ETV Bharat / international

వెనెజువెలా 'చమురు' అంత ఈజీ కాదు- ట్రంప్ ఈ సవాళ్లను అధిగమిస్తేనే టార్గెట్​ రీచ్​!

కేవలం సైనిక చర్యతో వెనెజువెలా ‘బ్లాక్ గోల్డ్‌‌’పై కబ్జా కష్టమే- ట్రంప్ సర్కారు ఎదుట ఎన్నో సవాళ్లు-ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరితేనే ఆ ఛాన్స్

Venezuela Oil Reserves
Venezuela Oil Reserves (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 10:27 PM IST

8 Min Read
Choose ETV Bharat

Venezuela Oil Reserves : అమెరికా ట్రంప్ సర్కారు కన్ను వెనెజువెలాలోని అపారమైన చమురు సంపదపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా వెనెజువెలా గడ్డపై ఉన్న 303 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిక్షేపాలను అమెరికా కంపెనీల చేతిలో పెట్టాలనే ప్లాన్‌తో ట్రంప్ ఉన్నారు. అదే జరిగితే ప్రపంచంలోని మరో 17 శాతం చమురు నిక్షేపాలు అమెరికా కనుసన్నల్లోకి వస్తాయి. అయితే ఈ పని ఇప్పటికిప్పుడు ఈజీగా జరిగిపోదు. దాదాపు దశాబ్ద కాలం పట్టొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే క్రమంలో అమెరికా ప్రభుత్వం రాజకీయ, విదేశాంగ, వాణిజ్య, చట్టపరమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఇంతకీ అవేమిటి? వెనెజువెలా చమురు పరిశ్రమ నుంచి అమెరికా ఏం ఆశిస్తోంది? ఆ దేశ చమురు పరిశ్రమ పునరుజ్జీవనాన్ని పొందితే ప్రపంచ దేశాలకు ఏం లాభం? చౌక ధరకే చమురును విక్రయిస్తున్న రష్యాపై ఎఫెక్ట్ ఎంత? ఈ కథనంలో చూద్దాం.

అసలు టార్గెట్ చమురు సంపదే
జనవరి 3న (శనివారం) తెల్లవారుజామున వెనెజువెలాపై అమెరికా ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్ కమాండోలు ఆకస్మిక దాడి చేశారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణిని అరెస్టు చేసి ప్రత్యేక విమానంలో న్యూయార్క్‌ నగరానికి తీసుకెళ్లారు. వెనెజువెలా నుంచి అమెరికాకు డ్రగ్స్ స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే అభియోగాలతో మదురోపై అమెరికా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇదంతా నాణేనికి ఒక వైపు లాంటిది. వెనెజువెలాలోని అపారమైన ముడి చమురు నిక్షేపాలపై అగ్రరాజ్యం అమెరికా కన్ను అనేది నాణేనికి మరో వైపు లాంటిది. వీటి కోసమే, వెనెజువెలాలో ప్రభుత్వాన్ని మార్చాలనే ప్లాన్‌ను ట్రంప్ సర్కారు అమలు చేసింది. ఇందులో భాగంగానే మదురో దంపతులను అమెరికా అపహరించింది. ఈ వ్యవహారానికి ‘అరెస్టు’ అనే ట్యాగ్‌ను తగిలించింది. ప్రస్తుతం వెనెజువెలాలో అమెరికా సైనికులు లేరు. కానీ ఆ దేశం సమీపంలోని కరీబియన్ సముద్ర జలాల్లో అమెరికాకు చెందిన దాదాపు 12 యుద్ధ నౌకలు ఉన్నాయి. వాటిలో దాదాపు 15వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఒకవేళ అవసరమైతే తదుపరిగా గ్రౌండ్ ఆపరేషన్ చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

