ETV Bharat / international

'కాల్పుల విరమణనా లేదా యుద్ధమా?'- ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఇరాన్

లెబనాన్​ దాడులపై స్పందించిన ఇరాన్- అమెరికాకు అల్టిమేటం జారీ చేసిన ఇరాన్

Iran Warns US
Iranian Foreign Minister Abbas Araghchi (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : April 9, 2026 at 7:46 AM IST

3 Min Read
Choose ETV Bharat

Iran Warns US : లెబనాన్​ దాడులు విషయంలో అమెరికాకు ఇరాన్​ హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణను పాటించాలా లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కొనసాగించాలా అనే విషయంలో అమెరికా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఒకేసారి రెండు విధానాలు అనుసరించడం సాధ్యం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు.

లెబనాన్‌లో జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ, ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తున్నదని అరాగ్చీ అన్నారు. ఈ విషయంలో అమెరికా తన హామీలను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది కీలకమని పేర్కొన్నారు. కాల్పుల విరమణ కుదిరిన సందర్భంగా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన ట్వీట్​ రీపోస్ట్​ చేస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే పాక్ ప్రధాని చేసిన ట్వీట్​లో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్​ను కూడా చేర్చినట్లు ఉంది. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తోసిపుచ్చారు.

శాంతి ఒప్పందానికి అవరోధాలు : ఇరాన్ పార్లమెంట్ స్పీకర్
లెబనాన్​పై ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు పశ్చిమాసియాలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు ముప్పుగా మారాయని తెలిపారు. అమెరికా- ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఈ వారంలో ఇస్లామాబాద్​లో జరగనున్న చర్చల నుంచి వైదొలగుతామని కూడా హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు.

మూడు కీలక ఉల్లంఘనలు
సీజ్‌ఫైర్‌కు ఆధారమైన 10 పాయింట్ల ప్రతిపాదనలో మూడు కీలక అంశాలను ఉల్లంఘించారని ఘాలిబాఫ్ ఆరోపించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు కాలేదని, ఇరాన్ గగనతలంలో డ్రోన్ చొరబాటు జరిగిందని, యురేనియం శుద్ధి హక్కును తిరస్కరించారని తెలిపారు. దీంతో అమెరికాపై చారిత్రక అవిశ్వాసం మరోసారి నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు.

లెబనాన్​ సీజ్​ఫైర్​లో భాగం కాదు : వైట్​ హౌస్
అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్​ భాగం కాదని వైట్​హౌస్ స్పష్టం చేసింది. హెజ్​బొల్లాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలు ఒప్పందానికి విరుద్ధం కాదని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్​ భాగం కాదని ఈ విషయాన్ని అన్ని పక్షాలకు తెలిపినట్లు వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్పుల విరమణకు, అమెరికా ప్రయత్నాలకు మద్దుతగా ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. రానున్న రెండు వారాల పాటు తాము సహాయక భాగస్వామిగా కొనసాగుతామని అధ్యక్షుడికి నెతన్యాహు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడి
ఇరాన్ , అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దాడుల్లో 254 మందికిపైగా మృతిచెందారు. 1,165 మందికి పైగా గాయపడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో బీరూట్, దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీలోని 100కుపైగా లక్ష్యాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఆయాప్రాంతాల్లో అసలు హెజ్​బొల్లా స్థావరాలే లేవని లెబనాన్‌ ప్రభుత్వం పేర్కొంది

ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు
శుక్రవారం ఇస్లామాబాద్​లోలో అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా పాల్గొననున్నారు. ఇక ఇరాన్ తరఫున ఘాలిబాఫ్ నేతృత్వం వహించనున్నారు. రెండు వారాల కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, తాజా పరిణామాలు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు ఇస్తున్నాయి. చర్చలు సఫలమవుతాయా లేదా అనేది కీలకంగా మారింది.

హర్మూజ్ జలసంధి తెరవకపోతే ఒప్పందం రద్దే- ఇరాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక

సీజ్​ఫైర్ యుద్ధానికి చిన్న విరామం- మా వేలు ఇంకా ట్రిగ్గర్​పైనే ఉంది: ఇరాన్​కు నెతన్యాహు వార్నింగ్