అమెరికా ఆధీనంలో మరో చమురు నౌక
కరేబియన్ సముద్రంలో మరో చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా దళాలు!

Published : January 9, 2026 at 10:35 PM IST
US intercepts Venezuela Tanker : ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వెనెజువెలా చమురు వ్యవహారంలో అమెరికా మరింత కఠిన చర్యలు చేపడుతోంది. ట్రంప్ యంత్రాంగం వెనెజువెలా నుంచి చమురు తరలిస్తున్న నౌకలపై నిఘా పెంచి, అనుమతి పొందిన ట్యాంకర్‌లను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో కరేబియన్ సముద్రంలో మరో చమురు నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.
ఒలినా అనే చమురు ట్యాంకర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అమెరికా దళాలు అధికారికంగా ప్రకటించాయి. యూఎస్ మెరైన్ కార్ప్స్, నేవీ సహకారంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించాయి. నేర కార్యకలాపాలకు పాల్పడేవారికి ఎక్కడా సురక్షిత ఆశ్రయం లేదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది.
ఆ ఆపరేషన్ వివరాలను అమెరికా సైన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హెలికాప్టర్ల సాయంతో ప్రత్యేక బలగాలు చమురు నౌకపైకి దిగి, సమగ్రంగా సెర్చ్ నిర్వహించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. వీడియోలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్న సైనికులు ట్యాంకర్‌పైకి దిగడం, నౌకలోని విభాగాలను తనిఖీ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
అనుమానాస్పదంగా కనిపించే ట్యాంకర్‌లను!
ఇదిలా ఉండగా, వెనెజువెలా చమురు రంగంపై అమెరికా తన నియంత్రణ కొనసాగిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న అనంతరం వెనెజువెలా చమురు వనరులు తమ ఆధీనంలోనే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి అక్కడి నుంచి చమురు రవాణా చేస్తున్న నౌకలపై అమెరికా నిఘా పెంచింది. అనుమానాస్పదంగా కనిపించే ట్యాంకర్‌లను స్వాధీనం చేసుకుంటూ వస్తోంది.
రష్యా చమురు రవాణా
తాజాగా ఒలినా నౌకను సీజ్ చేయడం ద్వారా ఇది ఐదో చమురు నౌకగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నౌక చమురుతో వెనెజువెలా నుంచి బయలుదేరింది. గతంలో ఈ ట్యాంకర్‌కు మినర్వా ఎం అనే పేరు ఉండేదని, అప్పట్లో పనామా జెండాతో ప్రయాణించేదని పేర్కొన్నారు. అయితే తాజాగా ఇది తీమూర్- లెస్టే జెండాతో రష్యా చమురును రవాణా చేస్తోందని వెల్లడించారు.
హాంకాంగ్‌కు చెందిన ఒక కంపెనీతో!
నౌకకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాల్లోనూ అనేక అవకతవకలు ఉన్నట్లు అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్‌కు చెందిన ఒక కంపెనీతో నౌకను రిజిస్టర్ చేసినట్లు చూపించిన మేనేజర్ తప్పుడు వివరాలు అందించారని తెలిపారు. ఈ కారణాలతోనే నౌకను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
మొత్తం 28 మంది సిబ్బంది
ఇదే సమయంలో, అమెరికా సీజ్ చేసిన మరో చమురు ట్యాంకర్ మ్యారినెరా నౌకలో పని చేస్తున్న సిబ్బంది పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నౌకలో పనిచేస్తున్న ఇద్దరు రష్యన్ జాతీయులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించినట్లు సమాచారం. అయితే మిగిలిన సిబ్బంది భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యారినెరా నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కుటుంబాల్లో ఆందోళన
వారిలో ముగ్గురు భారతీయులు, 17 మంది ఉక్రేనియన్లు, ఆరుగురు జార్జియన్లు, ఇద్దరు రష్యన్లు ఉన్నారు. భారతీయ సిబ్బంది పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడం వారి కుటుంబాల్లో ఆందోళనకు దారి తీస్తోంది. మొత్తంగా వెనెజువెలా చమురు రవాణాపై అమెరికా చేపడుతున్న చర్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. మరోవైపు, ఈ పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక ఒరెష్నిక్ ప్రయోగం- యూరప్ మొత్తానికి పెనుముప్పు?

