ETV Bharat / international

మదురో న్యాయవిచారణపై ఖర్చు చేస్తే ఖబడ్దార్- వెనెజువెలా చమురు ఆదాయంపై ట్రంప్ కీలక ఆదేశం

వెనెజువెలా చమురు ఆదాయంతో మదురోకు సాయం చేయొద్దు - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం - వెనెజువెలా చమురుపై అమెరికా ప్రభుత్వంతోనే ఒప్పందాలు చేసుకోండి - అమెరికా ఇంధన కంపెనీలకు ట్రంప్ సూచన

TRUMPS EXECUTIVE ORDER
TRUMPS (AP News)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 9:58 AM IST

|

Updated : January 11, 2026 at 10:46 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump's Executeve Order : వెనెజువెలా ముడి చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేశారు. ఆ దేశానికి ముడి చమురు ద్వారా వచ్చే రాబడిని మదురో దంపతులకు సంబంధించిన కోర్టు కేసుల్లో వినియోగించకుండా రక్షణ కల్పించడమే ఈ ఆదేశం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఒకవేళ వెనెజువెలా ఆర్జించే చమురు ఆదాయాన్ని మదురోకు న్యాయ సహాయం చేయడానికి వెచ్చిస్తే, ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సుస్థిరతకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతుందని ఆదేశంలో పేర్కొన్నారు.

ఆ సమావేశం జరిగిన 24 గంటల్లోనే ‘ఆర్డర్‌’
గత శుక్రవారం అమెరికాలోని దిగ్గజ ఇంధన రంగ కంపెనీల సీఈఓలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమయ్యారు. వెనెజువెలా చమురు మార్కెట్‌లోని అవకాశాలు, అక్కడ అమెరికా కంపెనీలు పెట్టుబడులు పెట్టడంపై చర్చించారు. ఈసందర్భంగా ఎగ్జాన్ మొబిల్ కంపెనీ సీఈఓ డారెన్ వుడ్స్ కీలక సూచన చేశారు. ప్రస్తుతం వెనెజువెలా అమలుచేస్తున్న వాణిజ్య విధానాలు, దానితో ముడిపడిన కార్యాచరణ వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడులు పెట్టడం కష్టమని స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, వెనెజువెలా చమురుకు సంబంధించి ఆ దేశ ప్రభుత్వంతో కాకుండా నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే ఒప్పందాలను కుదుర్చుకోవాలన్నారు. తద్వారా నిర్భయంగా వెనెజువెలా చమురుతో వ్యాపారాన్ని చేయాలని అమెరికా కంపెనీలను ఆయన కోరారు. వెనెజువెలాలోని ముడి చమురు రంగ మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి భారీ పెట్టుబడులు పెట్టాలని వాటికి పిలుపునిచ్చారు. ఇకపై వెనెజువెలా నుంచి ప్రపంచ దేశాలకు జరిగే ముడి చమురు సప్లైలను కూడా అమెరికాయే నియంత్రిస్తుందని తెలిపారు. ఈ సమావేశం జరిగిన 24 గంటల్లోనే వెనెజువెలా దేశ ముడి చమురు ఆదాయాల వినియోగంపై పరిమితులను విధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆదాయంతో మాజీ వెనెజువెలా ప్రెసిడెంట్ మదురోకు న్యాయం సహాయం లభించరాదని తేల్చిచెప్పారు. తద్వారా వెనెజువెలాకు మాజీ ప్రెసిడెంట్ మదురో వెంటనే తిరిగి రాడు అనే గ్యారంటీని అమెరికా ఇంధన రంగ కంపెనీలు ట్రంప్ నుంచి పొందాయి.

ఆర్డర్‌లోని ఒక్క వాక్యంతో ఫుల్ క్లారిటీ
మొత్తం మీద ఆర్థికంగా, వాణిజ్యపరంగా వెనెజువెలాను ఏలాలి అనే స్కెచ్‌తో అమెరికా సర్కారు సమాయత్తం అవుతోంది. ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లోని ఒక్క వాక్యంతో ఈవిషయం తేటతెల్లం అవుతోంది. ‘‘వెనెజువెలా చమురుతో వచ్చే ఆదాయం కచ్చితంగా ఆ దేశానిదే. అమెరికా నిర్వహణలో ఉండే ఆ ఆదాయాన్ని వెనెజువెలా ప్రభుత్వ అవసరాలు, దౌత్య అవసరాలకు వినియోగించొచ్చు. ప్రైవేటు అవసరాలకు వాడకూడదు’’ అని ఆర్డర్‌లో స్పష్టంగా ప్రస్తావించారు. ఇందులో ప్రైవేటు అవసరాలు అంటే మాజీ ప్రెసిడెంట్ మదురో దంపతులు అమెరికాలో ఎదుర్కొంటున్న కోర్టు కేసులు. వాటి కోసం వెనెజువెలా చమురు ఆదాయాన్ని వెచ్చించరన్న మాట. అమెరికా జాతీయ అత్యవసరాల చట్టం, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ఈ ఆర్డర్‌ను ట్రంప్ జారీ చేశారు. ఒకవేళ వెనెజువెలా చమురు ఆదాయ వనరుల నుంచి మదురోకు న్యాయ సహాయం లభిస్తే, అది అమెరికాకు అసాధారణ ముప్పుగా పరిణమిస్తుందన్నారు.

వెనెజువెలా ప్రజలంటే చాలా ఇష్టం
‘‘వెనెజువెలా ప్రజలంటే నాకు చాలా ఇష్టం. ఆ దేశ ప్రజలను సంపన్నులుగా చేయడానికి, సేఫ్‌గా మార్చడానికి ఇప్పటికే నేను కసరత్తును మొదలుపెట్టాను. అమెరికా సైనిక ఆపరేషన్‌ను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వెనెజువెలా ప్రజలందరికీ నా ధన్యవాదాలు’’ అంటూ తాజాగా తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.

'ఇరాన్‌కు స్వేచ్ఛ కావాలి- సాయం చేయడానికి అమెరికా రెడీ'- ట్రంప్ సంచలన ప్రకటన

'పుతిన్‌ను కూడా అమెరికా అరెస్ట్ చేస్తుందా?'- ట్రంప్ సమాధానం ఏంటంటే?

Last Updated : January 11, 2026 at 10:46 AM IST