ETV Bharat / international

'భయం గుప్పిట్లో బతుకుతున్నాం, త్వరగా భారత్‌కు తీసుకెళ్లండి'- మోదీకి ఇరాన్‌లోని భారతీయ విద్యార్థుల విన్నపాలు

ఇరాన్‌లో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థులు- పేలుళ్ల శబ్దాల నడుమ భయంభయంగా సోషల్ మీడియా సందేశాలు- తమ ప్రాణాలను కాపాడాలంటూ వేడుకోలు- భారత్‌లోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన

US ATTACK ON IRAN
US ATTACK ON IRAN (SOurce : AP)
author img

By ETV Bharat Telugu Team

Published : February 28, 2026 at 9:41 PM IST

4 Min Read
Choose ETV Bharat

Indian Students In Iran : 'భయం గుప్పిట్లో బతుకుతున్నాం, మమ్మల్ని త్వరగా భారత్‌కు తీసుకెళ్లండి' అని ప్రధాని మోదీని కోరుతూ ఇరాన్‌లోని భారత విద్యార్థులు సోషల్ మీడియా సందేశాలను పెట్టారు. ఇదే అంశంపై భారత ప్రధానికి భారతీయ విద్యార్థి సంఘాలు లేఖలు రాశాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయని పేర్కొన్నాయి. ఎటు చూసినా బాంబులు, మిస్సైళ్లు, డ్రోన్లు పేలిన శబ్దాలే వినిపిస్తున్నాయని, ఎలాగైనా తమను రక్షించి ఇరాన్‌ నుంచి ఇండియాకు తీసుకెళ్లాలని విన్నవించుకున్నాయి. ఈవిధంగా ప్రధాని మోదీని సాయం కోరుతూ విద్యార్థి సంఘాలు, ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులు రాసిన లేఖలు, సందేశాల్లోని కీలక వివరాలతో కథనమిది.

మమ్మల్ని త్వరగా ఇండియాకు తీసుకెళ్లండి
'ఇరాన్‌లో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో మేం ఊహించలేకపోతున్నాం. పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యే వరకు వెయిట్ చేయొద్దు. మమ్మల్ని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి ఇండియాకు తీసుకెళ్లమని కోరుతున్నాం. త్వరగా ఇరాన్ నుంచి బయటపడేందుకు మాకు సాయం చేయండి చాలు' అని టెహ్రాన్‌లో ఉంటున్న ఓ భారతీయ విద్యార్థిని వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ఆమె గొంతులో ఆందోళన, భయం, వణుకు స్పష్టంగా కనిపించాయి. ఆ విద్యార్థిని రికార్డు చేసిన వీడియోలో భారీ పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించాయి.

భయంభయంగా బతుకుతున్నాం కాపాడండి
'ఇరాన్‌లో మేం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని భయంభయంగా బతుకుతున్నాం. టెహ్రాన్‌లో చాలాచోట్ల బాంబుదాడులు జరిగాయి. ఉదయం నుంచీ ఆ ఎటాక్స్ కొనసాగుతున్నాయి. దీంతో మాకు భయమేస్తోంది. ఇరాన్ నుంచి వెళ్లిపొమ్మని గతంలోనే మాకు భారతీయ ఎంబసీ అడ్వైజరీ ఇచ్చింది. కానీ ఇక్కడి యూనివర్సిటీ వాళ్లు పరీక్షలు పూర్తయ్యాకే వెళ్లమని అంటున్నారు. అందువల్లే ఇరాన్‌లో ఉండిపోయాం. ఈ యుద్ధం ఆగినా, కొనసాగినా, ముందుగా మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లండి. ఇదే మేం భారత ప్రభుత్వాన్ని కోరుకునేది' అని పేర్కొంటూ ఇరాన్‌లోని ఉర్మియా యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మెహక్ హుస్సేన్ తెలిపారు.

భారతీయ విద్యార్థులను ఇరాన్ నుంచి తీసుకురావాలి
'యుద్ధ పరిస్థితులు ఉన్నందున ఇరాన్‌లోని యూనివర్సిటీలు ఇప్పుడు పరీక్షలను రద్దు చేశాయి. దయచేసి అక్కడున్న భారతీయ విద్యార్థులను త్వరగా ఇండియాకు తీసుకురావాలి. ఈ దిశగా ప్రధాని మోదీ చొరవచూపాలి' అని ఆలిండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మహ్మద్ మోమిన్ ఖాన్ కోరారు.

