ETV Bharat / international

ఇరాన్​ను చావు దెబ్బకొడతాం- ప్రజలను చంపితే మా జోక్యం తప్పదు: ట్రంప్ వార్నింగ్​

ఇరాన్​లో నిరసనలపై ట్రంప్ హెచ్చరికలు- నిశితంగా గమనిస్తున్నామన్న అమెరికా అధ్యక్షుడు

TRUMP
TRUMP (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 10:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Trump On Iran : ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం చాలా నిశితంగా గమనిస్తోందని, అక్కడి నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

అలా జరగకూడదనేదే మా కోరిక: ట్రంప్
శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్ హౌస్‌లో అగ్రశ్రేణి చమురు, వాయు రంగ ప్రతినిధులతో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పరిస్థితిపై ప్రశ్నించగా, "ఆ దేశం పెద్ద సమస్యల్లో ఉంది. ఎవరూ ఊహించని నగరాల్లో ప్రజలు నియంత్రణ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. మేం పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలుపెడితే మేం జోక్యం చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పా. అప్పుడు బూట్లు నేలపై దించాల్సిన అవసరం లేకుండా, వారికి ఎక్కువ నష్టం కలిగేలా తీవ్రంగా దాడి చేస్తాం. అలా జరగకూడదనేదే మా కోరిక" అని ట్రంప్ అన్నారు.

పరిస్థితి చాలా ప్రమాదకరంగా!
ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలు అసాధారణంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. "ఇది చూడటానికి ఆశ్చర్యకరంగా ఉంది. ఇరాన్ పాలకులు ప్రజలను చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం ఎదుర్కొంటున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మేము ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నాం" అని చెప్పారు. నిరసనకారుల భద్రతపై కూడా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. "ఇరాన్‌లో నిరసనకారులు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాను. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇరాన్ నాయకులకు మరోసారి చెబుతున్నాను. కాల్పులు మొదలుపెట్టొద్దు. మీరు కాల్చితే మేమూ కాల్చుతాం" అంటూ ఆయన కఠిన హెచ్చరిక చేశారు.

ఇదిలా ఉండగా, "ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్" అనే విధాన పరిశోధనా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, జనవరి 7 తర్వాత ఇరాన్‌లో నిరసనల తీవ్రత గణనీయంగా పెరిగింది. టెహ్రాన్‌తో పాటు వాయవ్య ఇరాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయని ఆ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితిని అణిచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, అరుదుగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) భూసేనలను కూడా కొన్ని ప్రావిన్సుల్లో వినియోగించిందని నివేదిక పేర్కొంది.

ట్రంప్​పై అల్లరిమూకల ఆశలు: ఖమేనీ
ఇదే సమయంలో, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న భారీ నిరసనల వెనుక అమెరికా పరిపాలన హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జనవరి 9న ప్రజలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఖమేనీ, నిరసనకారులు అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టేందుకే విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు. "టెహ్రాన్‌లో నిన్న రాత్రి, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కొందరు విధ్వంసకులు తమ దేశానికి చెందిన భవనాలనే ధ్వంసం చేశారు. అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టడానికే ఇలా చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ నేను మీ పక్షాన ఉంటానని అన్నారు. ఈ అల్లరిమూకలు ఆశలు పెట్టుకున్నాయి. చేతనైతే ముందు తన దేశాన్నే సరిగా పాలించాలి. అక్కడే ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత ట్రంప్‌ శైలిని ప్రస్తావించారు. ప్రపంచ చరిత్రలో అహంకార శిఖరంలో ఉన్నప్పుడుపాలకులు కూలిపోయారని గుర్తు చేశారు. "విదేశీయుల కోసం పనిచేసే దళారీ వ్యవస్థను మా దేశం సహించదు. ఫరో, నిమ్రోదు, రేజాఖాన్, మొహమ్మద్ రేజా వంటి పలువురు అహంకార గర్వంలో ఉన్నప్పుడే పతనమయ్యారు. ఈ వ్యక్తి కూడా అలాగే కూలిపోతాడు" అని ఖమేనీ హెచ్చరించారు. ఒకవైపు ట్రంప్ కఠిన హెచ్చరికలు, మరోవైపు ఖమేనీ ప్రతిఆరోపణలతో ఇరాన్ పరిణామాలు అంతర్జాతీయంగా మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.

కొలంబియా అధ్యక్షుడిని ఫిబ్రవరిలో కలుస్తా: ట్రంప్

'వచ్చే వారం అమెరికాకు వెనెజువెలా విపక్ష నేత మచాడో వచ్చే ఛాన్స్​'- ట్రంప్ వెల్లడి