ETV Bharat / lifestyle

'ఏకాగ్రత, జ్ఞాపకశక్తి' తగ్గిపోతోందా? - ఈ పనులతో మీ బ్రెయిన్ ​ షార్ప్​గా పనిచేస్తుందట!

బ్రెయిన్ ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే - ఇలా చేయాలంటున్న నిపుణులు

Boost Memory Power
Boost Memory Power (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : April 21, 2026 at 4:30 PM IST

5 Min Read
Choose ETV Bharat

Boost Memory Power : జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తూ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అరుదైన ఆప్తులు. జ్ఞాపకశక్తిని కలిగి ఉండటం ఓ అరుదైన వరం. అదే లేకుంటే మన జీవితానికి ఎలాంటి విలువ లేదు. వ్యక్తి సామాజిక, భావోద్వేగ స్పందనల్లో, అర్థవంతమై పనితీరుల్లో జ్ఞాపకశక్తి కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇంతటి శక్తి సాధనం మన బ్రెయిన్​లో ఎలా పనిచేస్తుంది? ఎప్పుడో జరిగిన సంఘటనల్ని సైతం ఇప్పటికీ ఎలా గుర్తుంచుకుంటుంది? లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

జ్ఞాపకాలు 3 రకాలు :

సెన్సువల్ మెమొరీ : దీన్నే ఇంద్రియ జ్ఞానం లేదా షార్ట్ టర్మ్ మెమొరీ అని కూడా అనొచ్చు. కొన్ని మిల్లీసెకన్లు మాత్రం ఇది ఉంటుంది. వాసన, శబ్దాలు, దృశ్యాలు లాంటి వాటిని అర్థం చేసుకునేంత సేపు మాత్రమే ఈ జ్ఞాపకం పనిచేస్తుంది. కళ్లు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం నుంచి వచ్చే సమాచారాన్ని మెదడులోని ఐదు ఇంద్రియా జ్ఞాన ప్రాంతాలు ప్రాసెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

వర్కింగ్ మెమొరీ : మెదడులోని సమాచారాన్ని కొద్ది సేపు మాత్రమే తాత్కాలికంగా గుర్తుంచుకుని, దాన్ని ఉపయోగించడానికి సహాయపడే మానసిక వ్యవస్థ ఇది. ఎలాగంటే, ఓ వ్యక్తి చెప్పిన మొబైల్ నంబరు లేదా చిరుమానాను రాసే వరకు గుర్తుంచుకుంటంది. ఇది బలహీనంగా ఉంటే చదవడం, నేర్చుకోవడం, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

లాంగ్ టర్మ్ మెమొరీ : జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు, అలవాట్లు, నైపుణ్యాలు, సమాచారం, అనుభవాలు, వాస్తవాలు, భావోద్వేగ అనుబంధాలు లాంటి వాటిని బ్రెయిన్​లో సుదీర్ఘకాలం నిక్షిప్తం చేసే సామర్థ్యం దీనిది. అపరిమితమైన సమాచారాన్ని ఇది భద్రపరుస్తుందంటున్నారు నిపుణులు. జ్ఞాపకాల్ని స్టోరేజ్ చేయడం, అవసరమైనప్పుడు రీకాల్ చేసుకోవడం దీని విధులని పేర్కొంటున్నారు.

మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితో పోషకాహర లోపం ఉన్నట్టేనట!

వర్కింగ్ మెమొరీ పరిమితం : మనం ఎంత సమర్థంగా చదవగలం, గుర్తుంచుకోగలం అన్న దానిని వర్కింగ్ మెమొరీ నిర్ధారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల సులభతర పద్ధతుల్ని అలవరచుకోవడం ద్వారా వర్కింగ్, దీర్ఘకాల జ్ఞాపకాల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని అంటున్నారు.

ఫోన్లకు దూరంగా జరగండి : స్మార్ట్​ఫోన్లు మీ వర్కింగ్ మెమొరీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేస్తున్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందట. చివరికి ఫోన్ మీకు దగ్గరలో ఉన్నా, సైలెంట్ మోడ్​లో పెట్టినా, జ్ఞాపకశక్తిని అందుకునే సామర్థ్యాన్ని హరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, మనకు తెలియకుండానే మెదడు స్మార్ట్​ఫోన్లు వైపు లాగుతుంటుంది. కనీసం నోటిఫికేషన్లు అయినా చూద్దామనే భావన మనసులో కలుగుతూ ఉంటుంది. కాబట్టి, ఒక అంశంపై దృష్టి సారించాలనుకున్నప్పుడు ఫోన్​ను దగ్గరలో లేకుండా చూసుకోవాలి.