వెనెజువెలాలోకి అమెరికా ఎంట్రీతో ఏమవుతుంది ?
ప్రస్తుతం వెనెజువెలాలోని ముడి చమురు క్షేత్రాల్లో రోజుకు దాదాపు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో వెనెజువెలా వాటా 1 శాతం కంటే తక్కువే ఉంది. వాస్తవానికి 1999 సంవత్సరం నాటికి వెనెజువెలాలో రోజుకు 3.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అయ్యేది. అయితే ప్రభుత్వపరమైన అవినీతి అక్రమాలు, ముడి చమురు కంపెనీల నిర్వహణలో లోపాలు, అమెరికా ఆర్థిక ఆంక్షల ప్రభావంతో వెనెజువెలా చమురు పరిశ్రమ పతనమైంది. దాని ఉత్పత్తి సామర్థ్యం (రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్లు) ప్రస్తుత స్థాయికి పతనమైంది. ఎగ్జాన్ మొబిల్, చెవ్రాన్, కొనొకో ఫిలిప్స్, ఓక్సిడెంటల్ పెట్రోలియం (ఓక్సీ), ఈఓజీ రిసోర్సెస్ అనేవి అమెరికాలోని దిగ్గజ చమురు రంగ కంపెనీలు. వెనెజువెలాలోకి ఈ సంస్థలు ఎంట్రీ ఇస్తే, ముడి చమురు ఉత్పత్తి రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామంతో వెనెజువెలా అనేది ప్రపంచ చమురు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారుతుందని అంటున్నారు. ఫలితంగా రాబోయే కొన్నేళ్లలో ముడి చమురు ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. దీనివల్ల చౌక ధరకు చమురును విక్రయిస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇన్నేళ్లుగా వెనెజువెలా చమురు పరిశ్రమ పతనావస్థలో ఉన్నందు వల్ల రష్యా చమురు పరిశ్రమ గణనీయమైన లబ్ధిని పొందిందని మార్కెట్ పరిశీలకులు తెలిపారు.

అమెరికా కంపెనీలకు ఆనాడు రెడ్ కార్పెట్
1910వ దశకం నాటికి వెనెజువెలా చాలా పేద దేశం. దేశంలోని మరకైబో సరస్సులో భారీ ముడి చమురు నిక్షేపాలు ఉన్నట్లు 1922లో గుర్తించారు. దేశ తూర్పు ప్రాంతంలోని పలు మైదానాల్లోనూ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో 1920వ దశకంలోనే అమెరికా, ఐరోపా దేశాల కంపెనీలు వెనెజువెలాకు క్యూ కట్టాయి. భారీ రాయల్టీలు, పన్నుల ఆశతో నాటి ప్రభుత్వాలు ఈ కంపెనీలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేశాయి. ఈవిధంగా అమెరికా కంపెనీలు చెవ్రాన్, ఎగ్జాన్, బ్రిటన్ కంపెనీ షెల్ వెనెజువెలాలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో 1930 నాటికి వెనెజువెలాకు ప్రధాన ఎగుమతి వ్యాపార వనరుగా ముడి చమురు మారింది. 1950వ దశకం నాటికి వెనెజువెలా ఆర్థికంగా ఎదిగింది. దేశ ప్రజల తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలో 4వ స్థానానికి ఎగబాకింది. ఆ సమయానికి వెనెజువెలా చమురు కోసం అమెరికా నుంచి భారీ ఆర్డర్లు వచ్చేవి. పశ్చిమాసియా ప్రాంతంలోని అరబ్ దేశాల చమురు మార్కెట్ నుంచి తీవ్ర పోటీని వెనెజువెలా ఎదుర్కొనేది. 1960లో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్) కూటమిలో వెనెజువెలా చేరింది. ఒపెక్ కూటమిని స్థాపించిన 5 దేశాల్లో ఇది కూడా ఒకటి. ఈనేపథ్యంలో 1976 జనవరి 1న దేశ చమురు పరిశ్రమను నాటి దేశాధ్యక్షుడు కార్లోస్ ఆండ్రెస్ పెరెజ్ జాతీయం చేశారు. ‘పెట్రోలియోస్ డీ వెనెజువెలా ఎస్‌ఏ’ (పీడీవీఎస్‌ఏ)‌తో ప్రభుత్వ చమురు కంపెనీని ఏర్పాటు చేశారు. దీనితో అమెరికా కంపెనీ చెవ్రాన్ జట్టు కట్టింది. నాటి నుంచి నేటివరకు వెనెజువెలాలో ‘పీడీవీఎస్‌ఏ - చెవ్రాన్’ జాయింట్ వెంచర్ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటి సంయుక్త కంపెనీ ప్రస్తుతం వెనెజువెలాలో రోజుకు 2.50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.

