పిల్లలు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
మీ పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయా? - వెంటనే అప్రమత్తం కావాలంటున్న నిపుణులు!

Published : November 13, 2025 at 5:29 PM IST
Signs that Child is Looking for Parents Support: బాల్యం అంటేనే ఉల్లాసం, ఉత్సాహం. దీనికి తగ్గట్లుగానే పిల్లలు కూడా ఇంట్లో ఎప్పుడూ ఆడుకుంటూ సరదాగా, సంతోషంగా ఉంటారు. అలా ఉండకపోతే పేరెంట్స్ మనసు మనసులో ఉండదు. అయితే, కొన్ని సందర్భాల్లో వారు ఉన్నట్లుండి డల్ అయిపోవడం, చెప్పిన మాట వినకుండా ఎప్పుడూ ముభావంగా కనిపిస్తుంటారు. ఇలాంటప్పుడే వారిని ఓ కంట కనిపెట్టాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే, వారు మీతో ఏదో చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నారనడానికి ఇదీ ఓ సంకేతమని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వారి మనసులోని బాధేంటో తెలుసుకొని, అండగా నిలబడితే వారు ఆ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నట్లు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
ఒంటరిగా ఉంటున్నారా?: పిల్లల్లో మానసిక సమస్యలకు చాలా కారణాలు ఉంటాయి. ఎవరైనా బెదిరించడం, లైంగికంగా హింసించడం, చదువులో వెనకబడడం, చదువు, ఇతర విషయాల్లో పేరెంట్స్ ఒత్తిడి చేయడం, వారి ఇష్టాయిష్టాలకు తల్లిదండ్రులు విలువివ్వకపోవడం వంటివి ఉంటాయి. ఇలా మానసికంగా బాధపడే పిల్లలు, కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా ఉండడానికే మొగ్గు చూపుతారని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా, స్కూల్లోనూ స్నేహితులతో కలవకుండా, ఆటలు-ఇతర యాక్టివిటీల్లో పాల్గొనకుండా దూరంగా ఉండడానికే ఇష్టపడతారని చెబుతున్నారు. ఇలా వారికి నచ్చిన వ్యక్తుల్ని, వ్యాపకాల్ని తరచూ దూరం పెడుతున్నట్లు గమనిస్తే, పిల్లల మనసులో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలంటున్నారు. ఇలాంటి సమయంలో పిల్లలతో స్నేహంగా మెలుగుతూ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు. అప్పుడే దానికి సరైన పరిష్కారం చూపి, వారిని తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావచ్చని సూచిస్తున్నారు.
చిరాకు పడుతుంటే : పిల్లల ప్రవర్తన ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అప్పుడే నవ్వుతారు, మరుక్షణమే చిరాకు పడుతుంటారు. అయితే, పిల్లలు ఇలా ప్రవర్తించడం చూస్తుంటే అప్పుడప్పుడు నవ్వొస్తుంది. 'పిల్లలు కోపమెంతసేపు, చిటికెలో మాయమైపోతుంది’ అనుకునే వారు చాలా మంది ఉంటారు. పిల్లలు ఎప్పుడో ఒకసారి ఇలా ప్రవర్తిస్తే పర్లేదు కానీ, తరచూ ఇలానే చేస్తున్నట్లయితే, వారిలో ఏదో మానసిక సమస్య ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. కాబట్టి, వారు చిరాకు పడుతున్నారని, మనం కూడా కోప్పడితే అసలు సమస్య బయటపడదని చెబుతున్నారు. అందుకే ఇలాంటి సమయంలో సంయమనంతో వ్యవహరించి, పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే వారు తమ సమస్యను సులభంగా బయటపెట్టగలుగుతారని సలహా ఇస్తున్నారు.
'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' - ఇలా చేస్తే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'!
ఆత్మన్యూనత, అభద్రత : మాములుగా పిల్లల్లో ఒక రకమైన మొండితనం ఉంటుంది. ఏ విషయంలోనైనా వాళ్లను తక్కువ చేసి మాట్లాడినా, మీ వల్ల కాదన్నా వాళ్లు ఒప్పుకోరు. అయితే, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ, తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచించే పిల్లలు దీనికి పూర్తి విరుద్ధంగా నడుచుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ‘నేను ఆ సబ్జెక్టులో రాణించలేను’, ‘నాకంత సీన్ లేదు’ అంటూ తమను తాము తక్కువ చేసుకుంటారని అంటున్నారు. ఇలాంటి ఆత్మన్యూనత, అభద్రతా భావంలో కూరుకుపోయిన పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల మాటలు, చేతలు వారిలో సానుకూల దృక్పథం నింపేలా ఉండాలని తెలియజేస్తున్నారు. వారు చేరుకున్న లక్ష్యం చిన్నదైనా సరే, వారిపై ప్రశంసలు కురిపించాలని పేర్కొంటున్నారు. ప్రయత్నిస్తే ఇంకా రాణించగలవు అంటూ వారి వెన్నుతట్టాలని తెలియజేస్తున్నారు. అప్పుడే వారిలో సానుకూల మార్పును చూడగలమని వివరిస్తున్నారు.
ఆరోగ్యపరంగానూ : మానసిక సమస్యలు ఒక దశలో ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటి కారణంగా పిల్లల్లో తరచూ తలనొప్పి, కడుపునొప్పి, అలసట, నీరసం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతున్నారు. అయితే, చాలామంది తల్లిదండ్రులు వీటిని సాధారణ సమస్యల్లాగే పరిగణిస్తారని, మానసిక ఒత్తిడి వల్ల ఇలాంటివి కూడా వస్తాయన్న అవగాహన వారిలో ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయా సమస్యల్ని దూరం చేయడానికి చికిత్స ఇప్పిస్తూనే, మానసికంగానూ వారిలో ఉన్న సమస్యలేంటో తెలుసుకొని దూరం చేయాలని సూచిస్తున్నారు.
పిల్లల్లో తలెత్తే మానసిక, శారీరక సమస్యల ప్రభావం వారి రోజువారీ అలవాట్లు పైనే కాదు, స్కూల్ రొటీన్, చదువు పైనా ప్రతికూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, వారి ప్రవర్తనను తరచూ గుర్తిస్తూనే, తల్లిదండ్రులుగా వారితో స్నేహం చేయాలని చెబుతున్నారు. అప్పుడే వారు అన్ని విషయాలు నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకోగలుగుతారని సూచిస్తున్నారు. ఒకవేళ ఇలా కూడా వారు స్పందించకపోతే నిపుణుల కౌన్సెలింగ్ వారికి చాలావరకు మేలు చేస్తుందని సలహా ఇస్తున్నారు.
"ఇలా చేశారంటే ఇంట్లోనే జిమ్" - వ్యాయామం పెద్దగా ఖర్చుచేయాల్సిన పన్లేదు!
ఇంట్లో కూడా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!

