అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం- కువైట్‌లో కూలిన ఎఫ్-15, యూఎస్ ఎంబసీపై ఎటాక్
ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణుల దాడి- కువైట్‌లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా మిస్సైల్స్ ప్రయోగించిన ఇరాన్

Published : March 2, 2026 at 1:45 PM IST
Iran Attack On Kuwait : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్- అమెరికా సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మృతిచెందిన నేపథ్యంలో ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలపై వరుస దాడులు జరుపుతోంది. తమ సుప్రీం లీడర్‌పై దాడికి ప్రతీకారంగా టెహ్రాన్ డ్రోన్‌లు, క్షిపణులతో వరుస దాడులు ప్రారంభించడంతో గల్ఫ్ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది.
కువైట్‌లో కలకలం
కువైట్ రాజధానిలోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. భారీగా పొగ కమ్ముకోవడంతో అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. భద్రతా దళాలు ప్రాంతాన్ని ఖాళీ చేయించాయి. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో కువైట్ గగనతలంలో ఓ అమెరికా యుద్ధ విమానం కూలిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మంటల్లో చిక్కుకున్న జెట్ నేలకొరిగినా, ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది.
అది F-15నా, F/A-18నా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. కొన్ని కథనాలు ఆ ఫైటర్ జెట్‌ను F-15గా పేర్కొనగా, మరికొన్ని F/A-18 కావొచ్చని చెప్తున్నాయి. ఈ రెండింటినీ తయారుచేసింది అమెరికానే. ఈ ఘటనపై కువైట్ రక్షణశాఖ ప్రకటన చేస్తూ, పలు యూఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి, వాటిల్లో ఉన్న సిబ్బందిని రక్షించామని పేర్కొంది. అయితే అవి కూలడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
గల్ఫ్ నగరాల్లో పేలుళ్లు
ఇరాన్ డ్రోన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో అప్రమత్తత పెరిగింది. దుబాయ్, దోహా, అబుదాబి ప్రాంతాల్లో ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మనామాలో కూడా డ్రోన్ ముప్పు నమోదైంది. ఇరాక్‌లోని ఒక ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు డ్రోన్‌లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. మరోవైపు సైప్రస్లో ఉన్న బ్రిటన్ నౌకాదళ స్థావరంపై కూడా దాడి జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే స్వల్ప నష్టంతో తప్పించుకున్నట్లు సమాచారం.
సౌదీ చమురు కేంద్రంపై డ్రోన్ దాడి
ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా సౌదీ ఆరామ్కోకు చెందిన రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రాస్ తనురాలోని ఆ భారీ చమురు శుద్ధి కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఆకాశంలో దట్టమైన పొగ ఎగసిపడింది. సౌదీ అరేబియా రక్షణశాఖ ప్రకారం, ఎక్కువ డ్రోన్‌లను గగనతలంలోనే కూల్చివేశామని, అయితే శకలాలు పడటంతో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపింది. రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.
చమురు ధరలకు షాక్
యుద్ధ ప్రభావం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. చమురు రవాణాకు కీలకమైన స్ట్రయిట్ హర్మూజ్‌లో నౌకా రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బ్యారెల్ ధర 80 డాలర్లను దాటింది. తాజా దాడులతో ఇది మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారత్ సహా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఆందోళనలు పెరిగాయి. రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లక్ష్యంగా అమెరికా స్థావరాలు
పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. డ్రోన్‌లు, క్షిపణులతో వరుస దాడులు చేస్తూ ఒత్తిడి పెంచుతోంది. టెహ్రాన్ తన చర్యలు ప్రతీకారమని ప్రకటించింది. మొత్తంగా మూడో రోజుకీ ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒకవైపు ఇరాన్ ప్రతీకార దాడులు, మరోవైపు ఇజ్రాయెల్– అమెరికా ప్రతిస్పందనలతో పశ్చిమాసియా ప్రాంతం యుద్ధ వాతావరణంలోకి జారుతోంది. పరిస్థితి ఎటు దారితీస్తుందన్న దానిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై పరిణామాలు ఎలా మారతాయన్నదే కీలకం. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా హెచ్చరికలు కొనసాగుతుండగా, అంతర్జాతీయ సమాజం ఉద్రిక్తతలు తగ్గాలని పిలుపునిస్తోంది.
బీ-2 బాంబర్స్, సూసైడ్ డ్రోన్స్ - ఖమేనీని హతమార్చేందుకు అమెరికా ఇంకా ఆయుధాలు వాడిందంటే!