హ్యూగో చావెజ్ నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభం
1990వ దశకంలో చమురు రంగంలోకి విదేశీ పెట్టుబడులను వెనెజువెలా ఆహ్వానించింది. అయితే హ్యూగో చావెజ్ అధికారంలోకి రావడంతో 1999 తర్వాత సీన్ మారిపోయింది. ఆయన చమురు పరిశ్రమను మళ్లీ ప్రభుత్వ కంపెనీ పీడీవీఎస్‌ఏ చేతుల్లో పెట్టారు. చమురు క్షేత్రాలు, పరిశ్రమలపై ప్రభుత్వ నియంత్రణను పెంచారు. ఈ వ్యవధిలో వెనెజువెలాలోని చమురు పరిశ్రమ సాంకేతికంగా అప్‌గ్రేడ్ కాలేదు. వెరసి, 2000వ దశకంలో దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా దేశ ప్రజల జీవన దుర్భరంగా మారింది. నిత్యావసర సరుకుల కొరత ఏర్పడింది. ఈనేపథ్యంలో 2007లో నాటి వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చమురు ఉత్పత్తి క్షేత్రాల్లో ఎక్కువ భాగాన్ని జాతీయం చేశారు. అమెరికన్ కంపెనీలు ఎగ్జాన్ మొబిల్, కొనొకో ఫిలిప్స్‌‌లు తమ దేశంలో వ్యాపారం చేయకుండా బ్యాన్‌ను విధించారు.

అమెరికన్ కంపెనీలకు అందుకే ఆసక్తి
వెనెజువెలాలోని చమురు, సహజ వాయువు పరిశ్రమ మార్కెట్ విలువ దాదాపు రూ.16వేల కోట్లు. 2025 జనవరి - జులై మధ్యకాలంలో ఆ దేశ ప్రభుత్వరంగ కంపెనీ ‘పీడీవీఎస్‌ఏ’ రూ.624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2030 నాటికి దేశ చమురు పరిశ్రమ మార్కెట్ విలువ రూ.19వేల కోట్లు దాటుతుందని అంచనా. అందుకే వెనెజువెలాపై తాజా సైనిక చర్య తర్వాత అమెరికన్ ఇంధన రంగ కంపెనీలు అలర్ట్ మోడ్‌లోకి వచ్చాయి. ఆ దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అవి నిశితంగా పరిశీలిస్తున్నాయి. అక్కడ రాజకీయపరమైన సుస్థిరత ఏర్పడిన తర్వాతే పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని అమెరికన్ కంపెనీలు అంటున్నాయి. భారీ చమురు నిక్షేపాలకు నెలవైన వెనెజువెలాలో చోటుచేసుకునే పరిణామాల వల్ల కచ్చితంగా ప్రపంచ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం పడుతుందని చెబుతున్నాయి.

వెనెజువెలా చట్టాల ప్రకారం పనిచేస్తున్నాం : చెవ్రాన్
‘‘వెనెజువెలాలోని మా ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుతో పాటు ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించాం. మేం అన్ని దేశీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం’’ అని అమెరికన్ కంపెనీ చెవ్రాన్ ప్రతినిధి బిల్ టురెన్నే తెలిపారు.

భవిష్యత్ పెట్టుబడుల గురించి ఇప్పుడే చెప్పలేం : కొనొకో ఫిలిప్స్
‘‘మా కంపెనీ వెనెజువెలాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరా, స్థిరత్వంపై ఆ పరిణామాల సంభావ్య ప్రభావాలను మేం పర్యవేక్షిస్తున్నాం. భవిష్యత్తులో ఆ దేశంలో మేం పెట్టే పెట్టుబడుల గురించి ఇప్పుడే ఊహాగానాలు చేయడం సరికాదు. అలాంటి విషయాలపై మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు’’ అని అమెరికన్ కంపెనీ కొనొకో ఫిలిప్స్ ప్రతినిధి డెన్నిస్ నస్ పేర్కొన్నారు.

రాజకీయ సుస్థిరత, చమురు అనుబంధం, టెక్ అప్‌గ్రేడింగ్
ప్రస్తుతానికి వెనెజువెలా, అమెరికా మధ్య సంబంధాలు అంత బాగా లేవు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు ఇప్పటికీ మదురోకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఈ వాణి మారిన తర్వాతే అమెరికన్ కంపెనీలు వెనెజువెలా మార్కెట్‌లోని అవకాశాల గురించి ఆలోచిస్తాయి. 1990 నుంచి 1999 వరకు వెనెజువెలా సర్కారు చమురు రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. కానీ 1999లో ప్రభుత్వం మారాక విధానాలు మారిపోయాయి. విదేశీ పెట్టుబడులకు హ్యూగో చావెజ్ బ్రేక్ వేశారు. ఈ తరహాలో ప్రభుత్వ విధానాల్లో అనిశ్చితి ఉంటే పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు ఆసక్తి చూపవు. వెనెజువెలాలో రాజకీయపరమైన సుస్థిరత ఏర్పడితేనే విధానపరమైన అనిశ్చితి తొలగుతుంది. కేవలం సైనిక బలంతో వెనెజువెలాలోని చమురు సంపదపై అమెరికా పట్టును సాధించడం కుదరదు. ఇందుకోసం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ముందుకుసాగాలి. వెనెజువెలాతో దౌత్య, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. స్నేహపూర్వక వాతావరణంలో ‘చమురు’ అనుబంధాన్ని నెలకొల్పుకోవాలి. ఆ తర్వాత వెనెజువెలాలోని చమురు పరిశ్రమలను సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేయడంపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. 2000వ దశకం నుంచి నేటిదాకా అక్కడి ఆయిల్ ఇండస్ట్రీలలో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ జరగలేదు. ఫలితంగా ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. దశలవారీగా ఈ సవాళ్లన్నీ అధిగమిస్తేనే, పొరుగుదేశం వెనెజువెలాలోని చమురు సంపద నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ధిపొందే అవకాశాలు ఉంటాయి.

