ETV Bharat / international

'లెబనాన్‌'పై పాక్, అమెరికా చెరో మాట- గందరగోళంగా యూఎస్-ఇరాన్ సీజ్​ఫైర్ డీల్- ఇస్లామాబాద్​ను నమ్మలేమంటున్న ఇజ్రాయెల్

ఇరాన్‌తో డీల్‌లో లెబనాన్ ఉందంటున్న పాక్, లేదంటున్న ట్రంప్- లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్- ఇదే పరిస్థితి కొనసాగితే డీల్ నిలువదని ఇరాన్ హెచ్చరిక- కాల్పుల విరమణకు అంతరాయం కలిగే ముప్పు

Iran US Cease Fire Deal
Iran US Cease Fire Deal (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : April 9, 2026 at 12:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Iran US Cease Fire Deal : అమెరికా - ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒప్పందం రెండు వారాల పాటు కొనసాగుతుందా ? కొనసాగదా ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. లెబనాన్ ఈ ఒప్పందంలో భాగంగా ఉందని మధ్యవర్తిత్వ దేశం పాకిస్థాన్ ప్రకటించింది. కానీ అదేం లేదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు.

ఇలా రెండు రకాల ప్రకటన నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించడం కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగిస్తుందని ఇరాన్ అంటోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే ఈ ఒప్పందం కుప్పకూలుతుందని, హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు మళ్లీ మొదలవుతాయని హెచ్చరిస్తోంది.

కాల్పుల విరమణకు అంతరాయం కలిగే ముప్పు : పాక్
అమెరికా - ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ ఉన్నప్పటికీ, ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి రిజ్వాన్ సయీద్ షేక్ అన్నారు. శాంతి చర్చల్లో లెబనాన్ కూడా భాగంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే పాక్ ప్రధాని కూడా ప్రకటన చేశారని గుర్తుచేశారు. అమెరికా - ఇరాన్ మధ్య అత్యున్నత స్థాయిలో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ ఉందని రిజ్వాన్ సయీద్ షేక్ చెప్పారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి అంతరాయం కలిగే ముప్పు ఉంటుందన్నారు. గతంలోనూ ఈవిధంగా సీజ్ ఫైర్ డీల్స్‌కు అంతరాయం కలిగిన దాఖలాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

పాక్ విశ్వసనీయ దేశం కాదు : ఇజ్రాయెల్ రాయబారి
ఇరాన్ - అమెరికా కాల్పుల విరమణ చర్చలకు పాకిస్థాన్‌‌ పోషిస్తున్న మధ్యవర్తిత్వ పాత్రపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ర్యూవెన్ అజర్ సందేహాలు వెలిబుచ్చారు. పాకిస్థాన్‌ను ఒక విశ్వసనీయ దేశంగా తాము పరిగణించమని ఆయన స్పష్టం చేశారు. పాక్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకోవడానికి అమెరికాకు దాని సొంత కారణాలు ఉన్నాయని ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యానించారు. గతంలో గాజా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌కు శాంతి ఒప్పందాన్ని కుదర్చడానికి సైతం ఖతార్, తుర్కియే లాంటి సమస్యాత్మక దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి పనిచేశారన్నారు. అమెరికాతో ఏకీభవిస్తూ ఉండటం తమకు చాలా ముఖ్యమని, కానీ ఇజ్రాయెల్ కోరుకునే ఫలితాలు రావాల్సి ఉంటుందని ర్యూవెన్ అజర్ పేర్కొన్నారు.

లెబనాన్‌‌కు, ఇరాన్‌ వ్యవహారంతో సంబంధమే లేదు
"ఇరాన్, హిజ్బుల్లా (లెబనాన్)లతో ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. దక్షిణ లెబనాన్‌లో ఇరాన్ సమర్ధిత హిజ్బుల్లా మిలిటెంట్ల కార్యకలాపాలను, మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా నిర్మూలించడం మా దేశం లక్ష్యం. ఈ బాధ్యత లెబనాన్ ప్రభుత్వానిది కూడా. ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణకు మేం సుముఖమే. 15 పాయింట్ల ప్లాన్‌లోని షరతుల ప్రకారమే ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాం. ఇరాన్‌ నుంచి ఇజ్రాయెల్‌‌ ఉనికికి పొంచి ఉన్న రెండు ప్రధానమైన ముప్పులను తొలగించాలి. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం, బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీలను అడ్డుకునేలా ఒప్పందం కుదరాలని మేం కోరుకుంటున్నాం" అని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ర్యూవెన్ అజర్ తెలిపారు.

హిజ్​బొల్లా కార్యకలాపాలను అంగీకరించం
"దక్షిణ లెబనాన్‌లో మేం నిర్వహిస్తున్న ఆపరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. లెబనాన్‌లో చేస్తున్న ఆపరేషన్‌కు, ఇరాన్‌పై చేసిన సైనిక చర్యతో సంబంధమే లేదు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. వాటి నుంచి దేశాన్ని రక్షించుకునే హక్కు మాకుంది. గత కొన్ని గంటల్లో లెబనాన్‌లో ఇజ్రాయెలీ సేనలు భీకర ఆపరేషన్లు నిర్వహించాయి. వీటిలో 250 మందికిపైగా హిజ్బుల్లా మిలిటెంట్లు హతమయ్యారు. గత సంవత్సరం లెబనాన్‌తో తమకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలోని షరతులు ఇకపైనా అమలు కావాలని మేం కోరుకుంటున్నాం. అయితే లితానీ నది దక్షిణ ప్రాంతంలో హిజ్బుల్లా మిలిటెంట్ల కార్యకలాపాలు కొనసాగడాన్ని మేం అంగీకరించం. హిజ్బుల్లా నిరాయుధీకరణ జరగాల్సిందే. ఈవిషయంలో లెబనాన్ ప్రభుత్వం మరింత కీలకమైన పాత్ర పోషించాలని మేం కోరుకుంటున్నాం. కేవలం చర్చలతో ఆగిపోకుండా, హిజ్బుల్లా స్థావరాల తొలగింపునకు లెబనాన్ ప్రభుత్వం పూనుకోవాలి. తద్వారా ఇకపై ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులు జరగని వాతావరణాన్ని సృష్టించాలి" అని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ర్యూవెన్ అజర్ చెప్పారు.

హర్మూజ్​లో ఇరాన్ సముద్ర మైన్లు అమర్చిందా? ఒత్తడి పెంచే వ్యూహమా?

నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు- మళ్లీ గ్రీన్ ల్యాండ్ వైపు దృష్టి మళ్లిందా?