ETV Bharat / international

వలసదారుల్లో తీవ్ర ఆందోళన- గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికా యూటర్న్

గ్రీన్‌కార్డ్ దరఖాస్తు విషయంలో వలసదారుల్లో నెలకొన్న గందరగోళం - ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని స్పష్టం చేసిన డీహెచ్ఎస్ ప్రతినిధి

US Green Card Rules 2026
US Green Card Rules 2026 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2026 at 12:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

US Green Card Rules 2026 : గ్రీన్‌కార్డ్ దరఖాస్తు విషయంలో వలసదారుల్లో నెలకొన్న గందరగోళానికి అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ-DHS తెరదించింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ప్రతిక DHS అధికారిని ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఇటీవల ఓ మెమో జారీ చేసింది. ఇది వలసదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ క్రమంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టతనిచ్చింది.

గ్రీన్‌కార్డు దరఖాస్తు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాలి!
అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ ఇటీవల జారీ చేసిన ఓ మెమో వలసదారుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. హెచ్1బీ, ఎల్1 లాంటి తాత్కాలిక వర్క్ వీసా ఉన్న అభ్యర్థులు గ్రీన్‌కార్డు దరఖాస్తు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇందుకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. గ్రీన్‌కార్డ్ పొందడం అనేది హక్కు కాదని, అది ఇమ్మిగ్రేషన్ అధికారుల విచక్షణాధికారమని మెమోలో పేర్కొంది. దీంతో అమెరికాలోని వలసదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ-DHS ఒక ప్రకటన విడుదల చేసింది. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి భారీ మార్పులు జరగలేదని డీహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు.

నిబంధన అందరికీ వర్తించదు!
ఇమ్మిగ్రేషన్ అధికారులకు మొదటి నుంచి ఉన్న అధికారాలను గుర్తుచేయడానికే ఆ మెమో జారీ చేశామని, ఇది అందరికీ వర్తించే నిబంధన కాదని వెల్లడించారు. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుడు, తన అప్లికేషన్ రివ్యూలో ఉన్నంత కాలం అమెరికాలోనే ఉండేందుకు యథాతథంగా అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు. అయితే, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు ఉన్న కేసుల్లో USCIS అదనపు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఇక, DHS ప్రకటనతో ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ సహా ఇతర మార్గాల ద్వారా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది భారతీయ నిపుణులకు ఊరట దక్కింది. 2024లో అమెరికా సుమారు 14 లక్షమ మందికి గ్రీన్‌కార్డులను మంజూరు చేసింది. వీరిలో దాదాపు 8 లక్షల 20 వేల మంది అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రక్రియ ద్వారా శాశ్వత నివాస హోదా పొందారు. అంటే అమెరికాలో ఉంటూనే శాశ్వత నివాస హోదా పొందారు.

యూఎస్‌సీఐఎస్‌ గతంలో విడుదల చేసిన మెమో ప్రకారం, తాత్కాలికంగా అమెరికాకు వచ్చిన వారు తమ అనుమతించిన గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్లాలని సంస్థ ప్రతినిధి జాక్‌ కహ్లర్‌ పేర్కొన్నారు. ఇకపై గ్రీన్‌కార్డ్‌ కావాలంటే స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతకాలం విద్యార్థి వీసా, ఉద్యోగ వీసా, టూరిస్టు వీసా వంటి నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసాలపై అమెరికాకు వెళ్లిన చాలా మంది అక్కడే ఉండి అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌ ద్వారా గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేసుకునేవారు. ఈ విధానం చట్టంలోని లోపాలను ఉపయోగించుకునే మార్గంగా మారుతోందని యూఎస్‌సీఐఎస్‌ భావిస్తోంది. కొందరు వ్యక్తులు వీసా గడువు ముగిసినా లేదా గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన- వైట్‌హౌస్​లో ఉన్నతస్థాయి సమావేశం

'ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదు'- డీల్​పై ట్రంప్ వ్యాఖ్యలు- మస్ట్ అంటే ఒప్పుకోమని టెహ్రాన్ కౌంటర్