అప్పటి వరకు అమెరికా కంపెనీలు వేచిచూడాలి
‘‘వెనెజువెలాలోని చమురు క్షేత్రాల్లో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే, దేశంలోని ప్రభుత్వం స్థిరమైన పాలన అందిస్తుందనే నమ్మకం ఏర్పడాలి. ప్రస్తుతానికి దేశంలో పాలనాపరమైన అనిశ్చితి, రాజకీయ అస్థిరత ఉన్నాయి. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలుగా సేవలు అందిస్తున్న నాయకురాలు ఇప్పటికీ మదురోకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ వాణి మారితేనే అమెరికన్ కంపెనీలు వెనెజువెలా మార్కెట్ గురించి ఆలోచిస్తాయి. అప్పటి వరకు అమెరికా ఇంధన కంపెనీలు ఓపికగా వేచిచూడాలి’’ అని అమెరికాకు చెందినప్రైస్ ఫ్యూచర్స్ గ్రూప్‌లోని సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు ఫిల్ ఫ్లిన్ అన్నారు.

చమురు పరిశ్రమ పునర్నిర్మాణం రాత్రికి రాత్రి జరగదు
‘‘తాజాగా అమెరికా సైనిక చర్యలో వెనెజువెలాలోని ముడి చమురు పరిశ్రమ మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆంక్షల వల్ల ఆ దేశంలోని చమురు పరిశ్రమ సాంకేతికంగా అప్‌డేట్ కాలేదు. ఫలితంగా ఆయా చమురు పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. వాటిని పునర్నిర్మాణం, ఆధునికీకరణ కోసం చాలా టైం పడుతుంది. ఇందుకోసం అమెరికన్ కంపెనీలు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. రాత్రికి రాత్రి ఏదీ చేయలేం’’ అని ప్రపంచ గ్యాసోలిన్ ధరలను ట్రాక్ చేసే సంస్థ గ్యాస్‌బడ్డీలోని ప్రధాన పెట్రోలియం విశ్లేషకుడు పాట్రిక్ డి హాన్ పేర్కొన్నారు.

చట్టపరమైన సవాళ్లు ఉండబట్టే ట్రంప్ స్వరం మారింది
‘‘వెనెజువెలాలోని అపారమైన చమురు సంపదతో అమెరికా ప్రయోజనం పొందడం అంత ఈజీ విషయమేం కాదు. ఇందుకు కొన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే(2001 - 2009) ఈ విషయాన్ని గుర్తించారు. నేను ఆ టైంలో బుష్ సర్కారులో జాతీయ భద్రతా అధికారిగా వ్యవహరించాను. కేవలం సైనిక ఆక్రమణ ద్వారా వెనెజువెలా చమురు సంపదను అమెరికా హస్తగతం చేసుకోవడం కుదరకపోవచ్చు. అందుకేనేమో వెనెజువెలాలో ఉన్న భారీ చమురు పరిశ్రమలు ఆ దేశానివి కావని, వాటిని అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని ట్రంప్ సర్కారు వాదిస్తోంది. 1976లో అమెరికన్ కంపెనీలను వెనెజువెలా ప్రభుత్వం జాతీయం చేసిన విషయాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్నారు. అమెరికా, వెనెజువెలా ప్రభుత్వాల స్థాయిలో ద్వైపాక్షిక అంగీకారం కుదిరితేనే చమురు పరిశ్రమల నిర్వహణపై అధికారిక నిర్ణయాలను తీసుకోవడం సాధ్యమవుతుంది. అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నది కూడా ఇదే’’ అని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్ మ్యాథ్యూ వాక్స్‌మన్ పేర్కొన్నారు.