ETV Bharat / international

బ్రిటన్ కేబినెట్​లో భారతీయుడు- తొలి AI మంత్రిగా కనిష్క నారాయణ్

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్‌ను ప్రకటించిన ఆండీ బర్నమ్- భారత సంతతి క‌నిష్క నారాయణ్‌కు కీలక పదవి- లీసా నాండీకి అదనపు బాధ్యతలు

Britain AI Minister
Kanishka Narayan (X@AshwiniVaishnaw)
author img

By ETV Bharat Telugu Team

Published : July 21, 2026 at 4:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Indians In Britain Cabinet : బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే తన కొత్త కేబినెట్‌ను ప్రకటించారు. కింగ్ చార్ల్స్ ఆహ్వానం మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బర్న్‌హామ్, మాజీ ప్రధాని కీర్ స్టార్‌మర్ ప్రభుత్వంలో ఉన్న పలువురు కీలక మంత్రులను తప్పిస్తూ కొత్త బృందాన్ని ఖరారు చేశారు. అందులో భారత్​ సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ హోదాతో కూడిన కృత్రిమ మేధ (AI) మంత్రిగా కనిష్క నాారాయణ్​కు పదోన్నతి కల్పించారు.

స్టార్మర్ ప్రభుత్వంలో జూనియర్ ఏఐ మంత్రిగా పనిచేశారు. ఆన్‌లైన్ భద్రత, కృత్రిమ మేధ విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఇప్పుడు పూర్తి స్థాయి కేబినెట్ ఏఐ మంత్రిగా హోదా లభించింది. విధానాల రూపకల్పనలో ఏఐకి మరింత కీలకపాత్ర ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ఆయన ఏఐ శాఖతో పాటు కేబినెట్ కార్యాలయం, వ్యాపారం, ఆవిష్కరణలు, విజ్ఞానం, వాణిజ్య శాఖల పరిధిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

స్పందించిన నారాయణ్
తనకు ఏఐ మంత్రిగా పదవి దక్కడంపై కనిష్క నారాయణ్ స్పందించారు. కృత్రిమ మేధ మానవ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞానంగా మారబోతోందని అన్నారు. దీని ద్వారా బ్రిటన్ పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వస్తుందని, జాతీయ భద్రత బలోపేతం కావడంతో పాటు ప్రజా సేవల్లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలపై ప్రభావం, వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలపై ప్రజల్లో ఉన్న ఆందోళనలు కూడా సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయని, ఏఐ అభివృద్ధిని తామే నిర్దేశిస్తాయా లేదా దానికి అనుగుణంగా మారాల్సి వస్తుందా అన్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

బిహార్ నుంచి బ్రిటన్​ మంత్రి వరకు
36 ఏళ్ల కనిష్క నారాయణ్ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే కుటుంబంతో కలిసి వేల్స్ రాజధాని కార్డిఫ్‌కు వెళ్లారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించిన ఆయన ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ప్రైవేట్ రంగంలో పనిచేసిన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2024 సాధారణ ఎన్నికల్లో వేల్స్‌లోని వేల్ ఆఫ్ గ్లామోర్గన్ నియోజకవర్గం నుంచి గెలిచి, ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన తొలి భారతీయ మూలాల ఎంపీగా గుర్తింపు పొందారు. భారత్-బ్రిటన్ సంబంధాల బలోపేతానికి ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతున్న ఆయన, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే విశ్వాసాన్ని ఇటీవల కూడా వ్యక్తం చేశారు.

భారతీయ మూలాలున్న మరో మహిళకు కీలక బాధ్యతలు
భారతీయ మూలాలున్న మరో ప్రముఖ నేత లిసా నాండీ కూడా తన మంత్రివర్గ స్థానాన్ని కొనసాగించడంతో పాటు అదనపు బాధ్యతలు పొందారు. డిజిటల్ సేవలు, సంస్కృతి, మీడియా, క్రీడల శాఖల కార్యదర్శిగా ఆమె కొనసాగనున్నారు. కోల్‌కతాలో జన్మించిన విద్యావేత్త దీపక్ నాండీ కుమార్తె లిసా నాండీ. తల్లి బ్రిటిష్ జాతీయురాలు. 2010 నుంచి విగాన్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆండీ బర్న్‌హామ్‌కు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. లేబర్ పార్టీ సంస్కరణల విషయంలో బర్నమ్ వేగంగా, ధైర్యంగా ముందుకు సాగుతారని ఆమె ఇటీవల పేర్కొన్నారు. అలాగే దక్షిణాసియా మూలాలు కలిగిన షబానా మహ్మూద్ హోంమంత్రిగా కొనసాగుతున్నారు. భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) అమల్లో కీలక పాత్ర పోషించిన జోనాథన్ రేనాల్డ్స్ కూడా వ్యాపార, పరిశ్రమ, శాస్త్ర సాంకేతిక శాఖ బాధ్యతలను కొనసాగించనున్నారు.

'భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేద్దాం'- బ్రిటన్ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

బుధవారం నుంచే భారత్​- యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు- దేశీయ మార్కెట్లకు, ఐటీ రంగానికి కొత్త ఊపు