'పుతిన్‌ను కూడా అమెరికా అరెస్ట్ చేస్తుందా?'- ట్రంప్ సమాధానం ఏంటంటే?
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్‌తో ప్రపంచ రాజకీయాల్లో సంచలనం- పుతిన్‌పై కూడా ఇలాంటి చర్య తీసుకుంటారా అని ట్రంప్‌కు ప్రశ్న

Published : January 10, 2026 at 1:43 PM IST
Trump On Putin : వెనెజువెలా దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం ఆకస్మికంగా బంధించిన ఘటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ పరిణామం తర్వాత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కూడా అమెరికా ఇలాంటి సైనిక చర్య చేపడుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎన్నో ఏళ్లుగా పుతిన్‌తో మంచి పరిచయం!
ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన మీడియా సమావేశంలో యూఎస్ మీడియా ప్రతినిధులు కీలక ప్రశ్నలు సంధించారు. మదురో మాదిరిగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా భవిష్యత్తులో బంధించేందుకు అమెరికా సైనిక చర్యలకు దిగుతుందా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ, ఎన్నో ఏళ్లుగా తనకు పుతిన్‌తో మంచి పరిచయం, స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ఎనిమిది యుద్ధాలను ఆపేశా
అయితే ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం విషయంలో పుతిన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఈ యుద్ధం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా సైనికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ పరిస్థితి నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది" అని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి గుర్తు చేశారు.
ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూనే!
అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాత్రం ఇప్పటివరకు విజయం సాధించలేకపోతున్నానని చెప్పారు. "ఈ యుద్ధాన్ని ఆపడం చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ దీన్ని ముగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాను" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పుతిన్‌పై సైనిక చర్యలు చేపడతారా అనే ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
పుతిన్‌ను బంధించేందుకు లేదా రష్యాపై సైనిక చర్యలకు దిగే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దిశగా రష్యాపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థించిన విషయం తెలిసిందే.
పుతిన్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ ఇలా!
ఈ ఘటనపై స్పందించిన జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. "నియంతలను ఇలాగే ఎదుర్కోవడం సాధ్యమైతే, అలాంటి వారి విషయంలో ఏం చేయాలో అమెరికాకు బాగా తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలు పుతిన్‌ను ఉద్దేశించి చేసినవేనని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడుల పరంపరను కొనసాగిస్తున్న పుతిన్‌ను కూడా ట్రంప్ ఇదే తరహాలో హ్యాండిల్ చేయాలని ఆయన సూచించినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తి
ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో స్నేహం ఉందని చెబుతూనే, మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. అలాగే సైనిక చర్యలు కాకుండా, దౌత్య మార్గాల్లోనే రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురో అరెస్టు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపగా, పుతిన్‌పై కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా అనే ప్రశ్నలకు ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన సమాధానం స్పష్టతనిచ్చినట్లైంది. ఉక్రెయిన్త- రష్యా యుద్ధం ముగింపే తన లక్ష్యమని, అయితే దానికోసం సైనిక మార్గాన్ని ఎంచుకోనని ట్రంప్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టే చమురు కంపెనీలకు మేమే రక్షణ కల్పిస్తాం: ట్రంప్
ఇరాన్‌ను చావు దెబ్బకొడతాం- ప్రజలను చంపితే మా జోక్యం తప్పదు: ట్రంప్ వార్నింగ్

