ETV Bharat / international

'ఫ్రెండ్లీ ఫైర్'- మూడు అమెరికా యుద్ధవిమానాలను కూల్చిన కువైట్- పొరపాటున జరిగిందట!

కువైట్‌ ఎయిర్‌డిఫెన్స్‌ పొరపాటు కాల్పుల్లో మూడు అమెరికా ఫైటర్‌ జెట్లు కూల్చివేత- ఆరుగురు సిబ్బంది సురక్షితం- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఘటనపై ఆందోళన

US Fighter Jet Shot Down
Collage of images showing US military aircrafts crashing in Kuwait ((AFP))
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 5:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

US Fighter Jet Shot Down In Kuwait : కువైట్‌ గగనతలంలో అమెరికా యుద్ధవిమానాల ప్రమాదం కలకలం రేపింది. మిత్ర దేశాల మధ్య సమన్వయం లోపం వల్లే ఆ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలిసింది. సోమవారం ఉదయం మూడు అమెరికా ఫైటర్‌ జెట్లను కువైట్‌ వైమానిక రక్షణ దళాలు పొరపాటున కాల్చివేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. దీనిని ఫ్రెండ్లీ ఫైర్‌ ఘటనగా అభివర్ణించింది.

ఆరుగురు సిబ్బంది సేఫ్
ప్రమాదానికి గురైన మూడు ఎఫ్-15 యుద్ధ విమానాల్లో ఉన్న ఆరుగురు సిబ్బంది సమయానికి ఎజెక్ట్‌ కావడంతో ప్రాణాపాయం తప్పిందని అమెరికా సెంట్రల్ కమాండ్​ తెలిపింది. ప్రస్తుతం వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కువైట్‌ ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం పలు అమెరికా సైనిక విమానాలు కూలిపోయాయని కువైట్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. వెంటనే శోధన, రక్షణ చర్యలు చేపట్టి సిబ్బందిని ఆసుపత్రులకు తరలించామని తెలిపింది. అమెరికా బలగాలతో నేరుగా సమన్వయం చేసుకుని ఘటనకు గల కారణాలపై సంయుక్త దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ప్రజలు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.

యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి పొరపాట్లు!
ప్రాథమిక సమాచారం ప్రకారం, కువైట్‌ వైమానిక రక్షణ వ్యవస్థలో భాగమైన పాట్రైట్ క్షిపణి బ్యాటరీ ఈ విమానాలను శత్రువులుగా గుర్తించి కాల్చివేసినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ రక్షణ వ్యవస్థలు రాడార్‌, గుప్త సంకేతాల ఆధారంగా మిత్ర–శత్రు గుర్తింపులు చేస్తాయి. అయినప్పటికీ యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఒక యుద్ధవిమానం అగ్నికి ఆహుతై కిందపడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆ దృశ్యాలను కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ సమీప ప్రాంతంగా అంతర్జాతీయ మీడియో గుర్తించింది. సుమారు 10 కిలోమీటర్ల పరిధిలోనే విమానం కూలిపోయినట్టు అంచనా వేసింది. వీడియోలో కనిపించిన ట్విన్‌ ఇంజిన్‌ విమానం ఎఫ్-15ఈ లేదా ఎఫ్/ఏ-18 జెట్‌గా ఉండొచ్చని విశ్లేషకులు భావించారు. ప్రమాదంలో పడి కూలిన విమానం శకలాలు మినా అల్ అహ్మది రిఫైనరీలో పడటంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారని కువైట్ ఇంట్రీగేటెడ్ ప్రెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ వెల్లడించింది. అత్యవసర బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ తాజాగా టెహ్రాన్ లక్ష్యంగా వైమానిక దాడులు జరిపింది. లెబనాన్‌లో హెజ్ బొల్లా స్థావరాలపై కూడా దాడులు కొనసాగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బైరుట్ దక్షిణ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్టు సమాచారం. అదే సమయంలో ఇరాన్‌ సుప్రీం లీడర్​ ఖమేనీను చంపిన నేపథ్యంలో ప్రతీకార చర్యలు వేగం పుంజుకున్నాయి. ఇరాన్‌ నుంచి క్షిపణులు ప్రయోగిస్తున్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేం సహా పలు నగరాల్లో ఎయిర్‌రైడ్‌ సైరన్లు మోగాయి. కువైట్‌ కూడా తన గగనతలంలోకి చొరబడిన డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపింది.

ఇదే సమయంలో RAF అక్రోతిరీ స్థావరంపై అనుమానాస్పద డ్రోన్‌ దాడి జరిగినట్టు సమాచారం. ఈ స్థావరం సిప్రస్​లో ఉంది. అక్కడ స్వల్ప నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. ఏదేమైనా పశ్చిమాసియలాో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చుతున్న వేళ మిత్రదేశాల మధ్యే ఇలాంటి ఫ్రెండ్లీ ఫైర్‌ ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సాంకేతిక లోపమా? కమ్యూనికేషన్‌ సమస్యలా? లేక మానవ తప్పిదమా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

బీ-2 బాంబర్స్, సూసైడ్ డ్రోన్స్ - ఖమేనీని హతమార్చేందుకు అమెరికా ఇంకా ఆయుధాలు వాడిందంటే!

'ఇక అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు'- ఇరాన్ కీలక ప్రకటన