"ఇలా చేశారంటే ఇంట్లోనే జిమ్" - వ్యాయామం పెద్దగా ఖర్చుచేయాల్సిన పన్లేదు!
ఫిట్‌నెస్ కోసం జిమ్‌కే వెళ్లాలా? - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Published : November 10, 2025 at 3:24 PM IST
Tips to Create Budget Friendly Home Gym : ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఓ మినీ జిమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. దీంతో జిమ్ తరహా అనుభూతిని పొందడంతో పాటు ఖర్చునూ అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
ఫిట్‌నెస్ మెషినరీ : ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇంట్లో ఎంత ఖాళీ ప్రదేశం ఉంది, దీనికోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించగలరా? లేదంటే బాల్కనీలో ఏర్పాటుచేసుకుంటారా? అనేది ముందుగా నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. అప్పుడే ఆ ప్రదేశాన్ని బట్టి జిమ్‌ను ఏర్పాటు చేసుకోవడం సులువవుతుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలో జిమ్ సెంటర్లో మాదిరిగా ఇంట్లోనూ అన్ని రకాల ఫిట్‌నెస్ మెషినరీ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. వాటి వల్ల ఇంట్లో ప్రదేశం, డబ్బు రెండూ వృథా! కాబట్టి, మీరు చేరుకోవాల్సిన ఫిట్‌నెస్ లక్ష్యమేంటో ముందు నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. అందుకు ఉపయోగపడే జిమ్ మెషినరీ గురించి నిపుణుల్ని అడిగి తెలుసుకుంటే, దాన్నే ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా, వీటితో పాటు ఒక యోగా మ్యాట్ తీసుకుంటే, పులప్స్ (pull up), పుషప్స్ వంటి నేలపై చేసే వ్యాయామాలకు అనువుగా ఉంటాయని వివరిస్తున్నారు.

బోరింగ్ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా? - జుంబా డ్యాన్స్‌తో ఫన్ అండ్ ఫిట్‌నెస్!
ఇంట్లో ఉండే వస్తువులు : ఒకవేళ జిమ్ మెషినరీపై డబ్బు వృథా ఎందుకు అనుకునే వారు, ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువుల్నీ వ్యాయామాల కోసం ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే, బరువైన వస్తువుల్ని వెయిట్ లిఫ్టింగ్ కోసం, పుషప్స్ కోసం బాస్కెట్ బాల్, జంపింగ్ కోసం స్కిప్పింగ్ రోప్, కార్డియో వ్యాయామాల కోసం మెట్లనూ ఉపయోగించచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఫిట్‌నెస్ మెషినరీని ఎంచుకునే వారు, ఒకే మెషీన్‌తో విభిన్న రకాల వ్యాయామాలు చేయగలిగేలా మల్టీపర్పస్ మెషీన్స్‌ని ఎంచుకుంటే డబ్బు, ఇంట్లో స్థలం రెండూ ఆదా అవుతాయని తెలియజేస్తున్నారు. స్టెబిలిటీ బాల్‌తో కోర్ వ్యాయామాలు, యోగా వంటివి సాధన చేయవచ్చని వివరిస్తున్నారు.

గాలి, వెలుతురు ధారళంగా : ఇంట్లో జిమ్‌ను ఏర్పాటుచేసుకోవాలనుకునే వారు, ఆ ప్రదేశంలో గాలి, వెలుతురు, ధారాళంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే, వ్యాయామం చేసే క్రమంలో శరీరం చెమటలు కక్కుతుందని చెబుతున్నారు. ఇలాంటప్పుడు గాలి తగలకపోయినా చిరాగ్గా అనిపిస్తుంటుందని పేర్కొంటున్నారు. అలాగే, సహజసిద్ధంగా బయటి నుంచి వచ్చే వెలుతురు మనసును ఉత్తేజితం చేస్తుందని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే గార్డెన్ ఉన్నవారు తమ జిమ్ మెషినరీని ఆ పచ్చటి చెట్ల మధ్యలో ఏర్పాటు చేసుకోగలిగితే.. ఇటు మానసిక ఉల్లాసం, అటు ఇంట్లో స్థలం కూడా ఆదా అవుతుందని వివరిస్తున్నారు. ఇక ఈ సదుపాయం లేని వారు, తాము ఏర్పాటు చేసుకున్న జిమ్ ప్రదేశంలో ఇండోర్ ప్లాంట్స్ అమర్చుకోవచ్చని సూచిస్తున్నారు. మానసిక ఉల్లాసం కోసం ఆ ప్రదేశాన్ని తమకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
ఇంట్లో కూడా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' - ఇలా చేస్తే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'!

