పాలకూరతో అందమైన చర్మం, పొడవైన జుట్టు? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!
పాలకూరలో విటమిన్లు ఎక్కువ - పెరిగే చర్మకాంతి!

Published : May 11, 2026 at 3:47 PM IST
Amazing Benefits of Spinach for Skin and Hair : అందమైన చర్మం, నల్లటి ఒత్తయిన, మెరిసే జుట్టు కావాలని చాలామంది కోరుకుంటారు. కానీ, ఈ రోజుల్లో సరైన ఆహారం తినకపోవడం, ఇతర సమస్యల కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోవడం, పల్చబడటం కామన్ అయిపోయింది. ముఖ్యంగా, ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర అందమైన చర్మం, శిరోజాలకి ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
మెరిసే చర్మం కోసం : పాలకూరలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు చర్మ కణాలకు పోషణను అందించడంలో సహాయపడతాయి. ఈ పోషకాలు చర్మం తాజాగా, శక్తివంతంగా, సహజమైన కాంతితో మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మొటిమల నివారణ : పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరం నుంచి విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయట. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది.
వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది : పాలకూరలో లూటిన్, బీటా-కెరోటిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ముడతలు, సన్నని గీతలు, వయస్సు వల్ల వచ్చే మచ్చలను తగ్గించి, చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుందట.
పిల్లలకు డబ్బు గురించి చెబుతున్నారా? - చిన్నప్పుడే అవగాహన కల్పించాలంటున్న నిపుణులు!
సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది : పాలకూరలోని విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ చర్మాన్ని హానికరమైన అతినీలలోహిత కిరణాలు, పర్యవరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయట.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది : పాలకూరలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. తగినంత నీరు ఉండటం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుందని చెబుతున్నారు.
చర్మం త్వరగా కోలుకోవడానికి : పాలకూరలోని విటమిన్ సి అనేది కొల్లాజెన్ ఉత్పత్తికి మద్ధతు ఇస్తుంది. ఇది దెబ్బతిన్న చర్మ కణజాలాలను పునరుద్ధరించడానికి, గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది.
పాలకూర అత్యంత పోషకమైన ఆకుకూర. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు బలంగా ఎదదడానికి తోడ్పడుతుంది. ఇందులోని ఎ, సి, ఇ వంటి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడంలో, జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు. అలాగే, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సికరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందట.
జుట్టు ఆరోగ్యంగా : కొలాజిన్, కెరాటిన్ ఈ రెండూ జుట్టు ఎదగడానికి చాలా అవసరం. సి, బి విటమిన్లు పుష్కలంగా ఉండే పాలకూర ఈ రెండింటినీ సమృద్ధిగా అందించి రాలిన జుట్టు రావడానికీ, వేగంగా పెరగడానికి సాయం చేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మాడు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయని చెబుతున్నారు.
జుట్టు పెరుగుదలకు : పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి తల భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది : ఐరన్ లోపం అనేది జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి. పాలకూర శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
జుట్టుకు మెరుపును ఇస్తుంది : పాలకూరలోని పోషకాలు జుట్టును లోపం నుంచి పోషించి, జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తాయి. దీనివల్ల జుట్టు మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది.
- పాలకూరలో సమృద్ధిగా ఉండే ఐరన్ వెంట్రుక మొదళ్లకు ఆక్సిజన్ అందించి అవి రాలకుండా చూస్తుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చిన్న వయసులోనే "చర్మం ముడతలు" పడుతోందా? - కారణాలు ఇవే కావచ్చట!
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

