ETV Bharat / lifestyle

జుట్టు ఎక్కువగా రాలిపోతోందా?  - ఈ ఆయుర్వేద చిట్కాలు​ మేలు చేస్తాయట!

-జుట్టు సంరక్షణకు ఆయుర్వేద వైద్యం - ఇలా చేయాలంటున్న నిపుణులు!

Hair Care Tips
Hair Care Tips (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : May 28, 2026 at 3:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ayurvedic Hair Care Tips : కేవలం అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని కూలంకశంగా పేర్కొంది ఆయుర్వేద శాస్త్రం. కేవలం ఆరోగ్య పరంగా మాత్రమే కాదు జుట్టు సమస్యలకు ఆయుర్వేదంలో చికిత్సలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

నూనెతో మసాజ్ : క్రమం తప్పకుండా తలను నూనెతో మసాజ్ చేయడం అనేది ఆయుర్వేదంలో అత్యంత ఉత్తమమైన అలవాటు. దీని వల్ల జుట్టుకే కాకుండా మొత్తం శరీరానికి, మనస్సుకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొబ్బరి, నువ్వులు లేదా బాదం నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగవుతుందని చెబుతున్నారు. ఫలితంగా, కుదుళ్లకు అవసరమైన పోషకాలు అంది, జుట్టు రాలడం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయని తెలియజేస్తున్నారు. కొబ్బరి నూనె వెంట్రుకలపై ఒక రక్షణ పొరను ఏర్పరిచి, క్యూటికల్ (వెంట్రుక పైపొర)ను మూసివేయడం ద్వారా తేమను నిలిపి ఉంచుతుందని Indian Journal of Dermatology,Venereology and Leprology పేర్కొంది.

హెర్బల్ హెయిర్ రిన్స్ : తలస్నానానికి శీకాకాయ్, కుంకుడుకాయలు, ఉసిరికాయ వంటి సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేయడానికి, చుండ్రును నియంత్రించడానికి సహాయపడతాయని అంటున్నారు. అంతేకాదు, కురులను సహజంగా మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయట.

ఎండకు చర్మం కమిలిపోయిందా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

సమతులాహారం, నీరు : విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగడం వల్ల జుట్టుకు లోపలి నుంచి పోషణ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, పండ్ల వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు దృఢంగా ఉంటుందని అంటున్నారు. అలాగే, చిన్నవయసులోనే జుట్టు తెల్లబడకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల జుట్టు మందం, స్థితిస్థాపకతకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

డ్రైయర్ వద్దు : హీట్ స్టైలింగ్ పరికరాలు జుట్టును తాత్కాలికంగా అందంగా మార్చినప్పటికీ, తీవ్రమైన వేడివల్ల జుట్టులోని సహజ తేమ, కెరాటిన్ ప్రొటీన్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, విపరీతంగా రాలిపోతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే, తలస్నానం చేసిన తర్వాత జుట్టును ఫ్యాన్​ గాలికే ఆరనివ్వాలని సూచిస్తున్నారు. హెయిర్ డ్రయర్‌ వాడడం వల్ల జుట్టు గరుకుగా మారడం, పొడిబారడం, చిట్లిపోవడం, రంగు కోల్పోతుందని National Library of Medicine పేర్కొంది.

హెయిర్ స్టైల్స్ : జుట్టును బిగుతుగా లాగి వివిధ హెయిర్​ స్టైల్స్ వేసుకోవడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయట. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఇంట్లో ఉన్నప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు జుట్టును లూజ్​గా జడ వేసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. ఇది జుట్టు చిక్కుబడకుండా, రాలిపోకుండా చేస్తుందని తెలియజేస్తున్నారు.

తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణ : నిద్ర, మానసిక ప్రశాంతత అనేవి కేవలం ఆరోగ్యానికే కాదు, ఒత్తుగా పెరిగే జుట్టుకు కూడా అత్యంత ముఖ్యమంటున్నారు నిపుణులు . మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయట. ఇవి జుట్టు కుదుళ్లను బలహీనపరచడం, జుట్టు రాలడానికి, తెల్లబడటానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ధ్యానం, యోగా, లోతైన శ్వాస వంటి పద్ధతులు ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయని సూచిస్తున్నారు. అలాగే, సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని సలహా ఇస్తున్నారు.

సూర్యరశ్మి నుంచి రక్షణ : సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు జుట్టులోని కెరాటిన్ ప్రొటీన్​ను దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. దీంతో జుట్టు పొడిబారడం, రంగు మారిపోవడం, చిట్లిపోతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో జుట్టుకు నూనెను రాసుకోవడం, టోపీలు లేదా స్కార్ఫ్​లు ధరించడం వల్ల కురులకు యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుందని సూచిస్తున్నారు. తద్వారా జుట్టు రంగు మారకుండా ఉంటుందని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వంట నూనెను తగ్గిద్దామిలా! - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న ఎక్స్​పర్ట్స్​!!

భాగస్వామి అలవాట్లతో ఇబ్బంది పడుతున్నారా? - ఇలా డీల్​ చేస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​!