న్యూ బ్యూటీ ట్రెండ్ - ఇదే జెన్‌జీ 'సౌందర్య మంత్రం'!
-సిసలైన అందం ‘మినిమలిజం’లోనే - నేటి తరం అమ్మాయిల గోల్డెన్ బ్యూటీ టిప్స్ ఇవే!

Published : August 29, 2026 at 6:33 PM IST
Beauty Lessons Learn from Gen z : అందంగా మెరిసిపోవాలంటే మార్కెట్లో దొరికే బ్యూటీ ఉత్పత్తులు వాడాలి.. మేకప్ వేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. కానీ, జెన్‌జీ అమ్మాయిలు ఈ సూత్రాన్ని పాటించారట! మినిమలిజంలోనే సిసలైన అందం దాగుందని చెప్పడమే కాదు.. వారు దానిని ఆచరించి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మమ్మల కాలం నాటి సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆ గోల్డెన్ టిప్స్‌ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎంతో మందిలో సౌందర్య స్పృహ పెంచుతున్నారు. మరి, ఇంతకీ జెన్‌జీ అమ్మాయిలు పాటిస్తున్న ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
పైపై మెరుగులకు 'నో'! : చాలామంది నల్ల మచ్చలు, మొటిమలు ఎవరికీ కనిపించకుండా మేకప్‌తో దాచేయాలనుకుంటారు. కానీ, జెన్ జీ అమ్మాయిలు అయితే.. చర్మ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చర్మాన్ని లోలోపలి నుంచి మెరిపించడానికి రసాయనాలతో కూడిన బ్యూటీ ఉత్పత్తులకు బదులు.. చర్మాన్ని శుభ్రం చేసుకోవడం, మాయిశ్చరైజర్ రాసుకోవడం, సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవడం వంటి సింపుల్ రొటీన్‌ని పాటిస్తున్నారట. వీటిలోనూ ఎవరితోనూ పోల్చుకోకుండా తమ చర్మతత్వానికి సరిపోయే ఉత్పత్తుల్నే ఆచితూచి, లేబుల్‌ని క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఎంచుకుంటున్నారట. ఇలా చర్మం లోలోపలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బయటకి కాంతివంతంగా కనిపిస్తుందట. ఇలాంటప్పుడు చర్మానికి తక్కువ మేకప్ సరిపోతుందని, తద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
భార్యాభర్తల మధ్య బంధం బలపడలా? - ఈ టిప్స్ పనికొస్తాయంటున్న నిపుణులు!
సన్‌స్క్రీన్ : చాలామంది బయటికి వెళ్లినప్పుడు ఎండ వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా సన్‌స్క్రీన్ రాసుకుంటారు. సూర్యకాంతిలోని యూవీ కిరణాలు, మొబైల్ నుంచి వచ్చే నీలి కాంతి.. చర్మంపై ప్రతికూల ప్రభావం చూపి చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలు రావడం, నల్ల మచ్చలు ఏర్పడడం వంటి చర్మ సమస్యలకు దారితీస్తాయని.. ఇవి రాకుండా ముందు జాగ్రత్తగా జెన్‌జీ సన్‌స్క్రీన్ లోషన్పై ఆధారపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిలోనూ చర్మతత్వాన్ని బట్టి జెల్ ఆధారిత లోషన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారట.
గుడ్డిగా నమ్మేయకుండా! : అభిమాన నటి యాడ్‌లో చూశామనో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాడుతున్నారనో .. కొంతమంది కొన్ని సౌందర్యోత్పత్తుల్ని మరో ఆలోచన లేకుండా కొనేసి ఉపయోగిస్తుంటారు. కానీ, జెన్‌జీ అమ్మాయిలు ఇది బ్యాడ్ అప్రోచ్ అంటున్నారు. ఒక ఉత్పత్తిని ఎవరు ప్రమోట్ చేశారనే విషయంతో సంబంధం లేకుండా, ఆ బ్యూటీ ప్రొడక్ట్ తమకు నప్పుతుందా లేదా అని గూగుల్‌లో శోధించడం, లేదా సౌందర్య నిపుణుల సలహాలు తీసుకోవడం వంటివి చేస్తున్నారట. అంతేకాదు, అమ్మమ్మల కాలంలో వారు పాటించిన సౌందర్య చిట్కాల్ని తెలుసుకోవడానికి, వాటిని పాటించడానికి జెన్‌జీ ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఇలా భవిష్యత్తులో తమ అందం విషయంలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.
'నో ఫిల్టర్' సెల్ఫీలు! : ఫెయిర్‌గా ఉండాలి.. నాజూగ్గా కనిపించాలి.. ఇలా అందం విషయంలో సమాజం కొన్ని నియమాల్ని నిర్దేశించింది. అయితే, ఇవన్నీ 'టాక్సిక్' అంటూ కొట్టి పారేస్తున్నారు జెన్ జీ అమ్మాయిలు. ఈ నేపథ్యంలో తాము ఎలా ఉంటే అలా 'నో ఫిల్టర్' సెల్ఫీలు, ఫొటోలు పోస్ట్ చేయడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అలాగే, మొటిమలు, నల్ల మచ్చలు, జుట్టు రాలడం వంటి సౌందర్య సమస్యలకు కారణమయ్యే ఒత్తిడి, PMOS, హార్మోన్ల మార్పుల గురించి బహిరంగంగా పంచుకోవడానికి వారు వెనకాడటం లేదంటున్నారు. దీనివల్ల ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న చాలా మందిలో 'తాము ఒంటరి కాదు' అనే నమ్మకం కలుగుతోందని, అందమంటే ఆత్మవిశ్వాసమే అనే ఆలోచనను వారి మనసుల్లో నింపుతున్నారని అంటున్నారు. అయితే, ఇంత సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ.. ఎవరైనా సోషల్ మీడియాలో తమను బాడీ షేమింగ్ లేదా బ్యూటీ షేమింగ్ చేస్తే, అస్సలు బాధపడకుండా నిర్మొహమాటంగా వారిని అన్‌ఫాలో చేయడానికి వీరు వెనకాడటం లేదట. ఈ విధంగా స్వీయ ప్రేమకు సిసలైన అర్థం చెబుతున్నారు జెన్‌జీ అమ్మాయిలు.
జుట్టుకు నూనె : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నూనె పెట్టుకోవాలని అమ్మమ్మల కాలం నాటి నుంచి చెబుతుంటారు. జెన్‌జీ అమ్మాయిలు సైతం ఇప్పుడు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. సమయం ఉన్నప్పుడు జుట్టుకు నూనె పట్టించి, బాగా మర్దన చేసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని, మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తున్నారట. ఒకవేళ సమయం లేకపోతే మాత్రం, తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు జుట్టుకు, కుదుళ్లకు నూనె పట్టించి, కాసేపు మర్దన చేసుకుని ఆపై తలంటు పోసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుందని వీరు బలంగా నమ్ముతున్నారట.
మీరు భోజనానికి ఏ 'పాత్రలు' వాడుతున్నారు? - వీటిల్లో తినడం మంచిదికాదట!
'ముడతలు, నల్లటి వలయాల'తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ నేచురల్ టిప్స్ ట్రై చేయండి!

