ఇరాన్‌కు అమెరికా డెడ్లీ వార్నింగ్- రేపు పుతిన్‌తో ఇరాన్ చర్చలు
రేపు పుతిన్‌తో చర్చలు జరుపుతామన్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరగ్చీ- ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడామని వెల్లడి

Published : March 2, 2026 at 7:13 PM IST
Iranian Foreign Minister Talks With Putin : పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్‌కు తాజాాగా యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికన్లను చంపితే, తాము కూడా చంపితీరుతామని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికన్లను చంపితే ఏం జరుగుతుందో ప్రపంచానికి చాటి చెప్పామని పేర్కొన్నారు.
"యుద్ధాన్ని మేము మొదలు పెట్టలేదు. కానీ దాన్ని మేమే ముగిస్తాం. గత 47 ఏళ్లుగా చేస్తున్న తప్పులకు ఇప్పుడు ఇరాన్ మూల్యం చెల్లించుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్ప యోధుడు. ఆయన యూఎస్‌ను అగ్రస్థానంలో ఉంచుతారు. ఇరాన్ లాంటి ధూర్త దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. వాస్తవానికి ఇరాన్‌పై దాడి చేయాలంటే చాలా ధైర్యం కావాలని ఎంతో మంది చెప్పారు. గతం ఒబామాను టెహ్రాన్ భయపెట్టింది. అమెరికాకు మరణం అని నినాదాలు చేసింది. కానీ ఇప్పుడున్నది ట్రంప్. ఆయనకు అపారమైన ధైర్యం ఉంది కాబట్టే ఇరాన్‌పై దాడి చేశారు. ఇప్పటికే ఇరాన్‌ను భద్రతాపరంగా అన్ని విధాలా దెబ్బతీశాం. ఈ అవకాశాన్ని ఆ దేశ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ట్రంప్ తన పని తాను చేశారు. ఇక మిగిలింది ఇరాన్ ప్రజల వంతు."
- పీట్ హెగ్సెత్, అమెరికా రక్షణ మంత్రి
ఇరాన్ నిజస్వరూపం ఇదే!
'ఇరాన్ పశ్చిమాసియా అంతటా ప్రతీకార దాడులు చేస్తోంది. విమానాశ్రయాలు, హోటళ్లు, భవనాలను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా పొరుగు దేశాల్లోని సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది' అని పీట్ హెగ్సెత్ అన్నారు.
ఇరాన్ అణుస్థావరాలను పూర్తిగా దెబ్బతీశాం!
'ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమాన్ని ఆపేయాలని మేము హెచ్చరించాం. కానీ మా ప్రతిపాదనను అహంకారంతో ఇరాన్ తిరస్కరించింది. పైగా మరింత రెచ్చగొడుతూ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తామని చెప్పాంది. అందుకే దాన్ని శిక్షించాలని నిర్ణయించాం. గతేడాది జూన్‌లో ఇరాన్ అణుస్థావరాలను పూర్తిగా దెబ్బతీశాం' అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు.
పుతిన్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలు!
అమెరికా, ఇజ్రాయెల్‌లో యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ఇరాన్ విదేశాంగ మంత్రి అగర్చీ కీలక ప్రకటన చేశారు. మంగళవారం తాను మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అవుతానని చెప్పారు. ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడానని అన్నారు. ఇజ్రాయెల్, అమెరికాలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమైన చర్యలు చేపడుతున్నాయని ఆరోపించారు. తమ దేశ సార్వభౌమత్యాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికే తాము ప్రతిదాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