'మోదీజీ - భారతీయ విద్యార్థుల ప్రాణాలను కాపాడండి'
'దయచేసి ఇరాన్‌లోని భారతీయ విద్యార్థుల ప్రాణాలను కాపాడండి. అక్కడి నుంచి వాళ్లందరినీ సురక్షితంగా భారత్‌కు తీసుకురండి. ఇరాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడ మొబైల్ ఫోన్, కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఆపేశారు. రానున్న రోజుల్లో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అనిపిస్తోంది'

'దయచేసి ప్రధాని మోదీ స్పందించాలి. మానవతా సాయాన్ని అందించే విషయంలో యావత్ ప్రపంచంలో ప్రధాని మోదీకి ఖ్యాతి ఉంది. విదేశాల్లోని భారతీయుల ప్రాణాలను, గౌరవాన్ని, కెరీర్‌ను కాపాడటానికి అత్యధిక ప్రాధాన్యతను ప్రధాని మోదీ ఇవ్వాలి. ఇందుకోసం ఆయన చొరవ చూపాలని కోరుకుంటున్నాం' అని పేర్కొంటూ ప్రధాని మోదీకి జమ్మూకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్‌ఏ) నేషనల్ కన్వీనర్ నాసిర్ ఖుయెహామీ లేఖ రాశారు.

నా కూతురితో మాట్లాడటం అదే చివరిసారి
'నా కూతురు ఇరాన్‌లోనే చదువుతోంది. గత నెలలో ఇరాన్‌లో బాగా అల్లర్లు జరిగాయి. చాలామంది చనిపోయారు. దీంతో అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ ప్రకారం, నా బిడ్డ జనవరి నెలలోనే ఇండియాకు వచ్చింది. గతవారమే మళ్లీ ఇరాన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి నా కూతురితో మాట్లాడుదామంటే ఫోన్ కలవడం లేదు. అక్కడ మొబైల్ ఫోన్ సర్వీసులను తరచుగా బంద్ చేస్తున్నారట. నిన్ననే నా బిడ్డతో మాట్లాడాను. ఆమెతో మాట్లాడటం అదే చివరిసారి. ఇప్పుడు యుద్ధం మొదలైంది కదా. ఇరాన్‌కు ఫోన్ కాల్స్ కలవడం లేదు. చాలా టెన్షన్‌గా ఉంది. భయంగా ఉంది. భారత ప్రభుత్వం మా పిల్లలను కాపాడి ఇండియాకు తీసుకొస్తే రుణపడి ఉంటాం' అని జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌కు చెందిన ఓ విద్యార్థిని తండ్రి హైదర్ చెప్పుకొచ్చారు.

2వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు కశ్మీరీలే
ఇరాన్‌లో ఎంబీబీఎస్ చేస్తున్న భారతీయ విద్యార్థుల్లో దాదాపు 2వేల మందికిపైగా జమ్మూకశ్మీరు వాస్తవ్యులే. ఈ స్టూడెంట్స్‌కు మార్చి 5న ఉలూమ్ పాయా (కాంప్రెహెన్సివ్ బేసిక్ సైన్స్ ఎగ్జామినేషన్) ఉంది. భారతీయ పౌరులంతా ఇరాన్ విడిచి వెళ్లిపోవాలని ఫిబ్రవరి 23న టెహ్రాన్‌లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ ఎంబీబీఎస్ విద్యార్థులు మార్చి 5న జరగనున్న ఉలూమ్ పాయా పరీక్షను రాసేందుకే ఇరాన్‌లో ఆగిపోయారు.

ఈ పరీక్షను వాయిదా వేయాలని భారతీయ స్టూడెంట్స్ చేసిన విన్నపాన్ని యూనివర్సిటీ అధికార వర్గాలు తిరస్కరించాయి. ఈవిధంగా ఇరాన్‌లో ఇరుక్కుపోయిన తమ పిల్లలను కాపాడాలని భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కోరుతున్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో మొబైల్ ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి. దీంతో కనీసం తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకునే ఛాన్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు లేకుండాపోయింది.