మెదడుతో పరుగులు వద్దు : చదువు, ఉద్యోగం, ఉద్వేగాల ఒత్తిడి మన బ్రెయిన్​లోని జ్ఞాపకశక్తి జాగాను చాలా వరకు కబ్జా చేస్తాయి. ఏ విషయంలోనైనా మీరు ఆందోళన చెందుతున్నా, పరుగులు తీసే ఆలోచనలతో పక్కదోవ పడుతున్నా, వర్కింగ్ మెమొరీని చాలా వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం, సేదతీరడం లాంటి సాధనాల ద్వారా క్రియాశీలక జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని, ఒత్తిడిని తగ్గించుకోవచ్చంటున్నారు. యోగా, ధ్యానం, బ్రీతింగ్ టెక్నిక్​లు దీనికి సహాయపడతాయట. ముక్కు ద్వారా లోతైనా శ్వాస తీసుకొని, కొద్ది సేపు ఆపి, నోటి ద్వారా నెమ్మదిగా గాలి వదలడం లాంటి సాధనాలు చేయొచ్చు. ఇలా 5 నిమిషాల పాటు పునరావృతం చేసినట్లయితే నాడీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి, అభ్యసన అవకాశాలు మెరుగుపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

చంకింగ్​ను (విభజన) పాటించండి : పెద్ద సమాచారం లేదా డేటాను చిన్నచిన్న అర్ధవంతమైన ముక్కలుగా విభజించి సులభంగా గుర్తు పెట్టుకునే, ప్రాసెస్ చేసే ప్రక్రియను అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు. ఎలాగంటే, కొన్ని ఫోన్ నంబర్లు లేదా జాబితాలు/పదాల్ని గుర్తు పెట్టుకోవాలనుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి గ్రూపులుగా మెదడులో భద్రపరచుకుంటే, వాటిని జ్ఞాప్తికి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. ఈ క్రమంలో స్టేజీ ఎక్కి ఒక ప్రజంటేషన్ ఇవ్వాలన్నా ఇదే పద్ధతిని పాటిస్తే, మీరు చెప్పే ముఖ్యమైన పాయింట్లు వినే వారికి చక్కగా అర్ధమవుతాయి. అర్థవంతమైన సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో విభజించే విధానాన్ని అలవరచుకోవడం ఇక్కడ చాలా కీలకం. దీనివల్ల బ్రెయిన్​పై భారం తగ్గి సునాయసంగా జ్ఞాపకం చేసుకోగలుగుతామట.

తిరిగి పొందడం అలవరుచుకోండి : ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఎంత త్వరగా మరిచిపోతామో 19వ శతాబ్దంలో జర్మనీ మానసిక శాస్త్రవేత్త హెర్మన్ ఎబింగాస్ (Hermann Ebbinghaus) ఆధారాలతో రుజువు చేశారు. మనం నేర్చుకున్న విషయాల్లో కొన్నింటిని కనీసం 30 నిముషాల్లోపే, దాదాపు సగభాగం వరకు మరిచిపోతామని ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మిగిలిన వాటిని మరుసటి రోజుకు మరిచిపోతామని పేర్కొన్నారు. స్వల్ప సమయంలో ఎక్కువ విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒకసారి విన్న, చూసిన, నేర్చుకున్న దానిని తిరిగి పొందడం ద్వారా సాధాన చేయాలన్నారు. నోట్స్​ను మళ్లీ రివిజన్ చేయడానికి బదులుగా వాటిని పక్కనబెట్టి, ముఖ్యమైన భావనల్ని మననం చేసుకోవడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. నోట్స్ చూడకుండా, మీరు ఒక విషయాన్ని వేరొకరికి బోధిస్తున్నట్లుగా, చురుకుగా బిగ్గరగా అంటూ ఉండమని సూచిస్తున్నారు

మధ్యలో విరామం తీసుకోండి : ఒకేసారి మొత్తం చదవకండి. విషయాన్ని దీర్ఘకాలికంగా గుర్తుంచుకోవడం కోసం, మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ రివిజన్ చేయండి. దీనివల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. కొత్త విషయాన్ని నేర్చుకున్న 2 రోజులు, 7 రోజులు, చివరగా 30 రోజుల తర్వాత రివిజన్ చేయండి. ఈ రోజు, రేపు, ఎల్లుండి చదివి, 7వ రోజున ఆ విషయం గుర్తుందో లేదా తనిఖీ చేయడానికి పేపర్ లేదా కంప్యూటర్​పై రాయండి.

సరిగా నిద్రపోండి : గాఢ నిద్రలో జ్ఞాపకాలు స్థిరపడతాయంటున్నారు నిపుణులు. క్రమబద్ధమైన నిద్రవేళలు జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడతాయని సూచిస్తున్నారు.

వ్యాయామం : ఏరోబిక్ వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు.

  • జ్ఞాపకం అనేది కేవలం మేధస్సుకు సంబంధించిన విషయం ఒక్కటే కాదని, అది వ్యూహానికి సంబంధించిందని తెలియజేస్తున్నారు. మన జీవన విధానంలో, చదువులో, పనిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జ్ఞాపక శక్తిని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చునని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వేసవిలో ఏం తినాలి? ఎలా తినాలి? - పోషకాహార నిపుణుల సూచనలివే!

"నిద్ర లేమి" సమస్య - స్వల్ప మార్పులతో ఎన్నో ప్రయోజనాలు!