ETV Bharat / international

కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్

ఎబోలా వైరస్ కలకలం- ఈ వ్యాధి వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అధనోమ్- కాంగోలా ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోందని వెల్లడి

Director General of the World Health Organization (WHO) Tedros Adhanom
Director General of the World Health Organization (WHO) Tedros Adhanom (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2026 at 6:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

WHO Chief On Ebola Virus In Congo : ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ కీలక ప్రకటన చేశారు. కాంగోలా ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. కాంగోలో ఎబోలా వైరస్ ప్రమాద అంచనాను హై నుంచి వెరీ హైకు సవరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని అన్నారు.

కాంగోలో ఆందోళనకరంగా ఎబోలా వ్యాప్తి :టెడ్రోస్ అధనోమ్
ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్రువీకరించిన గణాంకాల కంటే ఈ మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. అక్కడ ఈ వ్యాధితో ఒకరు మరణించారని వెల్లడించారు. మరో రెండు కేసులు నిర్ధరణ అయ్యాయని స్పష్టం చేశారు.

చికిత్స కోసం జర్మనీకి
కాంగోలో పనిచేస్తున్న ఒక అమెరికన్ జాతీయుడికి ఎబోలా పాజిటివ్ అని తేలడంతో, అతడిని చికిత్స కోసం జర్మనీకి తరలించారని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ చెప్పారు. అలాగే అధిక ప్రమాదం ఉన్న కాంటాక్ట్‌గా గుర్తించిన మరో అమెరికన్‌ను చెక్ రిపబ్లిక్‌కు తరలించినట్లు సమాచారం అందిందని వివరించారు. నిరంతర పర్యవేక్షణ, టెస్టులు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని అన్నారు. కానీ హింస, అభద్రత సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటూరి ప్రావిన్స్‌కు, అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంత మంది డబ్ల్యూహెచ్‌ఓ సిబ్బందిని పంపినట్లు తెలిపారు.

ఎబోలా ఉద్ధృతి నేపథ్యంలో భారత్ అలర్ట్
ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. నిఘా, ఆస్పత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్‌ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. దక్షిణ సూడాన్‌తో సహా కాంగో, ఉగాండా సరిహద్దు దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

"ప్రస్తుత అంచనా ప్రకారం ఆఫ్రికా ప్రాంతం వెలుపల ఉన్న దేశాలకు ఎబోలా వైరస్ ముప్పు తక్కువగా ఉంది. అయినప్పటికి భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాలు ఆరోగ్య వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో తగిన సన్నద్ధత, ప్రతిస్పందన సామర్థ్యాలను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వైరస్ లక్షణాలతో వచ్చిన వారి ప్రయాణ చరిత్రపై నిఘా పెట్టాలి. జ్వరం, నీరసం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు వంటివి ఎబోలా వైరస్ లక్షణాలు. ఐసోలేషన్ సౌకర్యాలు, ప్రత్యేక అంబులెన్స్‌లు, శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పీపీఈ కిట్లు, లాజిస్టిక్స్, ప్రయోగశాలలు, క్రిటికల్ కేర్ సామర్థ్యాల లభ్యతను నిర్ధారించుకోవాలి. ఎబోలా అనుమానిత కేసుల నమూనాలను పరీక్షించడానికి పుణెలోని ఐసీఎంఆర్ జాతీయ వైరాలజీ సంస్థ పూర్తి సదుపాయాలతో ఉంది. రాష్ట్రాలు, యూటీలు ప్రస్తుతం ఉన్న సన్నద్ధతా ప్రణాళికలను తక్షణమే సమీక్షించుకోవాలి. అలాగే ఆందోళన కలిగించే ఏవైనా ప్రజారోగ్య సంఘటనలను సకాలంలో గుర్తించి, స్పందించడానికి తగిన యంత్రాంగాన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి" అని పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖలో తెలిపారు.

ట్విషా శర్మ మృతి కేసు​- కోర్టులో లొంగిపోయిన భర్త- రెండోసారి పోస్టుమార్టం చేయాలని కోర్టు ఆదేశం

రీ-నీట్​ 100 శాతం లోపరహితంగా నిర్వహించడమే మా ప్రభుత్వ లక్ష్యం: ధర్మేంద్ర ప్రధాన్