'ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం'- భీకర దాడులపై ప్రపంచ దేశాల స్పందన- ఎవరేమన్నారంటే?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఎటాక్- భీకర దాడులపై ప్రపంచ దేశాల స్పందన- యుద్ధం ఆపి చర్చలు జరపాలని ఇరు వర్గాలకు సూచన

Published : February 28, 2026 at 10:02 PM IST
US Israel Attacks On Iran : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందించాయి. విస్తృత ప్రాంతీయ ఘర్షణగా మారే అవకాశం ఉండటంతో ఐరోపా అప్రమత్తమైంది. విచక్షణారహితంగా దాడులు చేయొద్దని ఐరోపా నేతలు ఇరాన్‌ను హెచ్చరించారు. చర్చలు ప్రారంభించాలని అమెరికా- ఇరాన్‌లను కోరారు. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే వంటి దేశాలు అంతర్గత అత్యవసర భద్రతా సమావేశాలు నిర్వహించాయి. మిడిల్ ఈస్ట్‌లో తమ పౌరులను రక్షించడానికి చర్యలు చేపట్టాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, ఖమేనీ పాలనను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ట్రంప్ ఏకపక్ష నిర్ణయాన్ని నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాడుల గురించి ఐరోపా మిత్ర దేశాలకు సైతం అమెరికా సమాచారం ఇవ్వలేదని సమాచారం.
అమెరికా-ఇజ్రాయెల్ చర్యను ఖండిస్తున్నాం: మేక్రాన్
దాడుల గురించి ఐరోపా మిత్ర దేశాలకు సైతం అమెరికా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అత్యవసర ఐరాస భద్రతామండలి సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. UAE, ఖతార్, జోర్డాన్‌లకు సైనిక సాయం అందిస్తామన్నారు. అమెరికా- ఇజ్రాయెల్ ఏకపక్ష చర్యను తిరస్కరిస్తున్నామని, ఇది అనిశ్చితికి దారితీస్తుందని స్పెయిన్ తెలిపింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, పౌరులను రక్షించాలని ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు.
ఖండించిన మలేసియా, పాకిస్థాన్
అమెరికా- ఇజ్రాయెల్ దాడులు బాధ్యతారహితమైనవి, అవి అణు విస్తరణను తీవ్రతరం చేస్తాయని నోబెల్‌శాంతి బహుమతి ప్రతినిధి తెలిపారు. మలేసియా, పాకిస్థాన్‌లు కూడా అమెరికా- ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించాయి. సార్వభౌమ, ఐరాస సభ్యదేశంపై ఏ కవ్వింపు చర్యలు లేకుండానే చేసిన దురాక్రమణ చర్యగా రష్యా అభివర్ణించింది. అమెరికా వెంటనే దాడులను నిలిపేసి చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. పాలనను అంతమొందించేందుకు అణు బూచిని చూపిస్తున్నారని రష్యా ఆరోపించింది.
ఆందోళన వ్యక్తం చేసిన భారత్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఉద్ఘాటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన విదేశాంగమంత్రి జైశంకర్ పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా ఫోన్‌లో మాట్లాడిన ఆయన అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
తమ భాగస్వాములపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నాం : బ్రిటన్
ఉద్రిక్తతలు మరింత పెరిగి ఈ ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారాలని తాము కోరుకోవడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. తమ భాగస్వాములపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ రక్షణ ఆపరేషన్‌లో భాగంగా తమ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి తమ విమానాలు ఆకాశంలో ఉన్నాయని పేర్కొన్నారు. బ్రిటన్ స్థావరాలను రక్షణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మ
ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన చైనా, రష్యా
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని చైనా స్పందించింది. ఇరాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పేర్కొంది. రోవైపు రష్యా కూడా స్పందించింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశంపై దాడి చేడం అంతర్జాతీయ న్యాయ సుత్రాలకు విరుద్ధమని పేర్కొంది. అన్ని పక్షాలు నియంత్రణ పాటించాలని ఐరోపా యూనియన్ తెలిపింది. అంతర్జాతీయ న్యాయ సుత్రాలను గౌరవించాలని పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది.
అమెరికాకు ఆస్ట్రేలియా మద్దతు
ఇరాన్ అణుబాంబు తయారుచేయకుండా చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇరాన్ ప్రస్తుతం నాయకత్వం పశ్చిమాసియాలో అస్థిరత సృష్టిస్తోందని తెలిపింది.

