"డెస్టినేషన్ వెడ్డింగ్" ప్లాన్ చేస్తున్నారా? - మనకు దగ్గర్లోనే అద్భుతమైన ప్రదేశాలు!
డెస్టినేషన్ వెడ్డింగ్స్ - విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా!

Published : January 6, 2026 at 3:15 PM IST
Best Places for Destination Weddings in India : వివాహం జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. ఆ వేడుకను అందరికీ గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలని వధూవరులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డెస్టినేషన్ వెడ్డింగ్ బాగా పాపులరైంది. నాలుగు రోజుల పాటు నచ్చిన చోట కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య వివాహం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. సాధారణంగా సంపన్నులు ఎక్కువగా విదేశాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు మన దేశంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు తగిన అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అభిరుచిని బట్టి ఎగువ, మధ్య తరగతి కుటుంబాలకూ అందుబాటులో ధరల్లోనే కల్యాణ వేదికలు ఉంటున్నాయి. మరి, ఆ ప్రాంతాలేవో ఇప్పుడు తెలుసుకుందాం!

రాచరికం : రాజుల కాలంలో మాదిరిగా కోటల్లో వైభవంగా, సంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకోవాలి అనుకునే వారికి రాజస్థాన్ ఉత్తమ ఎంపిక. ప్యాలెస్‌లు, సరస్సులకు ఉదయ్‌పూర్ నగరం పెట్టింది పేరు. అక్కడ లేక్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్, ఒబెరాయ్ ఉదయ్ విలాస్ వంటి వేదికలున్నాయి. జైపూర్‌లో రాంబాగ్ ప్యాలెస్, జై మహల్, అంబర్ ఫోర్ట్ వంటి చారిత్రక భవనాలు కనులవిందుగా ఉంటాయి. జోధ్‌పూర్‌లో ఫోర్ట్ ఖజెర్లా, మెహ్రాన్‌గఢ్, ఉమైద్ భవన్ ప్యాలెస్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
నలుగురిలో అందంగా కనిపించాలనుకుంటున్నారా? - ఈ ఫ్యాషన్ రూల్స్ పాటిస్తే చాలు!

బీచ్ : సముద్రం ఒడ్డున అలల సవ్వడి మధ్య, సూర్యోదయం లేదా సూర్యాస్తమయం వేళ ప్రకృతి ఒడిలో వివాహం చేసుకోవాలనుకునే వారు అండమాన్ నికోబార్ దీవులు, గోవా, కేరళను ఎంచుకోవచ్చు. గోవాలో పలు రిసార్ట్స్, హోటల్స్ సముద్రం ఒడ్డున బీచ్ సెట్టింగ్‌తో వివాహ వేడుకలను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే, సముద్రం ఒడ్డున, హడావుడి లేకుండా, నిశ్శబ్ద వాతావరణంలో బంధువుల మధ్య వివాహం చేసుకోవాలంటే అండమాన్ నికోబార్ దీవులు బెస్ట్ ఛాయిస్. బీచ్ వెడ్డింగ్, అండర్‌వాటర్ రింగ్ ఎక్స్ఛేంజ్ వంటివి మంచి అనుభూతుల్ని ఇస్తాయి.

కేరళలో బ్యాక్ వాటర్‌పై హౌస్‌బోట్స్‌లో వివాహాలు జరుపుకోవడానికి కొందరు ఇష్టపడుతున్నారు. వారికి అలపుళా బెస్ట్ ఛాయిస్. మున్నార్‌లో టీ గార్డెన్స్, కొండల మధ్య చల్లని వాతావరణంలో వెడ్డింగ్ చేసుకోవచ్చు. కోవళంలోనూ బీచ్ సెట్టింగ్ వెడ్డింగ్స్‌ను జరుపుకుంటున్నారు. ఫారెస్ట్ థీమ్‌తో మ్యారేజ్ చేసుకోవాలంటే వయనాడ్‌కు వెళ్లొచ్చు.

హిల్స్ : ఎత్తయిన పచ్చని కొండ ప్రాంతాల్లో మబ్బులు మధ్య వివాహం చేసుకోవాలనుకుంటే ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ, తమిళనాడులోని ఊటీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా, ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఇలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇష్టపడతారు. ముస్సోరీలో ప్రకృతి అందాలు, చల్లని వాతావరణం మంచి అనుభూతుల్ని ఇస్తాయి. ఊటీలో టీ గార్డెన్స్ మధ్య వివాహం అంటే ప్రకృతి ఒడిలో జరుగుతున్నట్లు ఉంటుంది. మనాలి, సిమ్లాలో పర్వతాల సౌందర్యం పెళ్లికి అదనపు హంగును తెచ్చిపెడతాయి.

చారిత్రకం : భారతీయ చరిత్ర, కళలను ప్రతిబింబించే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కర్ణాటకలోని హంపీలో పురాతన ఆలయాలు, శిల్పకళతో కూడిన వేదికలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో చారిత్రక కట్టడాల మధ్య పెళ్లి చేసుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అజంతా గుహలు, ఎల్లోరా సమీపంలో కొన్ని రిసార్ట్స్ హెరిటేజ్ వెడ్డింగ్స్‌ను అందిస్తున్నాయి.
డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యే ఖర్చు : వెడ్డింగ్ థీమ్, ఎంపిక చేసుకునే ప్రాంతం, అతిథుల సంఖ్యను బట్టి ఉంటుంది. మిడ్ రేంజ్‌లో దాదాపు రూ.20 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు అవుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు. వెడ్డింగ్ సీజన్లలో ఈ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి, ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకొని, ప్రణాళికతో బుక్ చేసుకోవడం మేలు.
ఫోన్‌కు మెసేజ్ వచ్చిన వెంటనే రిప్లై ఇస్తున్నారా? - అలర్ట్ కాకపోతే ఇబ్బందులు తప్పవట!

