రగులుతున్న పశ్చిమాసియా: అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు- కీలక స్థావరాలు ధ్వంసం
సౌదీ, బహ్రయిన్, జోర్డాన్‌లలోని తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ- స్వదేశానికి వచ్చేయాలని పిలుపు

Published : March 3, 2026 at 12:54 PM IST
Iran IRGC Command Destroyed : ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండ్ కంట్రోల్ సెంటర్లను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ సైన్యం, ఐఆర్‌జీసీలకు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఉదయం దాడులు చేశామని వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, మిస్సైళ్లు, డ్రోన్ల లాంచ్ ప్యాడ్లు, వైమానిక స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయని తెలిపింది. ఇరాన్ నుంచి తమకు పొంచి ఉన్న ముప్పును నివారించేందుకు ఈ దాడులను కొనసాగిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. బీ-1 బాంబర్ విమానాలతో ఇరాన్‌లోని బాలిస్టిక్ మిస్సైల్ తయారీ, నిల్వ యూనిట్లపైనా దాడులు చేశామని పేర్కొంది.
బహ్రయిన్‌లోని అమెరికా స్థావరాన్ని పేల్చేసిన ఇరాన్
బహ్రయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ మరోసారి భీకర దాడులు చేసిందంటూ ఖతర్ మీడియా సంస్థ అల్ జజీరా సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున బహ్రయిన్ దేశంలోని అమెరికా వైమానిక స్థావరానికి (షేక్ ఈసా బేస్) చెందిన ప్రధానమైన కమాండ్ కంట్రోల్ భవనాన్ని పేల్చేశామని ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రకటించింది. 20 డ్రోన్లు, 3 మిస్సైళ్లతో షేక్ ఈసా బేస్‌పై దాడి చేశామని తెలిపింది. సముద్ర జలాల్లో పలు ముడి చమురు ట్యాంకర్లకూ నిప్పు పెట్టామని ఐఆర్‌జీసీ పేర్కొంది. అమెరికా - ఇజ్రాయెల్ దాడులు కొనసాగినన్ని నాళ్లు, ఇరాన్ బలంగా ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యిద్ ఇరావని తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్ వైమానిక స్థావరంపై హిజ్బుల్లా దాడి
మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లు డ్రోన్లతో ఎటాక్స్ చేశారు. పెద్దసంఖ్యలో డ్రోన్లు ఈ వైమానిక స్థావరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లపై పడ్డాయంటూ అల్ జజీరా కథనాన్ని ప్రచురించింది. సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా, హిజ్బుల్లా ఈ ఎటాక్స్ చేసిందని పేర్కొంది. తాజాగా మంగళవారం (మార్చి 3) తెల్లవారుజామున బీరుట్ నగరంలోని హిజ్బుల్లా అనుబంధ టీవీ ఛానల్ అల్ మనార్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఆ టీవీ ఛానల్ భవనం తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ ఈ ఎటాక్ జరిగిన కొన్ని నిమిషాలకే, ఆ ఛానల్ మళ్లీ ప్రసారాలను మొదలుపెట్టడం గమనార్హం. మార్చి 2న అర్ధరాత్రి లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడిలో హిజ్బుల్లా నిఘా విభాగం అధిపతి హుసేన్ మాక్లెద్ హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆ వెంటనే లెబనాన్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో ఇక హిజ్బుల్లా సైనిక కార్యకలాపాలను నిషేధిస్తామని వెల్లడించింది.
సౌదీ, బహ్రయిన్, జోర్డాన్‌లలో అమెరికా అడ్వైజరీలు
సైనిక ఘర్షణ తీవ్రరూపు దాలుస్తున్న వేళ సౌదీ అరేబియా, బహ్రయిన్, జోర్డాన్‌లలో అమెరికా ముఖ్యమైన అడ్వైజరీలను జారీ చేసింది. బహ్రయిన్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాల్లో ఉన్న నాన్ - ఎమర్జెన్సీ విభాగాల సిబ్బంది, వారి కుటుంబాలు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. వారి భద్రతకు ముప్పు ఉన్నందునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. యావత్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అమెరికన్లు కూడా స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. అమెరికా ఎంబసీలపైనా ఇరాన్ దాడులు చేస్తున్నందున, కొంతకాలం పాటు ఎంబసీకి రావొద్దని అమెరికా పౌరులకు సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీ సూచించింది. అమెరికా పౌరులకు ఇటీవలే తాము ఇచ్చిన అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేశామని తెలిపింది. మంగళవారం రోజు సౌదీలోని అమెరికా ఎంబసీపై దాడి జరిగిన విషయాన్ని ధ్రువీకరించింది. తమ దేశంలోని అమెరికా ఎంబసీపై రెండు డ్రోన్లు పడ్డాయని సౌదీ అరేబియా రక్షణశాఖ సైతం వెల్లడించింది.
ట్రాఫిక్ కెమెరాలే 'ఖమేనీ' ఆచూకీ తెలిపాయ్- ఒక్క రోజు నిఘా కాదు- కొన్నేళ్లుగా మాటువేసి!
ప్రపంచ భద్రతకు ఇరాన్‌పై దాడులు అవసరం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

