ETV Bharat / international

ట్రంప్​ కీలక నిర్ణయం- భారత్ నేతృత్వంలోని సోలార్‌ అలయెన్స్‌ నుంచి US ఔట్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం- యూఎస్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాలు, కన్వెన్షన్ల నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటన

Trump
Trump (US)
author img

By ETV Bharat Telugu Team

Published : January 8, 2026 at 8:40 AM IST

2 Min Read
Choose ETV Bharat

US Withdraws From Organisations : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాలు, కన్వెన్షన్ల నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ట్రంప్ అధ్యక్ష ఉత్తర్వులకు సంబంధించిన మెమోరాండంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఈ నిర్ణయం ప్రకారం మొత్తం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకోనుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి (యూఎన్) చెందని 35 సంస్థలు, యూఎన్‌కు చెందిన 31 విభాగాలు, సంస్థలు ఉన్నాయి. అమెరికా విదేశాంగ శాఖ నివేదికతో పాటు క్యాబినెట్ సభ్యులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సంస్థల్లో సభ్యత్వం కొనసాగించడం లేదా వాటికి మద్దతు ఇవ్వడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.

నాన్-యూఎన్ సంస్థల నుంచి నిష్క్రమణ
యూఎన్‌కు చెందని సంస్థల్లో భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలో ఉన్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) కూడా ఉండటం గమనార్హం. పర్యావరణ పరిరక్షణకు కీలకంగా వ్యవహరించే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నుంచి కూడా అమెరికా వైదొలుగుతోంది. అదే విధంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరం, ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (IRENA), పార్ట్‌నర్‌షిప్ ఫర్ అట్లాంటిక్ కోఆపరేషన్, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఫోరం వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థలన్నీ అమెరికా విధానాలకు, ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా లేవన్నదే ట్రంప్ నిర్ణయానికి కారణంగా వైట్ హౌస్ స్పష్టం చేసింది.

యూఎన్ సంస్థలకూ గుడ్‌బై
యూఎన్‌కు చెందిన కీలక విభాగాల నుంచి కూడా అమెరికా తప్పుకుంటోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ లా కమిషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, పీస్‌బిల్డింగ్ కమిషన్, యూఎన్ ఎనర్జీ, యూఎన్ పాపులేషన్ ఫండ్ (UNFPA), యూఎన్ వాటర్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
యూఎన్ సంస్థల విషయంలో అమెరికా వైదొలగడం అంటే ఆయా సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం లేదా చట్టపరంగా అనుమతించిన మేరకు నిధుల సమకూర్పును నిలిపివేయడం అని అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలను వెంటనే అమలు చేయాలని అన్ని ఫెడరల్ విభాగాలు, ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు.

గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలే
ఇది ట్రంప్ పరిపాలనలో తీసుకున్న తొలి అంతర్జాతీయ ఉపసంహరణ నిర్ణయం కాదు. 2025 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి నిర్వహణలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందన్న కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది జూలైలో యునెస్కో (UNESCO) నుంచి కూడా అమెరికా బయటకు వచ్చింది. యునెస్కో కార్యకలాపాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుకూలంగా లేవని అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

ప్రపంచవ్యాప్తంగా చర్చలు
తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో అమెరికా పాత్ర తగ్గడం గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వర్గాలు చెబుతున్నాయి.

కొలంబియాపై మారిన ట్రంప్​ వైఖరి- చర్చలకు వైట్​హౌస్​కు ఆహ్వానం

ట్రంప్ డ్రీమ్ మిలటరీ- ఏకంగా రూ.135లక్షల కోట్లు కేటాయింపు