ETV Bharat / international

సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా రివెంజ్​- ఎక్కడున్నా వదిలిపెట్టమని ట్రంప్ వార్నింగ్

ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్​లో భాగంగా 35కి పైగా లక్ష్యాలు ధ్వంసం- 90కి పైగా ప్రెసిషన్ మునిషన్ల వినియోగం- ట్రంప్ హెచ్చరికలు

Us Attack On Syria ISIS
Us Attack On Syria ISIS ((Photo/ X@CENTCOM))
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 7:25 AM IST

3 Min Read
Choose ETV Bharat

US Attack On Syria ISIS : సిరియాలోని ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS)పై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆధ్వర్యంలో, భాగస్వామ్య దేశాల దళాలతో కలిసి నిర్వహించిన ఈ భారీ దాడులకు ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్ అని పేరు పెట్టారు. గత నెలలో ఐసిస్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక అమెరికా పౌరుడు మృతి చెందడంతో ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సిరియా వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఐసిస్‌కు చెందిన ఆయుధ నిల్వలు, కమాండ్ కేంద్రాలు, శిక్షణా శిబిరాలు, దాచుకున్న స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని స్పష్టం చేసింది.

ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేస్తాం: సెంట్కామ్
ఈ దాడులపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్పందించిన సెంట్కామ్, "అమెరికా సైనికులు, మా భాగస్వామ్య దళాలపై దాడులు చేయాలనుకునే ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడమే మా లక్ష్యం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అడ్డుకోవడం కోసం మేము నిరంతరం చర్యలు తీసుకుంటాం" అని పేర్కొంది. "మా వార్‌ఫైటర్లకు హాని తలపెట్టిన వారిని ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా గుర్తించి అంతమొందిస్తాం. న్యాయాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు" అని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

ట్రంప్ ఆదేశాలతో ఆపరేషన్ ప్రారంభం
సెంట్కామ్ తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 19, 2025న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్ ప్రారంభమైంది. 2025 డిసెంబర్ 13న సిరియాలోని చారిత్రక నగరం పల్మైరా (Palmyra) ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు అమెరికా, సిరియా దళాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక అమెరికా పౌర అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.

మృతి చెందిన సైనికుల వివరాలు
సీఎన్‌ఎన్ కథనం ప్రకారం, ఈ దాడిలో మృతి చెందిన అమెరికా సైనికులను సార్జెంట్ ఎడ్గర్ బ్రియన్ టోరెస్–టోవర్ (25) – డెస్ మోయిన్స్, ఐవా సార్జెంట్ విలియం నాథనియల్ హోవర్డ్ (29) – మార్షల్‌టౌన్, ఐవాగా గుర్తించారు. ఇద్దరూ ఐవా నేషనల్ గార్డ్కు చెందిన సైనికులు. మృతి చెందిన పౌర అనువాదకుడిని అయాద్ మంసూర్ సకాత్గా గుర్తించారు. ఈ ఘటనలో అమెరికా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

భారీ స్థాయిలో దాడులు
అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం నిర్వహించిన ఈ దాడుల్లో 90కి పైగా ప్రెసిషన్ మునిషన్లు, 35కి పైగా ఐసిస్ స్థావరాలు, రెండు డజన్లకు పైగా యుద్ధ విమానాలు వినియోగించారు. భూమిపై ఉన్న ఐసిస్ మౌలిక వసతులను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగినట్లు తెలిపారు. ఉగ్రవాదులు తిరిగి సంఘటితమయ్యే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

గతంలోనూ పెద్ద ఎత్తున దాడులు
ఇదే ఆపరేషన్‌లో భాగంగా డిసెంబర్ 19న కూడా అమెరికా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఆ సమయంలో సిరియా మధ్యభాగంలో ఉన్న 70 ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా, అనేక ఆయుధ గోదాములు, శిబిరాలు ధ్వంసమైనట్లు సెంట్కామ్ ప్రకటించింది.

ఆపరేషన్ ఇన్‌హెరెంట్ రిజాల్వ్‌లో భాగం
ఈ దాడులు అమెరికా చేపడుతున్న ఆపరేషన్ ఇన్‌హెరెంట్ రిజాల్వ్​లో భాగంగా కొనసాగుతున్నాయి. ఐసిస్‌ను పూర్తిగా ఓడించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ క్రమంలోనే అమెరికా ఈ ఏడాది ఆరంభంలో సుమారు 1,800 మంది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపినట్లు సమాచారం.

ట్రంప్ కఠిన హెచ్చరిక
ఈ దాడులపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, "అమెరికా సైనికులకు హాని తలపెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. వారు ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా న్యాయం నుంచి తప్పించుకోలేరు" అని స్పష్టంగా హెచ్చరించారు.