రష్యా గగనతలంలో ఎవరూ ప్రయాణించొద్దు- డ్రోన్ దాడులు చేస్తాం: జెలెన్స్కీ
రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడి హెచ్చరిక- మాస్కో దాడులకు ప్రతిస్పందనగా రష్యా సైనిక లక్ష్యాలపై దాడులు చేయనున్నట్లు జెలెన్స్కీ ప్రకటన

Published : September 2, 2026 at 2:02 PM IST
Zelenskyy Warns Airlines : రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదని సూచించారు. ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. మంగళవారం చేసిన ప్రంసంగంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ సైనిక లక్ష్యాలపై విరుచుకుపడుతామని జెలెన్స్కీ ప్రకటించారు. దాడుల నేపథ్యంలో రష్యా తమ గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందని, కాబట్టి ఆ ప్రాంతం ఇకపై పౌర విమానయానానికి ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో, పౌర విమానయానానికి ముప్పు కలిగించే పనేది తాము చేయబోమని చెప్పారు. రష్యా గగనతలంలోని ప్రమాదాల గురించి, అంతర్జాతీయ సంస్థలకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తి సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. రష్యా తమపై దాడులను కొనసాగిస్తున్నందున వాటిని అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధమే ఇప్పుడు దాని గగనతలాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
'దౌత్యపరమైన పరిష్కారానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉంది'
ఇదిలా ఉండగా, దౌత్యపరమైన పరిష్కారానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. "ఆగస్టు 25, 26, 27 తేదీల్లో మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై దాడులు నిలిపివేయాలని అమెరికా కోరినప్పుడు ఆ విరామాన్ని పాటించాం. శాంతి దిశగా వేసే ప్రతి అడుగు, యుద్ధాన్ని నిరోధించే ప్రతి అంశానికి మేం మద్దతు ఇస్తాం" అని జెలెన్స్కీ చెప్పారు.
'ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేస్తాం'
మరోవైపు, జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. పౌర విమానయాన భద్రతపై ఉక్రెయిన్ చేసిన హెచ్చరికను 'స్టేట్ టెర్రరిజం'గా అభివర్ణించారు. చర్చలకు సంబంధించి జెలెన్‌స్కీ చేసిన పిలుపును పుతిన్ తిరస్కరించారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని విద్యుత్, ఇంధన కేంద్రాలపై భారీ దాడులు చేసేందుకు సిద్ధం కావాలని తన సైన్యాన్ని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ దాడులు ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం చూపుతాయని తెలిపారు. అనంతరం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. బిష్కెక్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సు అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు.
రష్యాలోని కీలక స్థావరాలపై ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో రష్యా దళాలు తమ దాడుల వేగాన్ని పెంచాయని తెలిపారు. దాడుల తీవ్రతకు నిదర్శనంగా కేవలం ఆగస్టు నెలలోనే డొనెట్స్క్ ప్రాంతంలో ఏకంగా 270 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, 15 నివాస ప్రాంతాలను రష్యా సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుందని వివరించారు. మరోవైపు, యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కోసం అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న సంప్రదింపుల పైనా పుతిన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితులుగా భావించే వారితో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ పర్యటనపై అడగ్గా, ఇరు దేశాల నిఘా సంస్థల అధిపతుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని పుతిన్ అంగీకరించారు. ప్రస్తుతం చర్చలు కొంతమేర నిలిచిపోయాయని చెప్పారు.
1,127కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య- వరదలకు అదే కారణమని తేల్చిన ప్రధాని బాలేంద్ర షా
ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకపడిన అమెరికా- అతిపెద్ద దాడి ముందుందని ట్రంప్ వార్నింగ్

