ETV Bharat / lifestyle

పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

క్రియేటివ్ పేరెంటింగ్ అంటే? - పేరెంట్స్ పిల్లలను ఎలా డీల్ చేయాలో వివరిస్తున్న నిపుణులు!

Creative Parenting
Creative Parenting (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 21, 2025 at 5:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rules for Creative Parenting : తల్లిదండ్రులుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్పుదారి పట్టే అవకాశాలూ లేకపోలేవు. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటి ద్వారా పిల్లలను సరైన దారిలో నడిపించడంతో పాటు, వారిని బాధ్యతాయుతంగా కూడా తీర్చిదిద్దచ్చని చెబుతున్నారు. దీనినే ‘'క్రియేటివ్ పేరెంటింగ్’' అంటారు. మరి, ఆ సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

పరిణామాలు తెలియజేస్తూ : మామూలుగా మంచి కంటే చెడు వైపే చాలా తొందరగా ఆకర్షితులవుతుంటారు. ఈ లక్షణం పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. పైగా వారికి ఇది మంచి, ఇది చెడు అని ఆలోచించే పరిణతి కూడా ఉండదని చెబుతున్నారు. కాబట్టి, చెడు విసిరే వలలో సులువుగా చిక్కుకుపోతుంటారని వివరిస్తున్నారు. అందుకే పిల్లలను ఎప్పటికప్పుడు సునిశితంగా గమనించడం ద్వారా వారి ప్రవర్తన ఎలా ఉందో ఓ అంచనాకు రావచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు వాటి గురించి వివరించడంతో పాటు మళ్లీ మళ్లీ వాటిని చేస్తే వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థమయ్యేలా వివరించాలని పేర్కొంటున్నారు.

భావోద్వేగాల నియంత్రణలేక బంధానికి బీటలు - ఈ టిప్స్​ పాటిస్తే మేలు జరుగుతుందంటున్న నిపుణులు!

ఒత్తిడి లేకుండా : కొంతమంది పేరెంట్స్ పిల్లలపై ‘'అది చేయకు, ఇలా ఉండద్దు' అంటూ ఎన్నో రకాల ఆంక్షలు విధిస్తుంటారు. పైగా తాము సాధించాలనుకున్న లక్ష్యాలు, ఆశయాలను బలవంతంగానైనా తమ పిల్లల ద్వారా సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలను సైతం ఇప్పుడే నిర్ణయించేసి దాన్ని సాధించి తీరాలని ఆదేశిస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీంతో చిన్నారులు చేయాలనుకున్న వాటిని చేయలేకపోతుంటారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, ఒత్తిడి కారణంగా పిల్లల్లోని సృజనాత్మకత సైతం తగ్గిపోతుందని వివరిస్తున్నారు. అందుకే వారు ఎందులో ఆసక్తి కనబరుస్తున్నారో గమనించి అందులో నైపుణ్యం సాధించేలా వారిని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. అప్పుడే వారు ఒత్తిడిని జయించి తమ జీవితానికి చక్కని బాట వేసుకోగలుగుతారని సలహా ఇస్తున్నారు.

స్నేహపూర్వకంగా : చిన్నారుల నుంచి పెద్దల వరకు స్నేహపూర్వకమైన వాతావరణంలోనే గడపడానికి ఇష్టపడుతుంటాం. అయితే, అలాంటి వాతావరణం చాలా సందర్భాల్లో పేరెంట్స్, పిల్లల మధ్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొందరు చిన్నారులు తాము ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పినప్పుడు వారి తల్లిదండ్రులు కసురుతుంటారని అంటున్నారు. దీంతో పిల్లలు తమ మనసులోని భావాలను పేరెంట్స్​తో పంచుకోవడానికి ఇష్టపడరని తెలియజేస్తున్నారు. ఇలాంటి వాతావరణం కుటుంబ సభ్యుల మధ్య ఉండటం అంత మంచిది కాదంటున్నారు. అందుకే ఇంట్లో ఎప్పుడూ స్నేహపూర్వకమైన, సరదాలతో కూడిన వాతావరణం ఉండేలా పేరెంట్స్ చొరవ చూపాలని సూచిస్తున్నారు. అలాగని పూర్తిగా వారికి స్వేచ్ఛనివ్వమని కాదని పేర్కొంటున్నారు. వారికి స్నేహహస్తాన్ని అందిస్తూనే, తప్పు చేస్తున్నప్పుడల్లా హెచ్చరిస్తుండాలని తెలియజేస్తున్నారు. అప్పుడు పిల్లలు అన్ని విషయాలు మనతో పంచుకుంటారని చెబుతున్నారు. కాబట్టి వారి వ్యక్తిత్వం, ఆలోచనలు అన్నింటిపై మనకు కూడా పూర్తి అవగాహన ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. తదనుగుణంగా వారి జీవితాన్ని మలిచే అవకాశం ఉంటుందని సలహా ఇస్తున్నారు.

సమానంగానే చూస్తున్నారా? : ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది. ఒకరు బాగా చదువుతున్నారనో, చెప్పిన మాట వింటున్నారనో, చిన్నవాడనో పేరెంట్స్ ఒకరినే ముద్దు చేస్తుంటారు. వారిని చూసి నేర్చుకొమ్మని మరొకరికి చెబుతుంటారు. అంతేకాదు, వారు చేసిన తప్పులని పెద్దగా పట్టించుకోరని, అదే సమయంలో మరో చిన్నారి చిన్న పొరపాటు చేసినా వారిపై విరుచుకుపడిపోతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ అంతట మీరే తోబుట్టువుల మధ్య అంతరం పెంచిన వారవుతారని హెచ్చరిస్తున్నారు. అలాగే పేరెంట్స్​పై కూడా చిన్నారుల మనసుల్లో ప్రతికూల భావాలు కలిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు. కాబట్టి, ఇద్దరిలోనూ సానుకూల అంశాలను గమనించి వాటిలో మెరుగయ్యేలా ప్రోత్సహించాలని అంటున్నారు. ప్రతికూల భావాలను తొలగించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.

వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి? - హెడ్ బాత్​కు ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు ముఖ్యమట!

కాస్త ఆలస్యం అయినా సరే - అన్నీ తెలుసుకున్నాకే పెళ్లికి 'ఓకే' చెప్పాలట!