'ముడతలు, నల్లటి వలయాల'తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ నేచురల్ టిప్స్ ట్రై చేయండి!
రోజ్ వాటర్‌లో కలిపి రాస్తే మంచి ఫలితం - నిపుణుల సూచన!

Published : August 26, 2026 at 5:11 PM IST
skincare Tips : ఈ రోజుల్లో ఒత్తిడి, కాలుష్యం కారణంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడమే కాకుండా, మన దైనందిన జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా చర్మాన్ని సహజంగా మెరిపించుకోవచ్చు. రోజ్ వాటర్, తేనె, బాదం నూనె చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. రోజ్ వాటర్ చర్మానికి తాజాదనాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే, తేనె, బాదం నూనె చర్మంలోని తేమను నిలిపి ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సంరక్షణలో ఎలా సహాయపడతాయి : తేనె సహజమైన హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచడానికి, చర్మం మరింత మృదువుగా కనిపించడానికి సహాయపడుతుంది. బాదం నూనె ఎమోలియంట్‌గా పనిచేస్తుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అలాగే రోజ్ వాటర్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ ప్రయోజనాలు చర్మం మొత్తం రూపాన్ని తాత్కాలికంగా మెరుగుపరచవచ్చు.
ఎలా ఉపయోగించాలి : రోజ్‌వాటర్, బాదం, తేనె పదార్థాలను కొద్ది పరిమాణంలో తీసుకుని బాగా మిక్స్ చేసి, శుభ్రమైన చర్మంపై పల్చటి పొరలా అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసేటప్పుడు కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత, చల్లటి నీటితో మెల్లగా కడిగేసుకోవాలి. ముఖ్యంగా, దీనిని అప్లై చేసేటప్పుడు లేదా తొలగించేటప్పుడు కళ్ల కింద ఉండే సున్నితమైన చర్మాన్ని ఎప్పడూ గట్టిగా రుద్దకూడదు.
బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొవ్వు ఏమవుతుంది? - తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఎల్లప్పుడూ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి : ఈ మిశ్రమాన్ని ముఖంపై ఉపయోగించే ముందు, చేతి లోపలి భాగంలో లేదా చెవి వెనుక భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దురద, మంట, ఎరుపు లేదా వాపు వంటి సమస్యలు ఏవైనా వస్తున్నాయేమో కాసేపు గమనించాలంటున్నారు. ఒకవేళ చర్మంపై ఎలాంటి మంట లేదా అసౌకర్యం కలిగినా, ముఖ్యంగా సెన్సిటివ్ చర్మం ఉన్నా లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉన్నా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
నల్లటి వలయాలు, ముడతలను తొలగిస్తుందా? : కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలను బాదం, తేనె, రోజ్ వాటర్ మిశ్రమం శాశ్వతంగా నయం చేయగలదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ మిశ్రమం చర్మానికి కేవలం తాత్కాలికంగా తేమను మాత్రమే అందిస్తుందంటున్నారు నిపుణులు. నల్లటి వలయాల వెనుక జన్యుపరమైన లోపాలు, అలర్జీలు, వయసు పైబడటం, నిద్రలేమి వంటి అనేక అంతర్గత కారణాలు ఉంటాయి. కాబట్టి, కేవలం పైపూతలతోనే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాదంటున్నారు నిపుణులు.
ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రశాంతంగా నిద్రపోవడం, శరీరానికి తగినంత నీరు, సమతుల్య ఆహారం, ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం లాంటివి చేయాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని ఎక్కువగా తాకడం లేదా గట్టిగా రుద్దడం లాంటివి చేయవద్దని చెబుతున్నారు. కళ్ల కింద నల్లటి వలయాలు, ముడతలు, మొటిమలు లేదా చర్మంపై నల్లటి మచ్చలు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.
పరిశోధన మూలాలు :
https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC10758878/
https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC5661189/
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'పరగడుపు అలవాట్లు' - వీటితో ఎంతో ప్రమాదం ఉందంటున్న నిపుణులు!
పీరియడ్స్ ముందు జ్వరంగా అనిపిస్తోందా? - ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన!

