ఇరాన్ ప్రతినిధులను హతమార్చేందుకు ఇజ్రాయెల్ స్కెచ్! చర్చల వేళ అమెరికాకు భయాలు
ఇజ్రాయెల్ హిట్‌లిస్టులో ఇరాన్ చర్చల ప్రతినిధులు- ఇద్దరు సీనియర్ ఇరాన్ ప్రతినిధులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా మీడియా కథనాలు

Published : July 3, 2026 at 11:24 AM IST
IRAN US WAR : అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష శాంతి చర్చలను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించిందా? ఇరాన్ చర్చల ప్రతినిధులను హతమార్చేందుకు కుట్ర పన్నిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల విరమణ చర్చల సమయంలో ఇద్దరు సీనియర్ ఇరాన్ ప్రతినిధులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారిని అప్రమత్తం చేసేందుకు ప్రాంతీయ దేశాల సాయం కూడా తీసుకున్నట్లు సమాచారం.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఓ కీలకాంశం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌లో వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ చర్చల సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్‌లను ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం రాసింది. ఆ ఇద్దరు నేతలపై దాడి జరిగితే శాంతి చర్చలు ఆగిపోయి మళ్లీ యుద్ధం తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అమెరికా భావించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల గురించి ఇరాన్‌ను అప్రమత్తం చేయాలని పశ్చిమాసియాకు చెందిన ఇతర దేశాలను వాషింగ్టన్ కోరినట్లు సమాచారం.
ఇరాన్ బృందానికి ఎస్కార్ట్‌గా వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు
యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంటు స్పీకర్ గాలిబాఫ్‌లను అమెరికా టార్గెట్ చేసింది. అయితే శాంతిచర్చలు మొదలైన తర్వాత వారిపై దాడి జరిగితే దౌత్య ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని భయపడింది. గాలిబాఫ్ పేరు ఇజ్రాయెల్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుసుకున్న ట్రంప్ యంత్రాంగం, ఆయనపై దాడి చేయొద్దని, నెతన్యాహును కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఏప్రిల్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌తో చర్చల కోసం ఇస్లామాబాద్‌లో వెళ్లిన గాలిబాఫ్ బృందానికి ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉందని ఇరాన్ ఆందోళన చెందింది. ఈ పర్యటనకు భద్రతా హామీ ఇవ్వాలని పాకిస్థాన్, ఖతార్‌ల ద్వారా అమెరికాను కోరింది. ఇరాన్ సరిహద్దు నుంచి ఇస్లామాబాద్‌కు వెళ్లే సమయంలో ఇరాన్ బృందం ప్రయాణించిన విమానానికి పాక్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వెళ్లాయి. అయితే తిరుగు ప్రయాణంలో రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రతా అధికారుల సూచన మేరకు విమానాన్ని మష్హాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి ఇరాన్ బృందం రోడ్డు మార్గంలో టెహ్రాన్ చేరుకుంది.
ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య మరో దఫా పరోక్ష చర్చలు ముగిశాయి. ఇందులో సమగ్ర శాంతి ఒప్పందం దిశగా పెద్దగా పురోగతి కనిపించలేదు. జులై 9న ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తదుపరి రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి చెందారు. అప్పటినుంచి ఆయన అంతక్రియలు జరగలేదు. ఈనెల 6 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. కాగా, ఖమేనీ అంతక్రియల్లో పాల్గొనాల్సిందిగా మోదీతో పాటు పలువురి భారతీయ నాయకులను ఇరాన్ కోరింది. కాగా, ఇప్పటికే భారత ప్రతినిధుల బృందం ఇరాన్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే, ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్, ఖమేనీ కుమారుడు మెజ్తబా ఖమేనీ తండ్రి అంతక్రియలకు హాజరు కావడం లేదని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉండటం వల్ల, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
'టారిఫ్ బెదిరింపులతోనే భారత్- పాక్ యుద్ధాన్ని ఆపా'- ట్రంప్ నోట మళ్లీ అదే మాట
ఖమేనీ అంతిమయాత్రకు ఇరాన్ సిద్ధం- ట్రెహాన్‌కు భౌతికకాయం తరలింపు- వీడ్కోలుకు మొజ్తబా దూరం

