ETV Bharat / international

వార్​ ఎఫెక్ట్ : హర్ముజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్- నిలిచిపోయిన 700కు పైగా నౌకలు

ఇరాన్ కీలక నిర్ణయం- హర్ముజ్​ జలసంధిని ఇరాన్ మూసివేత

Hormuz Strait Closed
Hormuz Strait Closed (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : March 3, 2026 at 1:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hormuz Strait Closed : పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయిన హర్ముజ్‌ జలసంధి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ మార్గం గుండా ఏ నౌకైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌, నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ హెచ్చరించింది. దీంతో సుమారు 700 ఆయిల్ ట్యాంకర్లు జలసంధికి ఇరువైపులా నిలిచిపోయాయి. అయితే తాజా చర్యలతో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు జలసంధిని ఇంతకు ముందు ఎప్పుడైనా మూసివేశారా? దీని వల్ల నిజంగానే ధరలు పెరుగుతాయా? అసలు ఈ జలసంధి ద్వారా ఏయే వస్తువులు రవాణా అవుతాయో ఈ స్టోరీ తెలుసుకుందా.

ప్రపంచ ఇంధన మార్కెట్‌కు భారీ దెబ్బ
హర్ముజ్‌​ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్​కు భారీ ఎదురుదెబ్బ. ఎందుకంటే ఈ జలసంధి ప్రపంచ మార్కెట్​కు కీలకమైనది. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇరుకైన ప్రదేశంలో ఇది సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంకు అనుసంధానమవుతున్నాయి.

హర్ముజ్‌ ప్రాధాన్యం ఏమిటి?
ఈ హర్ముజ్‌ జలసంధి ప్రపంచానికే కాదు ప్రాంతీయ వాణిజ్యానికి కూడా అత్యంత కీలకం. ఇది ప్రపంచంలో 10వ అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అయిన దుబాయ్​లోని జెబెల్ అలీ ఓడరేవుకు ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఈ పోర్ట్ ప్రాంతంలోని 12కు పైగా దేశాలకు పునఃపంపిణీ కేంద్రంగా పని చేస్తోంది. జెబెల్ అలీ పోర్టులో పెద్ద కంటైనర్ నౌకల నుంచి సరుకులను చిన్న నౌకలకు మార్చి, తూర్పు ఆఫ్రికా నుంచి భారత్ వరకు అనేక దేశాలకు పంపిస్తారని ఫ్రాన్స్​లో టీఎల్​ఎఫ్​ ఫ్రైటర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ యాన్ సోఫీ ఫ్రిబోర్గ్ తెలిపారు.

హర్ముజ్‌ జలసంధి ఎప్పుడైనా మూసివేశారా?
ఫ్రెంచ్ హై ఇన్‌స్టిట్యూట్ ఫర్ మారిటైమ్ ఎకానమీ డైరెక్టర్ పాల్ టూరెట్ ప్రకారం, హర్ముజ్‌ జలసంధిని ఇప్పటివరకు ఎప్పుడు పూర్తిగా మూసివేయలేదు. 1980 నుంచి 1988 వరకు జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో కూడా చమురు ట్యాంకర్లపై దాడులు జరిగాయి. అయినప్పటికీ వాణిజ్య రవాణా కొనసాగిందని ఆయన చెప్పారు. ఈ జలసంధి ద్వారా రవాణా చేసే వస్తువులపై ప్రస్తుతం విధించిన నిషేధం అనేది గతంలో ఎప్పుడూ లేనిదని నిపుణులు తెలిపారు.

ప్రధాన నౌకాశ్రయ సంస్థల అప్రమత్తత
శనివారం ఇజ్రాయెల్-అమెరికా కలిసి ఇరాన్​పై దాడులు ప్రారంభించిన తర్వాత ప్రపంచలోని అతిపెద్ద నౌకాశ్రయ సంస్థలు తమ నౌకలు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించాయి. ఇటాలియన్-స్విస్ సంస్థ ఎంఎస్​సీ, డెన్మార్క్‌కు చెందిన మెర్క్స్​, ఫ్రాన్స్‌కు చెందిన సీఎంఏ, సీజీఎం, జర్మనీకి చెందిన హపాక్ లాయిడ్, చైనాకు చెందిన కాస్కో సంస్థలు అప్రమత్తం చేశాయి. కువైట్ సమీపంలో, అలాగే దుబాయ్ తీరానికి సమీపంలో అనేక చమురు ట్యాంకర్లు నిలిపివేసినట్లు ప్రపంచ నౌకాశ్రయ కదలికలను పర్యవేక్షించే మెరైన్ ట్రాఫిక్ మ్యాప్‌లో కనిపిస్తున్నాయి. మరోవైపు, జలసంధి అవతల ఉన్న ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో ఇరాన్ వాణిజ్య నౌకాదళం కూడా కనిపిస్తోంది.

హర్ముజ్‌ మార్గం గుండా వెళ్లే ప్రధాన సరుకులు
జర్మనీ, ఈ జలసంధి ద్వారా కార్లు, యంత్రాలు, పారిశ్రామిక ఉత్పత్తులను రవాణా చేస్తుంది. ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు, సౌందర్య ఉత్పత్తులు, విలాస వస్తువులు, ఔషధాలను ఫ్రాన్స్ ఎగుమతి చేస్తుంది. ఆహార పదార్థాలు, భారీ పరిమాణంలో మార్బుల్ రాళ్లు, సిరామిక్ ఉత్పత్తులను ఇటలీ ఎగుమతి చేస్తోంది. అలాగే చమురు, ఎరువులు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారికి అవసరమైన ముడి పదార్థాలు రవాణా అవుతున్నాయి. ప్రపంచ ప్రాథమిక అల్యూమినియం ఉత్పత్తిలో పశ్చియాసియా సుమారు 9శాతం వాటాను కలిగి ఉంది. వీటిలో దాదాపు అన్నీ ఎగుమతి అవుతాయని టీడీ కమోడిటీస్ తెలిపింది.