అలాగే, నూనెలో డీప్​ఫ్రై చేసే స్నాక్స్​ తయారీలో కాకర ముక్కల్ని వాడితే వాటిలోని చేదు తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.

గింజలను తొలగించండి : మనలో చాలామంది కాకరకాయల్ని గింజలతో పాటు వండటం వల్ల కూర చేదుగా ఉంటుంది. కాకరకాయ అస్సలు తినలేమని అనుకునేవారు గింజలు తొలగించి వండుకుంటే చేదు కాస్త తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గింజలతో పాటు వండుకోవాలని అనుకుంటే, ఒక గిన్నెలో కప్పు నీళ్లు, కప్పు వెనిగర్, రెండు టేబుల్​స్పూన్ల చక్కెర వేసి, ఆ మిశ్రమంలో కాకర ముక్కల్ని వేసి అరగంట పాటు ఉంచాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుందని సూచిస్తున్నారు.

ఉప్పుతో : నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో టీస్పూన్‌ ఉప్పు వేయాలి. ఈ మిశ్రమంలో కాకర ముక్కల్ని వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి, ఆపై వేడి నీళ్లు వంపేసి చల్లటి నీటిలోకి ముక్కల్ని మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిట్కా కూడా కాకరలోని చేదును తగ్గిస్తుందంటున్నారు. ఇలా ఉడికించడం వల్ల ముక్కలు మృదువుగా మారడంతో పాటు కూర రుచీ పెరుగుతుందని వివరిస్తున్నారు.

ఇవి కూడా :

  • కాకరకాయతో వివిధ రకాల వంటకాలు తయారుచేసేటప్పుడు, అందులో కొద్దిగా బెల్లం ముక్క వేయాలి.
  • కాకరతో స్టఫ్డ్‌ వంటకాలు తయారుచేసేటప్పుడు.. అందులోని గింజల్ని పూర్తిగా తొలగించి, పల్లీ, పుట్నాల పొడులతో స్టఫ్‌ చేస్తే చేదు తగ్గుతుంది.
  • కాకర ముక్కల్ని పెరుగుతో మ్యారినేట్‌ చేసి గంట పాటు ఉంచాలి. తర్వాత కూర చేసుకుంటే రుచికి రుచి, చేదుగా కూడా ఉండదు.

ఇలా ఈ చిట్కాల్ని పాటించడం వల్ల పోషకాలు కోల్పోకుండా కాకరలోని చేదును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతమవుతుందని అంటున్నారు. అయితే తినగలిగినవారు మాత్రం ఎంచక్కా కాకర లోని చేదునీ ఆస్వాదిస్తే, ఆరోగ్యానికి ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో చూసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

బాగా పులిసిన పిండితో ఆరోగ్య సమస్యలు? - నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివే!