ETV Bharat / international

'నాకు చట్టాలు అవసరం లేదు- అలా చేస్తే తీవ్ర పరిణామాలు'- ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్​

నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ట్రంప్‌- అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ

Trump warns iran
Trump warns iran (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 9:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump Warns Iran : ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోన్న అల్లర్లపై మరోసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెహ్రాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు. ఆందోళనలు అణిచివేసేందుకు నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా తీవ్ర చర్యలు తీసుకుంటుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో ఆందోళనలు చెలరేగినప్పుడు ఆ దేశాధికారులు వాటిని అణగదొక్కాలనుకోవడం సాధారణమన్నారు. ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకొని, వారిని తీవ్రంగా దెబ్బతీస్తామని బెదిరించారు. ఈ క్రమంలోనే ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల కార్యకర్తలు వివరించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన డొనాల్డ్​ ట్రంప్‌, అవి నిరసనల సమయంలో తొక్కిసలాట వల్ల జరిగినవని పేర్కొన్నారు. దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేమని వెల్లడించారు. ఈ సందర్భంగా నిరసనకారులను దైర్యవంతులుగా ట్రంప్‌ అభివర్ణించారు.

'నేను అధికారంలో ఉన్నంత వరకు చైనా ఎలాంటి చర్యలకు దిగబోదు'
నాటో, గ్రీన్​ ల్యాండ్​ ఆంశాలపై స్పందించిన ట్రంప్​, తనకు అంతర్జాతీయ చట్టాలతో అవసరం లేదని స్పష్టం చేశారు. తైవాన్​ అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్​, తాను అధికారంలో ఉన్నంత వరకు చైనా ఎలాంటి చర్యలకు దిగబోదని క్లారిటీ ఇచ్చారు. అమెరికా గ్లోబల్ పవర్​గా అవతరించాలనే లక్ష్యానికి ఏదైనా హద్దులు ఉన్నాయని ప్రశ్నించగా, తమ మనసు మాత్రమే దానిని అడ్డుకోగలదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేవలం నా మనసు మాత్రమే నన్ను ఆపగలదు. నాకు ఎలాంటి అంతర్జాతీయ చట్టాలు అవసరంలేదు. నేను ఎవరినీ కుడా ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. తైవాన్​ అంశంపై చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ ఏం చేయబోతున్నారో ఆయనకే తెలుసు. కానీ, ఒకటి మాత్రం గట్టిగా చెప్పాను. తైవాన్​పై చర్యలకు పాల్పడితే నేను సంతోషించనను చెప్పాను. నాకు తెలిసి ఆయన అలాంటి పనులు చేయడు. ఒకవేళ అమెరికాకు మరో అధ్యక్షుడు వచ్చాక తైవాన్​పై నిర్ణయం తీసుకుంటారు. నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం జిన్​పింగ్ ఈ పని చేస్తారని నేను అనుకోవట్లేదు."

--డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అది తమ ఛాయిస్​ అంటూ ట్రంప్ హింట్
నాటో కూటమి రక్షణ లేదా గ్రీన్​ ల్యాండ్​ను స్వాధీనం చేసుకోవడం ఈ రెండింట్లో ఏది ప్రాధాన్య అంశమని ప్రశ్నించగా, అది తమ ఛాయిస్​ అని పరోక్షంగా చెప్పారు ట్రంప్​. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా గ్రీన్‌లాండ్ కొనుగోలు, వెనెజువెలా కొత్త ప్రభుత్వం, ఇరాన్‌‌లో భారీ నిరసనలపై వైట్‌‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్ విషయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ఐరోపా దేశాల నేతలకు ఆయన సలహా ఇచ్చారు. గ్రీన్‌లాండ్‌పై శత్రుదేశాలు ఆసక్తి చూపుతుండటం అమెరికాతో పాటు ప్రపంచ క్షిపణి రక్షణ వ్యవస్థకు ముప్పేనని అభిప్రాయపడ్డారు.

ఇరాన్​లో ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలు బంద్
ఆర్థిక సంక్షోభం వల్ల ఇరాన్​లో చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అనేకమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలతో నిరసనలు చేపట్టారు. ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి నిరసనలకు పిలుపునివ్వడంతో అవి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలను నిలిపివేస్తూ ఇరాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిరసనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్‌ను సీరియస్‌‌గా తీసుకోండి- వెనెజువెలా కొత్త సర్కారు మా మాట వినాలి: జేడీ వాన్స్

గ్రీన్‌‌లాండ్‌ను కొనేస్తామంటున్న అమెరికా- ఒప్పుకోకుంటే సైనిక చర్య? వచ్చే వారమే డెన్మార్క్‌‌కు రూబియో