ETV Bharat / international

ప్రపంచ సైనిక వ్యయం పెరుగుతోంది- శాంతే ఉత్తమ మెడిసిన్​: WHO చీఫ్

పెరుగుతున్న సైనిక వ్యయంపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ కీలక కామెంట్స్- ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై మరింత ఖర్చు చేయాలని పిలుపు- ఘర్షణలు పెంచుకోవద్దని, శాంతే ఔషధమని వెల్లడి

Director-General of the World Health Organisation, Tedros Adhanom Ghebreyesus
Director-General of the World Health Organisation, Tedros Adhanom Ghebreyesus (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 10:42 AM IST

3 Min Read
Choose ETV Bharat

WHO Chief On Military Spending : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైనిక వ్యయం గురించి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య 2024లో రికార్డు స్థాయిలో సైనిక వ్యయం 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని అన్నారు. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై చేసే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని వెల్లడించారు. ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని, ఘర్షణలను పెంచవద్దని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శాంతే ఉత్తమ ఔషధమని పేర్కొన్నారు.

'ఆరోగ్య కార్యక్రమాలపై ఖర్చు తగ్గింది'
"కొనసాగుతున్న సంఘర్షణల మధ్య 2024లో ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2025లో కూడా ఇది మరింత పెరుగుతుందని అంచనా. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై చేసే ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఘర్షణలను పెంచడం కాదు. ప్రాణాలను కాపాడటంపై ఎక్కువ దృష్టి పెట్టడం. శాంతే అన్నింటికీ ఉత్తమ ఔషధం" అని ఎక్స్​లో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వీడియో పోస్ట్ చేశారు.

"సభ్య దేశాలు మాకు విస్తృతమైన లక్ష్యాన్ని అందించాయి. 150 దేశాలలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఒక సంస్థకు రెండు సంవత్సరాలకు 4.2 బిలియన్ డాలర్లు లేదా ఏడాదికి 2.1 బిలియన్ డాలర్లు అనేది పెద్ద లక్ష్యం కాదు. ఇది చాలా తక్కువ. 2.1 బిలియన్ డాలర్లు అనేది ఎనిమిది గంటల కాలంలో ప్రపంచదేశాల ఖర్చు చేసే సైనిక వ్యయంతో సమానం. 2.1 బిలియన్ యూఎస్ డాలర్లు అంటే ఒక స్టీల్ బాంబర్ విమానం ధర, పొగాకు పరిశ్రమ ఏటా చేసే ప్రకటనలు, ప్రచారం కోసం చేసే ఖర్చులో నాలుగో వంతుకు సమానం. మన ప్రపంచంలో నిజంగా విలువైన వాటిపై ఎవరో ధరల ట్యాగ్​లను మార్చినట్లు అనిపిస్తుంది. దేశాలు ఇతర దేశాల దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువ విధ్వంసం, నష్టాన్ని కలిగించే అదృశ్య శత్రువు (అనారోగ్యం) నుంచి తమను తాము రక్షించుకోవడానికి చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. "
- టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ట్రంప్ నిర్ణయం వేళ టెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్యలు
దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన 'డ్రీమ్ మిలిటరీ' నిర్మాణం కోసం భారీగా నిధులను వెచ్చించేందుకు రెడీ అయ్యారు. 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ సైనిక బడ్జెట్​ను 1.5 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.135 లక్షల కోట్లు ) పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, దీనిని ఏకంగా 50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ సైనిక వ్యయం 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలపై చేసే ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని అన్నారు.

66 ఇంటర్నేషనల్ సంస్థల నుంచి వైదొలిగిన అమెరికా
అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం మరో సంచనల ప్రకటన చేశారు. యూఎస్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాలు, కన్వెన్షన్ల నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ట్రంప్ ఓ మెమోరాండంపై సంతకం చేసినట్లు వైట్ హౌస్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం ప్రకారం మొత్తం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగనుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి (యూఎన్) చెందని 35 సంస్థలు, యూఎన్​కు చెందిన 31 విభాగాలు, సంస్థలున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ నివేదికతో పాటు క్యాబినెట్ సభ్యులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ సంస్థల్లో సభ్యత్వం కొనసాగించడం లేదా వాటికి మద్దతు ఇవ్వడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

అమెరికా వైదొలగిన సంస్థల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఉంది. కొవిడ్ వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల ఆ సంస్థ నుంచి వైదొలగాలని ట్రంప్ ఏడాది క్రితమే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆ నిర్ణయాల మెమోరాండంపై సంతకం చేశారు.

వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టే చమురు కంపెనీలకు మేమే రక్షణ కల్పిస్తాం: ట్రంప్

ఇరాన్​ను చావు దెబ్బకొడతాం- ప్రజలను చంపితే మా జోక్యం తప్పదు: ట్రంప్ వార్నింగ్​