ETV Bharat / international

అణ్వాయుధాల విషయంలో తగ్గేదేలే- అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్నంత వరకు తయారు చేస్తాం: ఇరాన్

అణ్వాయుధాల తయారీపై ఇరాన్ సైనిక కమాండర్ కీలక ప్రకటన- న్యూక్లియర్ వెపన్స్ తామూ తయారు చేస్తామని ఐఆర్‌జీసీ వెల్లడి- ప్రజల ఐక్యతతోనే తమ దేశానికి ముప్పు తప్పిందన్న ఇరాన్ అధ్యక్షుడు

Iran Pursuing Nuclear Weapons
Representative Image (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : August 6, 2026 at 7:22 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran on Nuclear Weapons : అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో అణ్వాయుధ తయారీ అంశం కీలకమైన వేళ 'ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (ఐఆర్‌జీసీ) సంచలన ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణు ఆయుధాలు ఉన్నంత కాలం తమ జాతీయ భద్రత కోసం తమ దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను కొనసాగిస్తుందని ఐఆర్‌జీసీ చీఫ్ అహ్మద్ వాహిదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా రాసుకొచ్చింది. ఇరాన్‌కు చెందిన అత్యున్నత రక్షణ అధికారి అణ్వాయుధాల తయారీపై ఈ స్థాయిలో బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారని పేర్కొంది.

"అమెరికా, ఇజ్రాయెల్ అణ్వాయుధాలను కలిగి ఉన్నంతవరకు, ఇరాన్ తన భవిష్యత్తు, జాతీయ భద్రతను కాపాడుకోవడానికి వాటిపై పనిచేస్తూనే ఉంటుంది. ఆ రెండు దేశాలు తమ అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో త్యజించి, నిరాయుధీకరణకు సిద్ధపడితే మాత్రమే ఇరాన్ కూడా అణు ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గుతుంది."
- ఐఆర్‌జీసీ చీఫ్ అహ్మద్ వహిదీ

అణు కార్యక్రమాలపై ఇరాన్ ప్రభుత్వం ఇది వరకు విద్యుత్ అవసరాల కోసమని చెబుతూ వచ్చింది. కానీ, అందుకు భిన్నంగా ఇరాన్ అణు బాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తోందని ఒక ఉన్నతాధికారి నేరుగా అంగీకరించడం ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ మీడియా రాసుకొచ్చింది.

అణ్వాయుధాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు: ట్రంప్
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో నెలకొన్న అణు వివాదం, ప్రాంతీయ ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు జరుగుతున్న చర్చలలో గణనీయమైన పురోగతి లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. లాస్ వేగాస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ అధికారులే స్వయంగా తమతో మాట్లాడేందుకు చర్చలకు వచ్చారని వెల్లడించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని కలిగి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇది ఒక అధికారిక ఒప్పందంగా మారుతుందని అని ఉద్ఘాటించారు.

ఇరాన్‌ను కూల్చేందుకు శత్రువుల కుట్ర- దేశాన్ని ఏకం చేసిన నూతన నాయకుడు: పెజెష్కియాన్
ఇరాన్‌ను దెబ్బతీసి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు శత్రువులు తీవ్రంగా ప్రయత్నించాయని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే నూతన సుప్రీమ్ లీడర్ మోజ్తబా ఖమేనీ సమర్థవంతమైన నాయకత్వంలో ఇరాన్ అత్యంత శక్తివంతంగా, ఐక్యంగా నిలబడిందని తెలిపారు. బాహ్య ఒత్తిళ్లు, యుద్ధ భయాలు ఉన్నప్పటికీ దేశం చెక్కుచెదరకుండా నిలబడిందన్నారు. బుధవారం జాతిని ఉద్దేశించి నిర్వహించిన టెలివిజన్ ప్రసంగంలో పెజెష్కియాన్ మాట్లాడారు. ఇరాన్‌ను బలహీనపరచడానికి శత్రువులు పన్నిన కుట్రలను, విధించిన ఆంక్షలను, రాజకీయ ఒత్తిళ్లను ఇరాన్ ప్రజల ఐక్యతే తిప్పికొట్టిందని ఆయన కొనియాడారు.

"శత్రువులు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చివేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. కానీ మన దేశ నూతన నాయకుడు ఇరాన్‌ను ఏకం చేసి, మరింత బలంగా నిలబెట్టారు. యుద్ధాలు, ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్‌కు కూడా 'సిరియా'కు పట్టిన గతినే పట్టించాలని శత్రువులు భావించారు. కానీ ఇరాన్ ప్రజల పట్టుదల, సైనిక శక్తి ఆ కుట్రలను పూర్తిగా తిప్పికొట్టింది.విదేశీ ముప్పులను ఎదుర్కోవడంలో ఇరాన్ ప్రజల మధ్య ఉన్న ఐక్యతే అతిపెద్ద బలం. ఇరాన్ సాధిస్తున్న స్వయం సమృద్ధిని, అభివృద్ధిని శత్రుదేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇదే సమయంలో, దివంగత ఇస్లామిక్ విప్లవ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ నివాళులర్పించిన ఆయన, గత ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలకు ఆయన ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు. నూతన నాయకత్వం కింద ఇరాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ స్థిరత్వం మరింత భద్రంగా ఉంటాయి."
- మసౌద్ పెజెష్కియాన్, ఇరాన్ అధ్యక్షుడు

48 గంటల్లో చర్చలపై స్పష్టత
ఇరాన్- అమెరికా ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చర్చలపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఆ చర్చల్లో వచ్చే ఫలితం అమెరికా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధి అంశంపై ఇరాన్- ఒమన్- అమెరికాల మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. మిగిలిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

అమెరికా, చైనా ట్రేడ్​​ వార్​- అగ్రరాజ్యానికి చెందిన ఆరు కంపెనీలను బ్లాక్​ చేసిన బీజింగ్​!

వాషింగ్టన్ ఎన్నికల్లో భారత సంతతి నేతల పోరు- ఎవరు గెలుస్తారో?