ETV Bharat / international

ఇరాన్​ నౌకల దిగ్బంధనం ప్రారంభించిన అమెరికా- మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్​

USS అబ్రహం లింకన్, USS రోనాల్డ్ రీగన్ అనే రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల మోహరింపు- ఇరాన్‌కు చెందిన 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ట్రంప్ వెల్లడి

us hormuz blockade
us hormuz blockade (AFP)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2026 at 10:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

US Hormuz Blockade : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌ ససేమిరా అంటుండగా ఆ దేశ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. ఇరాన్‌ ఓడరేవుల్లోకి ప్రవేశించే, అక్కడి నుంచి బయటకు వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. తమ ఓడరేవులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన ఇరాన్, తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఇప్పటికే తేల్చిచెప్పింది. అమెరికా చర్యలతో ఇరాన్‌ ప్రతిచర్యలు ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన తర్వాత హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే వ్యూహంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ కఠిన చర్యలకు దిగారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకోవాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించగా ఆ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దించింది. USS అబ్రహం లింకన్, USS రోనాల్డ్ రీగన్ అనే రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను మోహరించింది. ఈ రెండు యాంఫిబియస్ రెడీ గ్రూపుల్లో మొత్తం 20 యుద్ధనౌకలు, 200 పైగా విమానాలు ఉంటాయి. వాటిని ఇరాన్‌కు సమీపంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ అమర్చిన మైన్‌లను తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్‌కు వచ్చి వెళ్లే అన్ని నౌకలను అడ్డుకుంటామని చెప్పిన అమెరికా, ఏ దేశమైనా సరే అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఆహార, వైద్య సంబంధ నౌకలను మాత్రం తనిఖీల తర్వాత అనుమతిస్తామని తెలిపింది. దీంతో పాటు ఆంక్షలు విధించిన ఇరాన్ చమురును కొనుగోలు చేసే లేదా విక్రయించే ఎవరిపైనైనా తీవ్రంగా విచారణ జరుపుతామని అమెరికా హెచ్చరించింది.

ఇటువైపు వస్తే నాశనమే: ట్రంప్‌
మరోవైపు ఇరాన్‌కు చెందిన 158 నౌకలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. అవి ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్నాయని వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్న ఫాస్ట్‌ అటాక్‌ షిప్స్‌ను ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోలేదని, వాటిని పెద్ద ముప్పుగా భావించడం లేదన్నారు. ఒకవేళ ఆ నౌకలు అమెరికా విధించిన దిగ్బంధనం వైపు వస్తే మాత్రం వాటిని వెంటనే నాశనం చేస్తామంటూ హెచ్చరించారు. సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే డ్రగ్స్‌ను 98.2 శాతం వరకు నిలిపివేశామని ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. డ్రగ్ డీలర్లపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటామో, ఇరాన్ నౌకల విషయంలోనూ అదే విధానాన్ని పాటిస్తామని తేల్చి చెప్పారు.

వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం మేరకు హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరిచింది. కానీ అందులో ఒక మెలిక పెట్టింది. అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని సాకు చూపుతూ నౌకలను తన ప్రాదేశిక జలాలైన ఖేష్మ్, లారక్ ద్వీపాల మీదుగా వెళ్లాలని సూచించింది. దీనిని షిప్పింగ్ నిపుణులు 'టెహ్రాన్ టోల్ బూత్' అని పిలుస్తున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ డబ్బు వసూలు చేస్తోందని అనుమానిస్తున్నారు. ప్రపంచంలోని 20శాతం చమురు, గ్యాస్ హర్మూజ్‌ నుంచే సరఫరా అవుతోంది. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా సహా కొన్ని గల్ఫ్‌ దేశాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ జల మార్గంలో అమెరికా దిగ్బంధనం కారణంగా ఇరాన్ ల్యాంక్​డ్ దేశంగా మారిపోతుంది, దాని ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయి.

సముద్రంలోని ఏ దేశపు ఓడరేవూ సురక్షితంగా ఉండదు : ఇరాన్​
అంతకుముందు ట్రంప్‌ ఆదేశాలపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. తమ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఏ దేశపు ఓడరేవూ సురక్షితంగా ఉండదని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సాయుధ దళాల ఉమ్మడి కమాండ్ స్పష్టం చేసినట్లు ఇరాన్ అధికారిక బ్రాడ్‌క్యాస్టర్-IRIB వెల్లడించింది. తమ దేశ చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడం సాయుధ దళాల సహజమైన, చట్టపరమైన విధి అని పేర్కొంది. ఈ మేరకు తమ ప్రాదేశిక జలాల్లో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవడం దేశ ప్రజల సహజ హక్కు అని తేల్చిచెప్పింది. హర్మూజ్ జలసంధి భద్రతను ఇరాన్ పర్యవేక్షిస్తూనే ఉంటుందన్న సాయుధ దళాలు శత్రు నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే హక్కు లేదని తెలిపాయి. అయితే ఇరాన్ నిబంధనలకు లోబడి మాత్రమే ఇతర నౌకలను ఈ జలసంధి గుండా అనుమతిస్తామని పేర్కొన్నాయి. అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై నేరపూరిత అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య అని తేల్చిచెప్పాయి. ఇది సముద్రపు దొంగల చర్యతో సమానమని ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే అమెరికా దిగ్బంధనం ప్రారంభం కాగా, ఇరాన్‌ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.