మీ ఇంట్లో డబ్బు, నగలు మాయం అవుతున్నాయా? - వారిని అనుమానించాల్సిందేనట!
-ఇంటి తాళాలు వేసేముందు - పిల్లల మనసు తలుపులు తెరవమంటున్న నిపుణులు!

Published : October 23, 2025 at 2:27 PM IST
Child Thief in Home: మన ఇంట్లో డబ్బు, నగలు మాయం అవ్వగానే.. బయట నుంచి ఎవరో వచ్చి దొంగతనం చేశారని అనుమానిస్తాం. కానీ, ఆ పని చేసింది ఇంట్లో పిల్లలే అని తెలిస్తే తల్లిదండ్రులు తల్లడిల్లడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది పిల్లలు, యువత ఆన్లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడి గాడి తప్పుతున్నారు. అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు దారుణాలకు తెగబడుతున్నారు. ఇది డబ్బు నష్టం కంటే తల్లిదండ్రుల విశ్వాసానికి పెద్ద గాయం చేస్తోంది. అందుకే ఇంటి తలుపులకు తాళం వేసే ముందు మనం పిల్లల మనసుల తలుపులు తెరిచామా? అని తల్లిదండ్రులు ఆలోచించాలని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు దారితప్పడానికి కారణాలు ఏమిటి? వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
కారణాలివే : పిల్లలు దారితప్పడానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడమే అంటున్నారు నిపుణులు. చాలా సార్లు స్నేహితుల ప్రభావం వల్లే పిల్లలు గాడి తప్పుతుంటారని చెబుతున్నారు. అలాగే, ఇంట్లో పెద్దలు చేసే చిన్న తప్పులు, సరదాగా చేసే పనులు పిల్లలకు సాధారణమే అనిపించి అలవాటు చేసుకుంటారని వివరిస్తున్నారు. ఇక మొబైల్ ఫోన్స్, సామాజిక మాధ్యమాల ప్రభావం ఆన్లైన్ గేమ్స్ వల్ల విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతి పిల్లలకు చిన్న వయసులోనే అలవాటవుతుందని హెచ్చరిస్తున్నారు.
వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి? - హెడ్ బాత్కు ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు ముఖ్యమట!
హైపర్ యాక్టివ్, భావోద్వేగ నియంత్రణ ఇబ్బందులున్న కొందరు పిల్లలు, యువకులు థ్రిల్ కోసం దొంగతనాలకు పాల్పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఫ్రెండ్స్ ఏ డ్రెస్‌లు వేసుకుంటున్నారు? ఎవరు ఏ బైక్‌లు, ఫోన్లు వాడుతున్నారు? అనే పోలికలు పిల్లల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు డబ్బు, ఆభరణాలు విలువైన వస్తువులు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టడం, పిల్లలు తమ కోరికలను తీర్చుకోవడానికి మార్గంగా మారుతోందని తెలియజేస్తున్నారు.
దృష్టి పెట్టండి :
- కౌమరదశలో ఉన్న పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుండాలి.
- ఇంట్లో డబ్బులు కనిపించట్లేదంటే గమనించడం తప్పనిసరి.
- ప్రశ్నించగానే భయపడటం, అబద్ధం చెప్పడం చేస్తున్నారా? అనేది చూడాలి.
- కొత్త వస్తువులు, డబ్బులు తెచ్చి, ఎవరు ఇచ్చారో చెప్పకపోవడం కూడా అనుమానించాల్సిన విషయమే.
- మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఏ గేమ్స్ ఆడుతున్నారనే దానిపై నిఘా ఉండాలి.
ఇలా చేద్దాం :
- ఇంట్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.
- పిల్లలు నిజాయితీగా ఉంటే ప్రశంసించండి.
- నిజం చెప్పినప్పుడు అభినందించండి.
- వ్యక్తిగత వస్తువులు, ధనం, స్వేచ్ఛకు ఉన్న విలువను చెప్పండి.
- పిల్లల చేతికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడాన్ని తగ్గించాలి.
- డబ్బు విలువ, నిజాయితీ, నమ్మకం అనే మూడు సూత్రాలు చిన్నప్పటి నుంచే నేర్పాలి.
- పిల్లల ప్రవర్తనలో అసహజ మార్పులుంటే సైకాలజిస్టును సంప్రదించాలి. ఇది కుటుంబ సమస్యగా కాకుండా సమాజ సమస్యగా చూడాలని అంటున్నారు.
"మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా?" - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

